కన్నడ లెజెండరీ యాక్టర్ రాజ్‌కుమార్, పార్వతమ్మల తనయుడు పునీత్ రాజ్‌కుమార్. చిన్న వయసులోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు ఆర్జించారు. 1976లో బాలనటుడిగా కేరీర్ మొదలు పెట్టిన పునీత్ ప్రస్తుతం ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సూపర్‌స్టార్‌గా పాపులయ్యారు. పునీత్ రాజ్‌కుమార్‌ను పవర్ స్టార్‌గా అభిమానులు పిలుచుకుంటారు. కేవలం శాండల్ ఉడ్ లోనే కాక దక్షిణాది మొత్తంలో అభిమానులున్నారు.
బాలనటుడిగా పునీత్ 20 సినిమాల్లో నటించారు. బెట్టాడ హూవులో రాముడి పాత్రకు పునీత్ రాజ్‌కుమార్ ఉత్తమ బాలనటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. చలీసువ మొదగలు, ఏరడు నక్షత్రాలు చిత్రాల్లో నటనకు గాను కర్ణాటక రాష్ట్ర ఉత్తమ బాల కళాకారుడిగా పురస్కారాలు పొందారు.2002లో పునీత్ “అప్పు” చిత్రం తో హీరో గా అరంగేట్రం చేశాడు. ఈ సినిమా ఊహించని స్థాయిలో హిట్ కొట్టింది. ఈ సినిమా దర్శకుడు పూరీ జగన్నాధ్ కావడం విశేషం.
ఇదే సినిమాను ఇడియట్ పేరిట పూరీ తెలుగులో తీశారు. మొదటి సినిమాతోనే పెద్ద పాపులారిటీ ని సంపాదించుకున్నారు. పునీత్ ను అప్పూ అని కూడా పిలుస్తారు.ఆ తర్వాత అభి, వీర కన్నడిగ, మౌర్య, ఆకాష్, మిలన వంటి హిట్ మూవీస్ లో నటించారు. హీరోగా పునీత్ 29 సినిమాలలో నటించగా అందులో 90 శాతం సినిమాలు హిట్ అయ్యాయి.
ప్రఖ్యాత నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన హిందీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రాం కన్నడ వెర్షన్ కన్నడ కోట్యాధిపతి రెండు సీజన్లకు కూడా హోస్ట్ గా కూడా చేసారు.మూడో సీజన్ చేయలేదు .. తిరిగి నాలుగో సీజన్ చేసారు.
అశ్విని అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అన్ని ప్రేమ కథల్లాగానే వీరి ప్రేమకథలో కూడా అడ్డంకులూ ఏర్పడ్డాయి. పెద్ద వారిని ఒప్పంచి మరీ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు దృతి, వందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పునీత్ సోదరులు కూడా నటులే.
అన్నింటిని మించి పునీత్ లో సేవాగుణం ఎక్కువ. ఎవరైనా సహాయం అడిగితే కాదనే వాడి కాదు. హెల్ప్ చేయడంలో పునీత్ ముందుండేవారు. పునీత్ సేవాభావం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. పునీత్ కర్ణాటకలో 45 స్కూళ్లలో ఉచిత విద్యకు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. 26 అనాథ ఆశ్రమాలు, 20 వృద్ధాశ్రమాలకు చేయూతనిస్తున్నారు. మరో రెండు వేల మంది విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును భరిస్తూ పునీత్ తన మానవతను చాటుకున్నారు.
19 గోశాలల కు కూడా అండగా నిలిచారు. తాను చనిపోతే రెండు కళ్ళు వేరొకరికి అమర్చమని డొనేట్ చేశారు. ఇంకా గుప్త దానాలు ఎన్నో చేశారు. వీటి గురించి ఆయన ఎక్కడా చెప్పుకోలేదు. 46 ఏళ్ళ చిన్న వయసులోనే పునీత్ అందరికి దూరం కావడంతో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.దేవుడికి కన్ను కుట్టి ముందే తీసుకెళ్లి పోయాడని అభిమానులు విలపిస్తున్నారు.