Learned a lot in prison life……………………………………….
బళ్ళారి జైలులో ఉండగా ఘంటసాల ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. ప్రముఖులతో పరిచయాలు పెరిగాయి. వాళ్లంతా సాదా సీదా నాయకులూ కారు. పొట్టి శ్రీరాములు, సర్దార్ గౌతులచ్చన్న, నాస్తికోద్యమ ప్రముఖులు గోరా, ఆచార్య ఎన్జీ రంగా, కొసరాజు అమ్మయ్య,వి.ఎల్. సుందరరావు తదితరులు ఘంటసాల గురించి తెలుసుకుని … ఆయన పాటలు విని ప్రోత్సాహించేవారు. జైల్లో సమావేశాలు జరిగే సమయంలో ఘంటసాల చేత ప్రబోధ గీతాలు పాడించుకునేవారు.
గోరా స్వతంత్ర ఉద్యమం పుట్టు పూర్వోత్తరాలు … నాయకుల గురించి వివరంగా చెప్పేవారు. గౌతు లచ్చన్న వివిధ ఉద్యమాలు ..వాటి తీరు తెన్నులు గురించి వివరించేవారు. ఇవి కాకుండా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలపై కూడా చర్చలు జరిగేవి. రాజమండ్రికి చెందిన నాగేశ్వరరావు ఖైదీలందరికి అవసరమైన సందర్భాలలో వైద్యం చేసేవారు. బళ్లారి జైలులో ఒక గ్రంధాలయం కూడా ఉండేది. ఎన్నో పుస్తకాలు .. వార్తా పత్రికలూ అందుబాటులో ఉండేవి.
ఘంటసాల గ్రంధాలయం కెళ్ళి పుస్తకాలు కూడా చదివేవారు. ఇటు నేతల సాంగత్యం .. అటు పుస్తకాల తో ఘంటసాల రాజకీయాలు .. ఉద్యమాల గురించి అవగాహన పెంచుకున్నారు. పొట్టి శ్రీరాములు గారి వద్ద ఘంటసాల హిందీ కూడా నేర్చుకున్నారు. జైలులో ఏ బీ సి అనే మూడు తరగతుల బ్లాక్స్ ఉండేవి. ఘంటసాల అన్ని బ్లాక్స్ కు వెళ్లి అందరిని పలకరిస్తుండేవారు. అందరితో పరిచయాలు పెంచుకున్నారు.
ఉదయాన్నే లేవగానే ‘యే కౌన్ ఆయా సవేరా సవేరా’ (ఎవరు వచ్చారింత ఉదయాన )అనే పాట పాడేవారు. ఆ తర్వాత “జండా ఊంచా రహే హమారా “అనే గీతం ఆలపిస్తే ఆయనతో పాటు చాలామంది గొంతు కలిపే వారు. జైలులో ఉండగానే కొంత మందికి సంగీత పాఠాలు కూడా చెప్పారు. అలాగే హరికథలు చెప్పి అందరిని ఉత్సాహపరిచే వారు. జైలులో ఘంటసాల సత్ప్రవర్తనకు 18 రోజుల శిక్ష తగ్గించారు. 1943 సెప్టెంబర్ 30 న ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
విడుదల సందర్భంగా ఘంటసాల కు పూలతో సన్మానం చేసి … మిఠాయిలు పంచి వీడ్కోలు పలికారు. ఖైదీల ఆదరణకు … అభిమానానికి ఘంటసాల పులకించిపోయారు. కళ్ళనిండా నీళ్లు .. నోటా మాట రాలేదు. ఆ మూగ కన్నీళ్ళతోనే వారి నుంచి సెలవు తీసుకున్నారు.
జైలు నుంచి బయట ప్రపంచంలో కొచ్చాక ఎందుకో ఆయన రాజకీయాల వైపు ఆకర్షితులు కాలేదు. ఆ ప్రభావం కూడా పని చేయలేదు. మళ్ళీ నాటకాలు వేసుకుంటూ .. పాటలు పాడుకుంటూ గడిపారు. ఆ సమయంలోనే నటరాజ నాట్యమండలి పేరిట నాటక సమాజాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సినీ రంగంలోకి వచ్చారు. జైలు నుంచి వచ్చాక ఘంటసాల రాజకీయాల్లోకి వెళ్ళినట్లైతే గాయకుడిగా మనం ఆయనను మిస్ అయ్యి ఉండేవాళ్ళమేమో.
(inputs from mana ghantasala)
——KNMURTHY