Govardhana Parikrama …………….
ఇంద్రుని గర్వాన్ని అణచివేసేందుకు శ్రీకృష్ణుడు గోవర్ధన గిరి ని తన చిటికిన వేలుపై ఎత్తి, ప్రజలను రక్షించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ గోవర్ధన గిరి చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ (పరిక్రమ) చేస్తారు. దీనిని అత్యంత పవిత్రమైన యాత్ర గా భావిస్తారు.
ఈ గోవర్ధన గిరి ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో గోవర్ధన్ గ్రామం లో ఉంది. ఈ యాత్రకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. సాధారణంగా భక్తులు మానసి గంగా (Manasi Ganga) కుండ్ వద్ద పవిత్ర స్నానం చేసి ప్రదక్షిణ ప్రారంభిస్తారు.మరో ముఖ్యమైన ప్రారంభ స్థానం దాన్ ఘాటి ఆలయం (Daan Ghati Mandir).
భక్తులు ఎక్కడైతే ప్రదక్షిణ ప్రారంభించారో, మళ్ళీ అదే స్థానానికి చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ఈ గిరి ప్రదక్షిణ సుమారు 21 కిలోమీటర్లు చేయాలి. దీనినే 7 కోసుల ప్రదక్షిణ అని కూడా పిలుస్తారు. సాధారణ వేగంతో నడిస్తే 5 నుండి 7 గంటల సమయం పడుతుంది.ఈ ప్రదక్షిణను రెండు విడతలుగా కూడా చేస్తుంటారు.
పెద్ద పరిక్రమ (Badi Parikrama) 12 కి.మీ. గోవర్ధన్ నుండి పుచ్ఛరి వరకు సాగుతుంది. చిన్న పరిక్రమ (Chhoti Parikrama 9 కి.మీ. గోవర్ధన్ నుండి రాధాకుండ్ వరకు సాగుతుంది. ప్రదక్షిణ మార్గంలో అందమైన కట్టడాలతో కూడిన చారిత్రక కోనేరు కుసుమ్ సరోవర్, అత్యంత పవిత్రమైన జంట కోనేర్లు రాధా కుండ్, శ్యామ కుండ్ కనిపిస్తాయి.
అలాగే జతీపుర లో శ్రీకృష్ణుని విగ్రహానికి పూజలు నిర్వహిస్తారు. పుచ్ఛరి కా లౌఠా లో హనుమంతుని విగ్రహానికి పూజలు చేస్తారు. ప్రతి నెలా పూర్ణిమ రోజున లక్షలాది మంది వస్తారు. ముఖ్యంగా గురు పూర్ణిమ (ముడియా పూనో) సమయంలో రద్దీ విపరీతంగా ఉంటుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే ఏకాదశి తిథులలో భక్తుల సంఖ్య పెరుగుతుంది.
అక్టోబర్-నవంబర్ నెలల్లో వచ్చే కార్తీక మాసంలో భక్తి భావం రద్దీ రెండూ ఎక్కువగా ఉంటాయి. గోవర్ధన పూజ (దీపావళి మరుసటి రోజు), హోలీ, జన్మాష్టమి సమయాల్లో భారీ జనసందోహం ఉంటుంది. గోవర్ధన్ గ్రామం మథుర నుండి సుమారు 25 కి.మీ. దూరంలో ఉంది.
మథుర రైల్వే స్టేషన్ లేదా బస్ స్టాండ్ నుండి ఆటోలు, టాక్సీలు లేదా బస్సులు నిరంతరం అందుబాటులో ఉంటాయి. మథుర నుండి గోవర్ధన్ చేరుకోవడానికి సుమారు 45 నిమిషాలు పడుతుంది. గిరి ప్రదక్షిణ ఎండ తీవ్రత తక్కువగా ఉండే తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళల్లో ప్రారంభించడం మంచిది.
అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.మార్గం పొడవునా పాలు, పానీయాలు,ఆహార పదార్ధాలు లభిస్తాయి. నడవలేని వారి కోసం ఈ-రిక్షాలు కూడా అందుబాటులో ఉంటాయి.
ఈ కొండను శ్రీకృష్ణుడి స్వరూపంగా భావిస్తారు, కాబట్టి చాలామంది భక్తులు పాదరక్షలు లేకుండా ప్రదక్షిణ చేస్తారు.మధుర లో హోటల్స్ ఎక్కువగానే ఉన్నాయి. భోజనం, వసతి కి ఇబ్బంది ఉండదు. సాధారణ రోజుల్లో వెళ్లడం ఉత్తమం.

