She should show her strength …………..
ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ఎంపిక కొంత మందిని ఆశ్చర్యపరిచింది.కొంత మంది ముందుగానే ఊహించారు. ఇటీవల కాలంలో బీజేపీ సీఎంల ఎంపికలో వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ లో బీజేపీ తొలి ప్రభుత్వానికి ఒక మహిళా నేత నాయకత్వం వహించడం మంచి పరిణామమే.
పోటీలో పర్వేశ్ వర్మ, విజేందర్ గుప్తా, ఆశిష్ సూద్ వంటి నాయకులు ఉన్నప్పటికీ రేఖా గుప్తాను ఎంచుకోవడం వెనుక చాలా కారణాలే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. చాలామంది అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన బీజేపీ “జెయింట్ కిల్లర్” పర్వేష్ వర్మ కు ఛాన్స్ ఇస్తారని ఊహించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బనియా కమ్యూనిటీకి చెందినవారు. వారిది వ్యాపార కుటుంబం. వాజ్‌పేయి-అద్వానీ కాలం నుంచి వ్యాపారులు బీజేపీకి ప్రధాన ఓటర్లుగా ఉన్నారు. బిజెపి ఢిల్లీ విభాగానికి బనియాలు వెన్నెముకగా ఉన్నారు.
ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన మహిళా ఓటర్ల మద్దతును ఏకీకృతం చేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా రేఖా గుప్తాను ఎంపిక చేసారని అంటున్నారు. వ్యాపార సంఘాలను కలుపుకుని ఓటు బ్యాంక్ ను బలపరచుకుని ఢిల్లీ ని బీజేపీకి కంచుకోట మార్చాలని ఆపార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు.
విద్యార్థి నాయకురాలిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రేఖా గుప్తా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉండేవారు. పీఠంపురా, షాలీమార్ బాగ్ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి కోసం రేఖా ఎంతగానో కృషి చేశారు. డివిజన్‌లోని ప్రజల కష్ట సుఖాల్లో రేఖా పాలుపంచుకునేవారు.
వారికి పెన్షన్లు మంజూరు విషయంలో ప్రభుత్వంతో పోరాడారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా అర్థరాత్రి తలుపు తట్టినా.. తాను అండగా ఉంటానంటూ ప్రజలకు భరోసా కల్పించారు. ఎలాంటి సహాయం కావాలన్నా.. తనను సంప్రదించాలంటూ.. తన సెల్ నెంబర్‌ను.. రేఖా గుప్తా అధికారిక వెబ్ సైట్‌లో ఉంచారు.
ఆ నంబర్ కు కాల్ చేసిన ప్రజలతో మాట్లాడేవారు. స్వయంగా వెళ్లి కలిసి వచ్చేవారు. అలా ప్రజలతో మమేకం అయ్యారు. ఆమె ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా, ఎంపీగా చేయకపోయినప్పటికీ ఢిల్లీ మేయర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అంతే కాకుండా ఢిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా కూడా రేఖా గుప్తా రెండు సార్లు పనిచేశారు.
ఢిల్లీ పీఠంపురా నుంచి కౌన్సిలర్‌గా.. ఆ తర్వాత మేయర్‌గా పనిచేశారు. బీజేపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యదర్శిగా కూడా చేశారు. ఇవన్నీప్లస్ అయ్యాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఆర్.ఎస్.ఎస్ హార్డ్ కోర్ వర్కర్. సంఘ్ పరివార్ నేతల ఆశీస్సులు ఉన్నాయి.
షాలీమార్ బాగ్ శాసనసభ స్థానం నుంచి 2015, 2020 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఆమె ఓటమి చెందారు. 2025లో అదే నియోజకవర్గం నుంచి బందనా కుమారిని 29వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు.రేఖాగుప్తాను సీఎంగా ఎన్నుకోవడానికి ఆమె కుటుంబానికి సంఘ్ నేపథ్యం ఉండటం కూడా బాగా కలిసొచ్చింది అంటారు.
బీజేపీ నుంచి సుష్మాస్వరాజ్, ఉమాభారతి, వసుంధర రాజే, ఆనందీబెన్ పటేల్ ల తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 5వ మహిళ రేఖా గుప్తా. దేశంలో విభిన్న పార్టీల నుంచి సీఎం అయిన 18వ మహిళ గా రేఖా గుప్తా నిలిచారు.
ప్రస్తుతం మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్) తర్వాత గుప్తా ఇప్పుడు దేశంలో రెండవ మహిళా ముఖ్యమంత్రి. బీజేపీ అయితే మంచి అవకాశమే ఇచ్చింది. ఇక ఆమె ఏమేరకు సత్తా చాటగలరో చూడాలి.