ఓ … ఓ …. ఓ … ఓపిగ్గా చూడాలి !

Sharing is Caring...

Weak Story ……………………………………..

లైగర్ సినిమా మరీ అంత చెత్త సినిమా కాదు. హిట్ ముద్ర వేసుకున్న చాలా సినిమాల కంటే ఫర్వాలేదు. కొంచెం ఓపికతో ఒక సారి చూడొచ్చు. విడుదలకు ముందు హైప్ క్రియేట్ చేసారు. ఆ స్థాయిలో సినిమా లేకపోవడంతో ప్లాప్ అయి .. నెల కాకముందే ఓటీటీ లోకి వచ్చింది. హాట్ స్టార్ లో లైగర్ ఇపుడు స్ట్రీమింగ్ అవుతోంది.

టేకింగ్ పరంగా సినిమా బాగున్నప్పటికీ … రిచ్ గా ఉన్నప్పటికీ లైగర్ సినిమా లో కథ బలహీనంగా ఉంది. అన్ని కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాత, దర్శకులు కథపై మరింత కసరత్తు చేస్తే బాగుండేది. ఈ తరహా కథలు గతంలో చాలానే వచ్చాయి. స్పోర్ట్స్ డ్రామా గా రూపొందాల్సిన సినిమా లవ్ స్టోరీ గా తయారైంది. అది కూడా కొత్త దనం లేని ప్రేమకథ. అందుకే ప్రేక్షకులకు నచ్చలేదు. ప్రేమ కథలో ఉండాల్సిన ఉద్వేగపరమైన సన్నివేశాలు కూడా లేవు.

రమ్య కృష్ణ తల్లి పాత్రలో బాగానే చేసింది కానీ లైగర్ కు ఆమె కు మధ్య బలమైన ఎమోషనల్ సీన్లు లేవు. రమ్యకృష్ణ పాత్ర నేపథ్యం కరీంనగర్. కానీ ఆమె భాష .. యాస ఏ ప్రాంతానిదో అర్ధం కాదు. కథలో పరిమిత పాత్రను రమ్య కృష్ణ బాగానే చేసిందని చెప్పుకోవాలి.

ఇక పాన్ ఇండియా స్థాయిలో తీసిన సినిమాలో హీరో కి నత్తి ఎందుకు పెట్టారో అర్ధంకాదు . దాని వల్ల ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదు. పైగా కథకు అదే ఇబ్బంది గా మారింది. సినిమా మొత్తం నత్తి హీరో ను భరించాలి … దేవరకొండ అభిమానులకు కూడా ఈ విషయం మింగుడు పడలేదు.

సినిమా ఫ్లాప్ అవడానికి ఇదో కారణం. విజయ్ దేవరకొండ ఇలాంటి పాత్రను ఎందుకు అంగీకరించారో మరి ? దీన్ని బట్టి కథల విషయంలో విజయ్ జాగ్రత్త తీసుకోవాలి. ఆ విషయం విజయ్ కు అర్ధమై ఉండాలి. 

మైక్ టైసన్‌ అంతటి వాడిని పెట్టుకుని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. చివరికి కమెడియన్ గా మార్చేశారు. మైక్ టైసన్‌ ఉన్న సన్నివేశాలు మరీ సిల్లీగా ఉన్నాయి. సినిమా క్లైమాక్స్ ఏ మాత్రం ఆకట్టుకోదు.

హీరో విజయ్ దేవరకొండ నూరు శాతం బాగా చేసాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను అలరిస్తుంది. బాడీకి ఫైటర్ లుక్ ఇవ్వడానికి దేవరకొండ పడిన కష్టం ఇట్టే తెలిసిపోతుంది. కథలో సత్తా లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్. సినిమాలో పూరి మార్క్ డైలాగ్స్, ఎమోషన్స్ తక్కువే. మాస్ ను ఆకట్టుకునే కొన్ని దేశభక్తి డైలాగులు బాగున్నాయి. కెమెరా పనితనం బాగుంది. పాటలు ఓ మాదిరిగా ఉన్నాయి.

దేవరకొండ ని పాన్ ఇండియా హీరో గా పరిచయం చేయడానికి .. పరమ రొటీన్ కథను ఎంచుకుని పూరి పప్పులో కాలేశారు. సినిమా బిగినింగ్ లో హీరో ఫ్లాష్ బ్యాక్ కథ చెబుతూ ‘కథ చెప్పడం నాకు అంతగా రాదు’ అంటాడు. ఈ సినిమా కథ అల్లిన పూరి కి ఆ డైలాగు వర్తిస్తుందా అన్న సందేహం కలుగుతుంది.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!