ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తుల నికర విలువ గత ఏడాదితో పోలిస్తే పెరిగిందని, హోంమంత్రి అమిత్ షా ఆస్తుల నికరవిలువ తగ్గిందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఆ ఇద్దరు తమ ఆస్తుల వివరాలను పీఎంఓ కి సమర్పించారు.
ఈ ఏడాది జూన్ 30 నాటికి పిఎం మోడీ ఆస్తుల నికర విలువ రూ .2.85 కోట్లు కాగా గత ఏడాది రూ 2.49 కోట్లతో పోలిస్తే దాదాపు రూ 36 లక్షలు పెరిగిందని పీఎం కార్యాలయం ప్రకటించింది.
గత సంవత్సరంలో రూ 3.3 లక్షల బ్యాంక్ డిపాజిట్లు, రూ .33 లక్షల విలువైన పెట్టుబడులపై రాబడి కారణంగా ఆయన ఆస్తులు ప్రధానంగా పెరిగాయి.జూన్ 2020 చివరి నాటికి, ప్రధాని మోడీ చేతిలో రూ .31,450 నగదు, ఎస్‌బిఐ గాంధీనగర్ ఎన్‌ఎస్‌సి శాఖ వద్ద రూ .3,38,173 బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే ఉంది. అదే శాఖలో బ్యాంక్ ఎఫ్‌డిఆర్, ఎంఓడి బ్యాలెన్స్ 1,60,28,939 రూపాయలు కూడా ఉన్నాయి.ఇంకా రూ .8,43,124 విలువైన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు (ఎన్‌ఎస్‌సి), రూ .1,50,957 విలువైన జీవిత బీమా పాలసీలు, రూ .20,000 విలువైన పన్ను ఆదా చేసే ఇన్‌ఫ్రా బాండ్లను కూడా పిఎం మోడీ కలిగి ఉన్నారు. కాగా చర ఆస్తులు రూ .1.75 కోట్లకు పైగా ఉన్నాయి.
ప్రధానమంత్రి ఎటువంటి రుణాలు తీసుకోలేదు , మోడీ పేరున ఎలాంటి వాహనం కూడా లేదు. మోడీకి నాలుగు బంగారు ఉంగరాలున్నాయి. సుమారు 45 గ్రాముల బరువుతో ఉన్న వాటి విలువ రూ .1.5 లక్షలు. గాంధీనగర్‌లోని సెక్టార్ -1 లో 3,531 చదరపు అడుగుల కొలత గల జాయింట్ ప్లాట్లు కలిగి ఉన్నారు. గాంధీనగర్ ఆస్తి మరో ముగ్గురు ఉమ్మడి యజమానులతో ఉందని, ప్రతి ఒక్కరికి 25 శాతం సమాన వాటా ఉందని పిఎం మోడీ డిక్లరేషన్ ఇచ్చారు.
డిక్లరేషన్‌లో పేర్కొన్న ఆస్తిని గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి రెండు నెలల ముందు, అక్టోబర్ 25, 2002 న కొనుగోలు చేశారు. ఆ సమయంలో, ఆస్తి వ్యయం రూ .1.3 లక్షలకు పైగా ఉంది. ప్రధానమంత్రి ఆస్తి లేదా స్థిరమైన ఆస్తుల వాటా యొక్క మార్కెట్ విలువ ఈనాటికి రూ .1.10 కోట్లు. ఆ విధంగా ఇక గత సంవత్సరంతో పోల్చితే ప్రధాని మోడీ ఆస్తులు కొంచెం పెరిగాయి .
ఇక హోంమంత్రి అమిత్ షా ఆస్తుల నికర విలువ తగ్గిపోయింది. షేర్ మార్కెట్లో అస్థిరత , మార్కెట్ సెంటిమెంట్ సరిగ్గా లేక ఈక్విటీ విలువలు పడిపోయాయి . గత ఏడాది ప్రకటించిన రూ 32.3 కోట్లతో పోలిస్తే, జూన్ 2020 నాటికి షా తన ఆస్తుల నికర విలువను రూ 28.33 కోట్లుగా ప్రకటించారు. షా స్థిరాస్తులు అన్నీ గుజరాత్‌లో ఉన్నాయి. ఆయన యాజమాన్యంలోని ఆస్తులు, ఆయన తల్లి నుండి పంచుకున్న వారసత్వపు ఆస్తివిలువ రూ .53.56 కోట్లు అని పిఎంఓ ప్రకటించింది. అమిత్ షా చేతిలో నగదు రూ .15,814, బ్యాంక్ బ్యాలెన్స్, ఇన్సూరెన్స్‌లో రూ. 1.04 కోట్లు, రూ. 13.47 లక్షల విలువైన పెన్షన్ పాలసీలు, స్థిర డిపాజిట్ పథకాలలో రూ .2.79 లక్షలు, రూ .44.47 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయి. అమిత్ షా వద్ద నున్న సెక్యూరిటీల మార్కెట్ విలువ తగ్గడం వల్ల షా ఆస్తుల నికర విలువ ఈ ఏడాది తగ్గిపోయింది.
Read also >>> చైనాకు చెక్ చెప్పేందుకు సన్నద్ధం !
—————- KNMURTHY