పద్యాలకూ.. ప్రాణం పోసిన గానలోలుడు !

Sharing is Caring...

మారు పేరు ఘంటసాల…అసలు పేరు గానలోల… అంటారు బాపూ రమణలు. తెలుగు పద్యాలకి ఒక కొత్తరూపం ఇచ్చినవాడు ఘంటసాల.పద్యం అంటే ఘంటసాల. ఘంటసాల అంటే పద్యం అంతగా పద్యంతో పెనవేసుకుపోయింది ఆ పేరు. పద్యనాటకాల్లో నటించాలంటే శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోక తప్పేది కాదు. పద్యాలను రాగయుక్తంగా ఆలపించాలంటే…ఈ కసరత్తు తప్పదు మరి. ఒక్కోసారి సాహిత్యాన్ని మింగేసేలా సంగీతం సాగేది. రాగాలు సాగేవి. ఈ పద్దతిని సినిమాల కోసం సమూలంగా మార్చిన వాడు ఘంటసాల.నాటకాల ఆడియన్స్ వేరు సినిమాల ఆడియన్స్ వేరూ అనే స్పృహతోనే ఇలా చేశారాయన అని నా భావన.

పద్యాలలో రాగలక్షణాలు ఉన్నాయి కనుక సాహిత్యాన్ని ఆ రాగంలో వేసి లాగి లాగి పాడేయడం సుదీర్ఘంగా రాగాలు తీయడం తొలినాటి పద్యనాటక నటుల అలవాటు గా ఉండేది. ఈ పద్దతి సినిమాల్లోనూ కొనసాగింది. అయితే ఇదంతా ఘంటసాల ప్రవేశించేదాకా మాత్రమ. ఆయన కాలు పెట్టాక సీన్ సమూలంగా మారింది. శాస్త్రీయ సంగీత పరంగా స్వరబద్దం చేస్తూనే.. ప్రజలందరూ పాడుకునేలా లలిత సంగీతపు ఛాయలూ వాటిలో ప్రవేశపెట్టారు ఘంటసాల.అంత వరకు రాగాల నాటక పద్దతితో కూడిన పద్య పఠనాన్ని విని ఉన్న జనాలకు ఘంటసాల వారి పద్యాలు ఊరటనిచ్చాయి. చెవులకు హాయిగొల్పాయి.గంభీరమైన స్వరంతో భావం పలికేలా ఘంటసాల పద్యం చదువుతూ ఉంటే కళ్ల ముందు సన్నివేశం కదలాడిపోయేది.

పాత్ర హావభావాలనే కాదు…సన్నివేశంలోని అంతరార్ధాన్ని సైతం తన పద్యపఠనంలో ప్రతిఫలించగలగడం ఘంటసాల ప్రతిభ. ఎస్వీఆర్ హరిశ్చంద్రలో ఇచ్చోటనే… పద్యం… ఇందుకు ఉదాహరణ.తన గళంలో నవరసాలూ అభినయించేవారు ఘంటసాల. పదాలను విరవడంలోనూ… వాటిని భావయుక్తంగా వదలడంలోనూ… ఆయనకాయనే సాటి.కేవలం పౌరాణిక పద్యాలే కాదు. ఇతర పద్యాలను కూడా అంతే భావయుక్తంగా పాడగలిగేవారాయన.దువ్వూరి రామిరెడ్డి గారి పద్యాన్ని ప్రేమనగర్ సినిమా కోసం వాడుకున్నారు ఆత్రేయ. కేవలం ఘంటసాల ఉన్నారనే భరోసాతో చేసిన పనది.”అంతము లేని ఈ భువనమంత…” పౌరాణిక పద్య పఠనంలో ఎక్కువగా భీభత్స రసం పలుకుతూంటుంది. అలాంటి సందర్భం దొరికిందంటే… ఘంటసాల స్వరం తన స్వభావాన్ని అలా మార్చేసుకుంటుంది. సాహిత్యాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుని ఆయన పాడే పద్యం పాటకన్నా ఎక్కువ సూటిగా జనం హృదయాల్లోకి దూసుకుపోతుంది. ఘంటసాల పద్యాల దమ్ముతో నడచిపోయిన సినిమాలూ అనేకం ఉన్నాయి.

“కురు వృద్దుల్…కురువృద్ద బాంధవుల్”… అంటూ పాండవ వనవాసం…కోసం పాడిన పద్యం లో ఎన్టీఆర్ ఘంటసాల కాంబినేషన్ పవర్ఫుల్నెస్ చూపిస్తుంది.పాటల్లో కన్న పద్యాలకు ఎక్కువగా కావలసింది సరైన పదాల విరుపు. అర్ధవంతంగా పదాలు కావల్సిన చోట్ల విరుస్తూ, రాగ లక్షణం చెడకుండా పద్యాలు పాడటంలో ఘంటసాల మార్గం అనితరసాధ్యం. రాగానికి తగిన ప్రాధాన్యత ఇస్తూనే భావానికి అంతకు మించిన ప్రాధాన్యత ఇవ్వడమే ఘంటసాల టెక్నిక్. ఇదే ఆయన్ని పద్యాల రారాజుగా నిలిపింది. ఉమాసుందరి లో ఆపదలెన్ని వచ్చినా….పద్యం వినండి … జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన కుంతీకుమారి, పుష్పవిలాపం, సాంధ్యశ్రీ పద్యాలు ఈనాటికీ మనకి గుర్తుండటానికి ఘంటసాల గొంతుతో అవి వినడమే కారణం.తెలుగు భాషకు ఆయన చేసిన సేవ పద్యపఠనమే. తెలుగు పద్యపఠనంలో వచ్చిన మార్పుల మీద ఎవరైనా పరిశోదన చేస్తే…ఖచ్చితంగా ఘంటసాలకు ముందు…తర్వాత అని విభజన చేసుకోక తప్పదు.

దీనికి ముందు నాటక ప్రేక్షకుల అభిరుచి నుంచీ మారిన సినిమా ప్రేక్షకాభిరుచి అనే అంశాన్ని కూడా చేర్చాలనుకోండి … నాటకాల రోజుల్లో … ఆ పద్దతిలో ఒక్కో పద్యాన్నీ ప్రత్యేకంగా అనేవారు. ఏం అన్నాడ్రా పద్యాన్ని ఎంత అద్భుతంగా రాగయుక్తంగా ఆలపించాడ్రాఅనుకుని ఎంజాయ్ చేసేవారు అప్పటి ప్రేక్షకులు. నిజానికి ఆ అభిరుచి చచ్చిపోవడం వల్లే ఘంటసాల రాగాలాపనలు కట్ చేయడానికి కారణం కావచ్చు.కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖున్ కంఠీర (పద్యం) భాగవతం నుండి….. తీసుకుని వాడారు కదా శ్రీ కృష్ణ పాండవీయంలో …అందులోనూ ఈ ధోరణి కనిపిస్తుంది . ఘంటసాలతో పాటు చాలా మంది గాయకులు చిత్ర పరిశ్రమలోకి కాలు పెట్టినా ఎందుకు ఘంటసాలే తెలుగువాళ్లకు అంతగా గుర్తుండిపోయాడు. ఎందుకు ఆయనంటే అంతటి గౌరవాభిమానాలు. ఖంగుమనే గొంతుకతో కలగలసిన విశేషమైన సంగీత జ్ఞానం.పద్య రచనలో ఉన్న మాధుర్యం చెడిపోకుండా , లలితంగా స్వరకల్పన చేస్తూ భావం ఉట్టిపడేలా పాడటం ద్వారా పద్యాలకి సంబంధించినంత వరకు తెలుగువారికి గురుస్థానంలో కనిపించారు ఘంటసాల.

హాస్యరసం పండించడంలో ఘంటసాల గాత్రం చాలా కొత్త పోకడలు పోతుంది. అదే పద్యంలో పలికించాల్సి వస్తే ఇక చెప్పేది ఉందా. జస్ట్ రెచ్చిపోతాడంతే. అప్పు చేసి పప్పు కూడులో అలాంటి సందర్భం ఆయనకి దొరికింది. పింగళి నాగేంద్రరావు రాసిన నవకళా సమితిలో పద్యాన్ని ఘంటసాల ఆలపించిన విధం చూడండి. ఊరూర కాఫీ హోటళ్లలో మనకు అప్పు పుట్టవలదే అంటూ పాడే ఆ కాన్ఫిడెన్స్ ను చూడండి. సారీ వినండి …ఘంటసాల సినీ విజయానికి ఇంకో ప్రధాన కారణం ఎన్టీఆర్, ఎఎన్నార్ లకు ఆయన పాడిన విధానం. తెర మీద చూస్తున్న ప్రేక్షకులకు ఎన్టీఆర్, ఎఎన్నార్ లు ఎవరి పాట వారే పాడుకుంటున్న అనుభూతి కలిగించడం. ఇద్దరూ కలసి నటించిన సన్నివేశాల్లో కూడా ఈ వేరియేషన్ చూపించగలగడం మామూలు విషయం కాదు. తెనాలి రామకృష్ణలో అక్కినేని అభినయించిన పద్యాలు ఘంటసాల ఆలపించిన విధం అనితర సాధ్యం. లవకుశ సినిమా శ్రీ రామరాజ్యంగా బాపు రమణలు రీమేక్ చేశారు. సినిమా లో బాగా కొట్టొచ్చినట్టు కనిపించిన లోపం పద్యాలు లేకపోవడం.

లవకుశలో సూపర్ డూపర్ హిట్ అయిన పద్యాలు ఈ కొత్త సినిమాలో కనిపించలేదు. ముఖ్యంగా సీతాసాధ్విని లక్ష్మణుడు అడవిలో విడిచి వచ్చేసిన తర్వాత వాల్మీకి ఆలపించే పద్యం ఘంటసాల గాత్రంలో అద్భుతంగా పలుకుతుంది. నట గాయకుడైన నాగయ్యకు ఘంటసాల ప్లే బ్యాక్ పాడడం కొంచెం దుర్మార్గంగా అనిపించినప్పటికిన్నీ . అప్పు చేసి పప్పుకూడులో ఓ సందర్భం కోసం ఎన్టీఆర్ సన్యాసి వేషం కడతారు. ఆ సన్నివేశాల కోసం కొన్ని వేదాంత తరహా పద్యాలను రాశారు పింగళి నాగేంద్రరావు. భజగోవింద శతకం తరహాలో సాగే ఈ పద్యాలను ఘంటసాల అంతే చిలిపిగా పాడి రక్తి కట్టించారు. ఈ అప్పు చేసి పప్పుకూడు పద్య రచనలో పింగళికి శ్రీశ్రీ సహకారం అందించారనే విషయం చాలా కొద్ది మందికే తెల్సు. అది వేరు విషయం. 

ఘంటసాల గాత్రంలో ఉన్న లాలిత్యం, దానితో బాటు గాంభీర్యం; మూడు స్థాయిలలోనూ అవలీలగా పలికే రాగ భావం, శబ్దోచ్చారణలోని స్పష్టత, రాగాల గురించిన నిర్దుష్టమైన అవగాహన ఇలాంటి ఎన్నో ఉత్తమ లక్షణాలు ఆయన గానానికి ప్రత్యేకతను తెచ్చాయి.సారణీ బ్యానర్ లో నాగమణి, సూరిబాబులు నిర్మించిన కాళిదాసు కోసం కాళిదాస విరచిన శ్యామలా దండకాన్ని ఘంటసాల వారు ఆలపించిన తీరు వినితీరవలసినదే.పద్యానికి సంగీతము …హృది మెచ్చెడి భాణినీయ ఉన్నతి నిచ్చున్…మధురమ్మగు గొంతుకతో…పద్యానికి ఘంటసాల ప్రాణము పోయున్..అంటూ పద్యం లోనే ఘంటసాల పద్యపఠనాన్ని శ్లాఘించారు పంతుల సీతాపతి రావు గారు.

———  Bharadwaja Rangavajhala
ఇది కూడా చదవండి >>>>>>>>>>>  వ్యధార్త జీవుల యదార్ధ చిత్రం !
Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!