Good opportunity ………………………
సావరిన్ గోల్డ్ బాండ్లలో (sovereign Gold bonds) పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి. మరొక మూడు రోజులు మాత్రమే బాండ్లు కొనుగోలు చేసేందుకు వ్యవధి ఉంది. డిసెంబర్ 19 నుంచి అమ్మకాలు మొదలయ్యాయి. 23 వరకు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ఈ బాండ్ల ఇష్యూ లో గ్రాము ధరను రూ.5,409గా నిర్ణయించారు. ఆన్లైన్లో (Online) కొనుగోలు చేస్తే రూ.50 ప్రత్యేక తగ్గింపు ఉంటుంది. అంటే, ఆన్లైన్లో చెల్లింపులు చేసేవారికి గ్రాము బంగారం రూ.5,359కే లభిస్తుంది.
ఈ బాండ్లను భారత ప్రభుత్వం తరఫున రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేస్తుంది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు, రీజినల్ రూరల్ బ్యాంకులు తప్ప), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ , క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ , నిర్దేశిత పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE, BSE) ద్వారా కొనుగోలు చేయవచ్చు.
గోల్డ్ బాండ్లను ఒక గ్రాము బంగారం ధరతో మొదలుకుని జారీచేస్తారు. అంటే ఈ పథకంలో జారీ చేసే ఒక్కో బాండు ఒక గ్రాము బంగారంతో సమానం. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రకటించిన 999 స్వచ్ఛత గల బంగారం ధర ఆధారంగా సబ్స్క్రిప్షన్ ముందు వారం చివరి మూడు పనిదినాల్లో సగటును లెక్కించి ధర నిర్ణయిస్తారు.
సావరిన్ గోల్డ్ బాండ్ల పథకంలో కనీసం ఒక గ్రాము మొదలుకుని పెట్టుబడి పెట్టవచ్చు. ఒక వ్యక్తి గరిష్ఠంగా 4 కిలోలు, హిందూ అవిభాజ్య కుటుంబాలు 4 కిలోలు, ట్రస్టులు, వాటికి సంబంధించిన సంస్థలు ఆర్థిక సంవత్సరానికి 20 కిలోల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన నాటి నుంచి 8 సంవత్సరాల మెచ్యూరిటీ ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రకటించిన 999 స్వచ్ఛత గల బంగారం ధర ఆధారంగా.. చివరి మూడు పని దినాల్లో ఉన్న ధర సగటు లెక్కించి దాని ప్రకారం చెల్లింపులు చేస్తారు.
ఈ బాండ్లను మెచ్యూరిటీ సమయం కంటే ముందుగా తీసుకోవాలనుకున్న వారు, జారీ చేసిన రోజు నుంచి 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ బాండ్లపై పెట్టుబడిదారులకు వార్షికంగా 2.50% వడ్డీ కూడా లభిస్తుంది.
మెచ్యూరిటీ వరకు పెట్టుబడులను కొనసాగించినట్లయితే మూలధన లాభాలపై పన్ను వర్తించదు. ఈ పన్ను ప్రయోజనం ప్రత్యేకించి పసిడి పథకాలకు మాత్రమే వర్తిస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, భౌతిక బంగారం వంటి ఇతర పెట్టుబడులకు అందుబాటులో లేదు. ఒకవేళ ముందస్తు విత్ డ్రాలను ఎంచుకుంటే దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను చెల్లించాలి.
ఈ బాండ్లలో మదుపు చేసేటప్పుడు ఇప్పటి రేటు ప్రకారం బంగారం ధరను investor చెల్లిస్తే, విత్ డ్రా చేసుకునే సమయానికి ఉన్న గ్రాము బంగారం ధర ప్రకారం తిరిగి చెల్లిస్తారు. కాబట్టి భవిష్యత్లో రేటు పెరిగినా అదే బంగారాన్ని కొనుగోలు చేయగలుగుతారు. రేటు హెచ్చుతగ్గుల గురించి భయం ఉండదు.
చెల్లింపులు బంగారం రూపంలో కాకుండా నగదు రూపంలో ఉంటాయి కాబట్టి బంగారం అమ్మి క్యాష్ చేసుకునే అవసరం ఉండదు.
మీరు ఫిజికల్ గోల్డ్ కొంటే.. విక్రయించాలనుకున్నప్పుడు తరుగు వంటివి పోతాయి. కానీ ఈ బాండ్లలో ఆ ఇబ్బంది ఉండదు. పైగా పెట్టుబడులపై వడ్డీ కూడా లభిస్తుంది.భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. కాలపరిమితి వరకు కొనసాగించగలిగితే పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఈ బాండ్లను ఫిజికల్ గోల్డ్ మాదిరిగానే బ్యాంకులో తనఖా ఉంచి రుణం కూడా పొందొచ్చు. 2023 లో మార్చి 06-10 మధ్య మళ్ళీ బాండ్లను విక్రయిస్తారు.