A volcano that has erupted 33 times…………………………..
ప్రపంచంలోనే అతి పెద్ద క్రియాశీల అగ్నిపర్వతం ‘మౌనా లోవా (Mauna Loa) లో మంటలు ఇంకా ఎగిసి పడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలోని హవాయి (Hawaii) ద్వీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం.. నవంబర్ 27 నుంచి విస్ఫోటం చెందుతోన్న సంగతి తెలిసిందే.
దీంతో అగ్నిపర్వత పరిసర ప్రాంతాలు.. ఎర్రటి లావా ప్రవాహాలు, బూడిద, పొగతో నిండి పోయాయి. 1984 తర్వాత ఈ పర్వతం నుంచి లావా వెలువడటం ఇదే మొదటిసారి. గత వారం రోజుల నుంచి లావా పెద్ద ఎత్తున ఎగ జిమ్ముతోంది. దీంతో అక్కడ పరిస్థితి భీకరంగా మారింది.
రెండుమూడు చోట్ల నుంచి ఫౌంటెయిన్ల మాదిరిగా.. దాదాపు 20 నుంచి 25 అడుగుల ఎత్తువరకు లావా ఎగజిమ్ముతున్న దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అమెరికా జియాలజికల్ సంస్థ సర్వే ప్రకారం.. 1843 నుంచి ఇప్పటివరకు ఈ అగ్నిపర్వతం 33 సార్లు పేలింది.లావా ప్రవాహం గంటకు దాదాపు 200 అడుగుల (60 మీటర్లు) వేగంతో ఈశాన్య దిశలో ముందుకు సాగుతున్నది.
అధికారులు ముందు జాగ్రత్తగా అటు వైపు ఎవరిని పోనివ్వడం లేదు. ప్రస్తుతం హవాయిలోని ప్రధాన రహదారి ‘సాడిల్ రోడ్’కు 4.3 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రవాహం ఉంది. ‘మౌనా లోవా’ విస్ఫోటనం ఎంతకాలం ఉంటుందో అంచనా వేయడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1984లో పేలినప్పుడు.. దాదాపు మూడు వారాలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది.
ఈ అగ్నిపర్వతం విస్ఫోటనాల కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. 1926, 1950లో జరిగిన విస్ఫోటనాలు కొన్ని గ్రామాలను నాశనం చేశాయి. హిలో నగరాన్ని 19వ శతాబ్దం చివరి నుండి లావా ప్రవాహాలపై పాక్షికంగా నిర్మించారు. ప్రస్తుత లావా ప్రవాహం కూడా అప్పటి మాదిరిగానే ఉంది. మరోవైపు.. ఈ అగ్నిపర్వతాన్ని చూసేందుకు పర్యాటకులు బారులు తీరుతున్నారు.