Ravana is their god ………………..
మనదేశంలో రావణుడిని దేవుడిగా ఆరాధించే తెగలు కొన్ని ఉన్నాయి. ఈ తెగ ప్రజలు దసరా సందర్భంగా ‘రావణ దహన కార్యక్రమాలు’ చేపట్టరు. కొన్ని చోట్ల అయితే రావణ దహన కార్యక్రమాన్ని దేశంలో నిషేధించాలని డిమాండ్ కూడా వినిపిస్తోంది. మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో రావణుని వారసులమని చెబుతున్న ఒక తెగ ఉంది.
దేశంలో రెండో పెద్ద తెగైన గోండు ప్రజలు రావణుడిని తమ రాజుగా , దేవుడి గా భావిస్తారు. పశుపక్ష్యాదులను పూజించే ఈ అడవి బిడ్డలు రావణుడిని దైవంగా కొలుస్తారు. పదో ధర్మగురువుగా రావణుడిని గోండులు పూజిస్తారు.
రావణుడు తమ పూర్వ వీరుడని వారు చెబుతుంటారు. ఆది దేవుడు అయిన కుపార్ లింగో వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు గుర్తుగా రావణ మహోత్సవాన్ని ప్రతి ఏటా వీరు నిర్వహిస్తుంటారు.
చూస్తుంటే … రామాయణంలోని రావణుడికి ఈ రావణుడి కి సంబంధం లేదు అనిపిస్తుంది. వీరి కథలోని రావణుడి వ్యక్తిత్వానికి రావణాసురుడికి పోలికలేదు. తీరు వేరుగా ఉంది.గోండుల కథలో, జానపదాల్లో ఆయనో మహావీరుడు. వారి పూర్వ రాజు. అతడి పుట్టుక శ్రీలంకలో కాదు మధ్యప్రదేశ్లోని అమర్ కంఠక్ వద్ద. ఈ రావణుడు బ్రాహ్మణుడు కూడా కాదు.
గోండుల వంశీకుడు. వీరి జానపదాల్లో రావణుడిది ఆదర్శ వ్యక్తిత్వం.18 సంగీత పరికరాల్ని సాధన చేయగల దిట్ట అంటారు. గోండులకు దసరా అంటే ఆయుధాల్ని పూజించే పండగ. వన దేవతగా వీరు రావణుడిని కొలుస్తారు. గోండులు రావణుడి పేరిట ఏటా ప్రత్యేక సంబరం నిర్వహిస్తారు.
గడ్చిరోలి లోని పరస్వాది గ్రామంలో ప్రజలు నిర్వహించే వేడుక కూడా ప్రత్యేకంగా ఉంటుంది. పసుపు పచ్చటి రంగుతో ఉండే రావణుడి రెండున్నర అడుగుల ప్రతిరూపాన్ని తయారు చేస్తారు. ఆ విగ్రహాన్ని శాలువాతో అలంకరిస్తారు. గోండుల నమ్మకం ప్రకారం పసుపు రంగు సృష్టి,వినాశనాలకు సంకేతం.ముస్తాబు చేసిన ఈ రావణ ప్రతిరూపాన్ని ఏనుగు వాహనంపై ఊరేగింపుగా తీసుకెళతారు.
వాహనాన్ని గడ్డి, బంకమట్టితో నిర్మించి రంగులతో అలంకరిస్తారు.ఇనుప చక్రాల మీద వాహనాన్ని ఊరిలోని ప్రధాన వీధుల్లో తిప్పుతూ ఊరేగిస్తారు. గ్రామ ప్రజల ఇళ్ల మధ్యలోకి వచ్చి దీవెనలిచ్చాక పంట భూముల వరకు ఊరేగింపు సాగుతుంది. ఆ తర్వాత విగ్రహాన్ని తిరిగి పూజా మండపాలకు తీసుకెళతారు.ఎక్కడి వరకు ఊరేగింపు సాగిందో అక్కడ ఒక ఇంద్రధనస్సు జెండాను స్థాపిస్తారు.
ఊరి పూజారి ధాన్యపు గింజల్ని ఊరంతా చల్లుతూ అంతా శుభం కలగాలని దీవిస్తాడు. పది రోజుల పాటు నిర్వహించే ఉత్సవంలో పసుపు రంగే కీలకం. గోండులు నమ్మే ప్రతీకల్లో ముఖ్యమైన ఎద్దు కొమ్ములతో చేసిన చిహ్నాన్నికూడా ప్రదర్శిస్తారు.’మణి రావణ దుగా’ అనే ఉపాధ్యాయుడు గోండుల ఆచార వ్యవహారాల్ని పరిరక్షించే ఉద్యమాన్ని చేపట్టారు.
ఈ రావణ మహోత్సవం కూడా అందులో భాగమే.తమ పూర్వీకుడు,పెద్ద అయిన రావణుడి కథ, తమ చరిత్ర వక్రీకరణకు గురైందని గోండులు అంటారు. ఇక్కడ పూజింపబడుతోంది ఆదర్శ వ్యక్తిత్వం, విలువలు, వీరత్వం ఉన్న రావణుడు. ఇతరులు చెప్పేటటువంటి దుష్ట లక్షణాలున్న రావణుడికి వీరి ధర్మగురువుకి సంబంధం లేదని వారంటారు.
గోండులు రావణుడిని పురాతన కాలం నుండి గౌరవిస్తున్నారు. వాల్మీకి రామాయణం కూడా రావణుడి గురించి చెడుగా ఏమీ చెప్పలేదు. తులసీదాస్ రామాయణంలో మాత్రమే రావణుడి గురించి చెడు చెప్పారు. భూతం గా చిత్రీకరించారని గోండు తెగ పెద్దలు వాదిస్తుంటారు. ఇప్పటికి వారు రావణ దహన కార్యక్రమాన్ని నిషేధించాలని కోరుతూ ప్రతి దసరాకు ముందు జిల్లా కలెక్టర్ కి మెమోరాండం సమర్పిస్తుంటారు.
ఇక్కడే కాక మాండ్సౌర్ ( మధ్యప్రదేశ్).. బిస్రఖ్ (ఉత్తర ప్రదేశ్)… జోధ్పూర్ (రాజస్థాన్) … కాంగ్రా (హిమాచల్ ప్రదేశ్ ) ప్రాంతాల్లో కూడా రావణుడిని ఆరాధిస్తుంటారు. గుజరాత్లోని సచోరా బ్రాహ్మణులు కూడా రావణుడి వారసులమని చెప్పుకుంటారు. వారిలో కొందరు “రావణ” అనే ఇంటిపేరును కలిగి ఉన్నారని అంటారు.