Ghost Fair……………………………………………..
దెయ్యాల జాతరా ? అవునండీ.. మన దేశంలోనే దెయ్యాల పేరిట జాతరలు జరిగే ప్రదేశాలున్నాయి. చాలామంది ఈ విషయం విని ఉండక పోవచ్చు. దీన్నే భూత్ మేళా అని కూడా అంటారు. ఝార్ఖండ్ రాష్ట్రం పాలము జిల్లాలోని హైదర్‌నగర్ ప్రాంతం లో ఈ జాతర జరుగుతుంది. ఇక్కడి శీతల మాత ఆలయ పరిసరాల్లో ఛైత్రీ నవరాత్రుల సమయంలో ఈమేళా నిర్వహిస్తారు.
పాలముతో పాటు గర్వ, లతేహా, ఛత్ర ప్రాంతాల్లో ఈ దెయ్యాల జాతర చాలా ఫేమస్. దేశం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడకు వస్తారు. బీహార్, బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది తమ కుటుంబ సభ్యలను తీసుకుని వస్తుంటారు.దెయ్యాలను వదిలించే పూజలు చేసే వారు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు తీసుకుంటారు.
ప్రజలు భారీగా తరలి వచ్చినపుడు పోలీసులు బందోబస్తు సైతం ఏర్పాటు చేస్తారు. సందర్శకుల కోసం మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తుంటారు. ప్రతి సీజన్ లో ఇక్కడ దుష్ట శక్తులు ఆవహించిన వాళ్ళను బంధువులు తీసుకొస్తుంటారు. తమకు దెయ్యాలు పట్టాయని భ్రమ పడేవారు, తమకు కీడు సోకిందని తలిచే వారు వేలాదిగా ఇక్కడకు తరలి వస్తుంటారు.
వీరంతా మిట్ట మధ్యాహ్నం పిడకలతో వేసిన మంటల ముందు నిలబడి ఊగి పోతుంటారు. హాహాకారాలు చేస్తుంటారు. మంత్రగాళ్ళు వేపమండలతో వారిని కొడుతుంటారు. విభూది జల్లుతుంటారు. కాసేపటి తర్వాత వాళ్ళు మామూలు మనుష్యులవుతారు. తమను దెయ్యం వదిలి పారిపోయిందని భావిస్తుంటారు. తర్వాత శీతల మాత ను దర్శించుకుని ఇళ్లకు వెళతారు. ఇక్కడ కొన్ని వందల ఏళ్ళనుండి ఈ జాతర జరుగుతుంది.
ఇలాంటి జాతరే మధ్యప్రదేశ్‌లోని మలాజ్‌పూర్ (బేతుల్ జిల్లా) గ్రామంలో ప్రతి ఏటా జరుగుతుంది. మలాజ్‌పూర్ దెయ్యాల జాతర 400 సంవత్సరాల నుండి ఉనికిలో ఉంది. ఏటా ఈ జాతర దాదాపు మూడు వారాల పాటు సాగుతుంది. ఈ సమయంలో, దుష్టశక్తులు, దెయ్యాల బారిన పడిన వ్యక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తుంటారు.
మలాజ్‌పూర్ దెయ్యాల జాతర కథ 18వ శతాబ్దం నాటిది. కొన్ని అద్భుత శక్తులు కలిగిన దేవ్ జీ మహారాజ్ అనే వ్యక్తి ఒకసారి ఈ గ్రామాన్ని సందర్శించాడు. స్థానికుల కథనం ప్రకారం… దేవ్ జీ మట్టిని బెల్లం గాను , రాళ్లను కొబ్బరికాయగా మార్చి తన స్నేహితులకు ఆహారంగా ఇచ్చేవాడు.
తరువాత దేవ్ జీ తన శక్తులతో చెడు ఆత్మలను నియంత్రించడం ప్రారంభించాడు. దుష్ట శక్తులతో పీడింపబడుతున్నవారిని కాపాడేవాడని చెబుతారు. అతని వారసులకు కూడా ఈ విద్యలు అబ్బాయి. వారు కూడా దెయ్యాలను వదిలించే కార్యక్రమాలు మొదలు పెట్టారు. తర్వాత కాలంలో దేవ్ జీ కి ఆలయం కూడా నిర్మించారు.
దేవ్ జీ వారసులే ఈ ఆలయం పూజారులు గా వ్యవహరిస్తుంటారు. దుష్ట ఆత్మలను వీరే వదిలిస్తుంటారని స్థానికులు చెబుతుంటారు. ప్రతి ఏటా వేలాది మంది ప్రజలు ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. భూతవైద్యం పేరిట స్త్రీ పురుషుల జుట్టు పట్టుకుని లాగడం, చీపుర్లతో క్రూరంగా కొట్టడం వంటి దృశ్యాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటాయి.
ఆత్మతో పోరాడుతున్నప్పుడు పూజారి “గురు మహారాజ్ దేవోజీ కీ జై” అనే నినాదాన్ని ఇస్తుంటారు. స్థానికులకు ఇది సాధారణమైన విషయం అనిపిస్తుంది. కొత్తగా వచ్చే వారికి కొంత హింసాత్మకంగా కనిపిస్తుంది. పూజారి తన ‘ఆధీనంలో ఉన్న’ ఆత్మను విచిత్రమైన ప్రశ్నలు అడుగుతాడు. బాధితుడి శరీరాన్ని వదిలి వెళ్లమని అరుస్తాడు.
కాసేపటికి బాధితుడు పడిపోతాడు. లేచిన తర్వాత మామూలు మనిషి గా కనిపిస్తాడు. చాలామంది ఈ విధానాన్ని నమ్ముతారు.మానవ హక్కుల సంస్థలు, కార్యకర్తలు ఇదంతా ట్రాష్ అంటారు. ఈ కార్యక్రమాలను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటివి దాదాపుగా అన్ని చోట్లా జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ కార్యక్రమాన్ని దెయ్యాల జాతర అని ఎందుకు పిలుస్తారో అర్ధం కాని విషయం. దెయ్యాలను వదిలించే జాతర అంటే బాగుండేది.