పసిడి వేటలో ప్రభుత్వాలు ! (1)

Sharing is Caring...

Gold Mining………………………………………………………………………..

ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాలలో భారతదేశం ఒకటి. కాబట్టి, మైనింగ్‌ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సి అవసరం ఎంతో ఉంది. ఇది జరగాలంటే  సంబంధిత వ్యవస్థలో ఎన్నో మార్పులు చేపట్టాలి.  నియంత్రణా పరమైన అడ్డంకులు తొలగాలి. పెట్టుబడులను ప్రోత్సహించాలి. గతంతో పోలిస్తే ఇపుడు ఆశాజనకమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.

గనులు, ఖనిజాల చట్టం, జాతీయ మినరల్‌ పాలసీ, జాతీయ ఖనిజాల అన్వేషణ విధానం లో మెల్లగా మార్పులు వస్తున్నాయి. ఫలితంగా  రాబోయే సంవత్సరాల్లో దేశీయంగా బంగారం ఉత్పత్తి పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలోనే  దేశీయంగా బంగారం కోసం అన్వేషణ జరుగుతోంది.  ఏపీలో … యూపీ లో … బీహార్ లో బంగారం నిల్వలను వెలికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఏపీలోని ఉదయగిరి మాసాయిపేట కొండలపై బంగారం వేట కొనసాగుతోంది.జీఎస్ ఐ ఇక్కడ తవ్వకాలు చేపట్టింది. ఖనిజ నిక్షేపాలు వెలుగు చూస్తే ఉదయగిరి మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంత వాసులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో భారీగా బంగారం, రాగి, వైట్‌ క్వార్జ్ వంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు జీఎస్ఐ ప్రాథమికంగా గుర్తించింది. ఇక్కడ  ఖనిజ నిక్షేపాలు ఎంత మేరకు  ఉన్నాయో తెలుసుకునేందుకు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ మ్యాపింగ్‌ నిర్వహించి, డ్రిల్లింగ్‌ పనులు చేపట్టింది.

జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు కొండపై ఐదు ప్రాంతాల్లో 500 నుంచి 1,000 అడుగుల మేర డ్రిల్లింగ్‌ నిర్వహించి 46 నమూనాలు సేకరించారు. ఈ ఖనిజ నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు అందజేశారు. మాసాయిపేట కొండ ప్రాంతంలో సుమారు 2,000 హెక్టార్లకు పైగా భూముల్లో బంగారం, రాగి, వైట్‌క్వార్ట్జ్ నిక్షేపాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం ఈ ఖనిజాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  150 మీటర్ల మేర డ్రిల్లింగ్‌ వేసిన ప్రాంతంలో భూగర్భంలోకి సీసీ కెమెరాలు పంపించి సేకరిస్తున్నారు.

అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలోని రామగిరి మండలంలో  రామగిరి గోల్డ్ మైన్స్ ఉన్నాయి. ఈ గనులు 130 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. కోలార్ గోల్డ్ మైన్స్ లో తవ్వకాలు జరుగుతున్నప్పుడే ఇక్కడ కూడా భారత్ గోల్డ్ మైన్స్ తవ్వకాలు జరిపేది. అప్పట్లో మార్కెట్ లో బంగారం ధర తక్కువగా ఉండటంతో..వ్యయభారం ఎక్కువై పనులు నిలిపేశారు. బంగారం ధరలు పెరిగిన క్రమంలో ఇప్పుడు మరోసారి రామగిరి బంగారు గనులు తెరపైకి వచ్చాయి. చిత్తూరు జిల్లాలోని చిగురుగుంటలో బంగారు గనుల తవ్వకాల్ని ఇటీవల ఎన్ఎండీసీ  సంస్థ చేజిక్కించుకుంది. ఇప్పుడు అదే సంస్థ రామగిరి బంగారు గనులపై దృష్టి పెట్టింది.

రామగిరి బంగారు గనుల్లో నిక్షేపాలపై అధ్యయనం చేసేందుకు ఎన్ఎండీసీ ఆసక్తి చూపిస్తోంది.  40 ఏళ్లు నడిచిన రామగిరి గోల్డ్ మైన్స్ 2001లో మూతపడింది. బంగారు ఖనిజాన్ని తవ్వితీస్తే గిట్టుబాటవుతుందా లేదా వంటి అనే అంశాల్ని అధ్యయనం చేసేందుకు రాష్ట్ర గనుల శాఖ కు ఎన్ఎండీసీ ప్రతిపాదన పంపింది.  వందల అడుగుల లోతున ఉన్న ఈ గనుల నుంచి తవ్వితీసే మట్టిలో టన్నుకు 2-3 గ్రాముల బంగారముంటుందని అంచనా. ఇది లాభదాయకమా కాదా అనేది పరిశీలించాల్సి ఉంది.

బంగారమైతే రామగిరి గనుల్లో ఉందనేది వాస్తవం. కానీ ఎంతమేర ఉండవచ్చు..ఎంత లోతున వెళ్లాల్సి ఉంటుంది..ఖర్చు ఎంతవుతుందనేది లెక్కగట్టడానికే ఎన్ఎండీసీ అధ్యయనం చేస్తానంటోంది. కాగా ఈ మైన్స్‌కు సమీపంలో రెండు చోట్ల  రొద్దం మండలం బొక్సంపల్లిలో రెండు చోట్ల కదిరి మండలంలోని జౌకుల పరిధిలో ఆరు చోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ పది ప్రాంతాల్లో 97.4 చదరపు కిలోమీటర్ల పరిధిలో బంగారు నిక్షేపాలు ఉన్నాయని  భావిస్తున్నారు.

ఈ పది ప్రాంతాల్లో 50 మీటర్ల నుంచి దిగువకు వెళ్లే కొద్దీ బంగారు నిల్వలు ఉన్నాయి. టన్నుమట్టిలో నాలుగు గ్రాముల బంగారం ఉంటుందని, జౌకులలోని ఆరు ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 10 టన్నులు, రామగిరిలో నాలుగు టన్నులు, బొక్సంపల్లిలో రెండు టన్నులు.. ఇలా మొత్తంగా 16 టన్నుల బంగారం నిల్వలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఖనిజాల అన్వేషణ కోసం కాంపోజిట్ లైసెన్స్ ఇవ్వనున్నారు. దీని ప్రకారం.. వ్యక్తులకు లేదంటే సంస్థ కు  వెయ్యి హెక్టార్ల వరకు పసిడి  అన్వేషణకు లైసెన్స్ ఇస్తారు.అపుడు గానీ అసలు విషయం తేలదు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!