అశోక్ గెహ్లాట్ vs సచిన్ పైలట్ = పవర్ పాలిటిక్స్ !

Sharing is Caring...

Thriller Politics………………………………………

రాజస్థాన్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం అశోక్‌ గెహ్లాట్‌ స్థానంలో రాజస్థాన్‌ కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే వ్యవహారం.. పార్టీలో కల్లోలం రేపింది.కాంగ్రెస్ అధిష్టానం డిప్యూటీ సీఎం సచిన్‌ పైలెట్‌ ను సీఎం ను చేయాలని భావించగా ఆయనను వ్యతిరేకిస్తూ గెహ్లాట్‌ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో  ఇపుడు ప్రభుత్వమే రిస్క్ లో పడింది. 

ఇదే సమయంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు గెహ్లాట్‌ను కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పించాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని డిమాండ్‌ చేస్తున్నారు. వేరే ఎవరినైనా ఎంపిక చేయాలని కోరుతున్నారు. గెహ్లాట్  మీద నమ్మకంతో.. బాధ్యతలు అప్పగించడం ఏమాత్రం సరి కాదు అంటున్నారు.  పార్టీ అధిష్టానం గెహ్లాట్ అభ్యర్థిత్వాన్ని పునఃపరిశీలించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో  అధిష్టానం గెహ్లాట్ ను పక్కన  పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 

గెహ్లాట్ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి తెర వెనుక నుంచి నాటకాలు ఆడిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.ఈపరిణామాలను సోనియా గాంధీకి పార్టీ నేతలు వివరించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే  సోమవారం మధ్యాహ్నాం గెహ్లాట్‌తో భేటీ అయ్యారు. గెహ్లాట్ పట్టు వదలకపోతే  రెంటికి చెడ్డ రేవడిగా మారే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉంటే..ఆదివారం సాయంత్రం జరిగిన సీఎల్పీ భేటీకి గెహ్లాట్‌ క్యాంప్‌లోని ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం, మంత్రి శాంతి ధారివాల్‌ ఇంట్లో వేరుగా భేటీ కావడం, స్పీకర్‌ సీపీ జోషికి 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా సమర్పించడంతో.. రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది.ఈ పరిణామాలపై అధిష్టానం ఆగ్రహంగా ఉంది.

నాలుగు సార్లు సీఎంగా చేసిన గెహ్లాట్ కి ఇంకా పదవుల మీద వ్యామోహం తగ్గలేదు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడాలని నిర్ణయించిన అశోక్ గెహ్లాట్.. ముఖ్యమంత్రిగానూ కొనసాగాలని భావించారు. అయితే, ఒకే వ్యక్తికి రెండు పదవులు కుదరవని రాహుల్ తేల్చి పడేయడంతో తెర వెనుక రాజకీయం మొదలైంది. సీఎం పదవి  నుంచి తప్పుకుంటూనే తనకు విశ్వాసపాత్రుడైన వ్యక్తికి ఆ పదవిని కట్టబెట్టాలని గెహ్లాట్ యోచించారు.

అధిష్ఠానం మాత్రం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలట్‌ను సీఎంగా ప్రమోట్  చేయాలని భావించింది. అధిష్టానం యోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గెహ్లాట్ మాత్రం ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్నజోషికి ఆ పదవిని కట్టబెట్టాలని భావించారు. రెండేళ్ల క్రితం గెహ్లాట్ సర్కారుపై సచిన్ పైలట్ తిరుగుబాటు చేశారు. ఇప్పుడిదే పైలట్ ను  సీఎం కాకుండా అడ్డుపడుతోంది.

ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన వ్యక్తికి సీఎం పదవి ఎలా అప్పగిస్తారని  గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల అభ్యంతరం చెబుతూ రాజీనామాలు చేశారు. దీంతో రాజకీయాలు వేడెక్కాయి, సంక్షోభం నెలకొంది. 

అప్పట్లో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన వారిలో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని గెహ్లాట్ వర్గం డిమాండ్ చేస్తోంది. చేయాల్సింది అంతా చేసి నా చేతుల్లో ఏమీ లేదంటున్నారు గెహ్లాట్.  దీంతో అధిష్టానం అడకత్తెరలో పడింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో గెహ్లాట్‌ను గనుక తప్పిస్తే.. శశిథరూర్‌తో పాటు దిగ్విజయ్‌ సింగ్‌, ముకుల్‌ వాస్నిక్‌ లాంటి నేతలు అధ్యక్ష పదవి రేసులో నిల్చునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధిష్ఠానం ఇపుడు ఏమి చేస్తుందనేది సస్పెన్స్. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!