బొక్క బోర్లాపడిన మాజీ గూఢ చారి !!

Sharing is Caring...

పుతిన్ యుద్ధ ప్రణాళికలు ముందు గానే లీక్ అయ్యాయా ? వ్యూహం మార్చి మళ్ళీ దాడులకు తెగబడుతున్నారా ? అందుకే డాన్ బాస్ ప్రాంతంలో విజయం సాధించి పరువు కాపాడుకోవాలని అనుకుంటున్నారా ? అంటే అవుననే చెప్పుకోవాలి.

అంతర్జాతీయ మీడియా కథనాలు ఆ  మాటలే చెబుతున్నాయి. కేజీబీ లో గూఢచారిగా పనిచేసిన అనుభవం ఉన్న పుతిన్ పూర్తిగా సొంత నిఘా వర్గాలను నమ్ముకుని బొక్క బోర్లా పడ్డారు.  ఉక్రెయిన్ గురించి దాని శక్తి సామర్ధ్యాల గురించి రాంగ్ ఫీడ్ బ్యాక్ తో ఒక నిర్ణయానికి వచ్చి యుద్ధానికి వెళ్లి 47 రోజుల్లో ఏమీ సాధించలేక సేనలను వెనక్కి మళ్లించారు.

ఉక్రెయిన్‌లో రష్యా వైఫల్యాలకు సొంత నిఘా వ్యవస్థల్లోని గూఢచారులే కారణమని పుతిన్ భావిస్తున్నారు. దాడికి ముందే రష్యా ప్లాన్ల బ్లూప్రింట్లు అమెరికా, యూకేలకు చేరాయని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో సన్నిహితులని  కూడా చూడకుండా నిఘా విభాగం అధికారులపై వేటు వేస్తున్నారు.

ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక .. వరుస వైఫల్యాలతో రష్యా అధ్యక్షుడు  పుతిన్‌ మరింత మొండిగా మారారు. కఠినంగా వ్యవహరిస్తున్నారు. కసితో ,కక్షతో జనావాసాలపై కూడా బాంబులు వేయించి మారణ కాండకు దిగారు. తాజాగా విదేశీ గూఢచర్య విభాగం కీలక అధికారిని నిర్బంధంలోకి తీసుకున్నారు. రాత్రికి రాత్రే డజన్ల కొద్దీ అధికారులపై చర్యలు తీసుకొన్నట్లు వార్తలొస్తున్నాయి. అరెస్టైన వారి సంఖ్య దాదాపు 150 వరకు ఉంటుందని భావిస్తున్నారు. 

రష్యా గూఢచర్య వర్గాల్లో విదేశీ వ్యవహారాలను చక్కబెట్టే ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ విభాగానికి చెందిన ఫిఫ్త్‌ సర్వీస్‌ చీఫ్‌ కర్నల్‌ జనరల్‌ సెర్గీ బెసెడాను అధికారులు అరెస్ట్ చేశారు.  రష్యా ఆక్రమణ మొదలు పెట్టడానికంటే ముందే పశ్చిమ దేశాల నిఘా వర్గాలు రష్యా వ్యూహాలను పసిగట్టడంపై పుతిన్ సీరియస్ అయ్యారు. సెర్గీ బెసెడాను జైలుకి తరలించారు. యుద్ధ ప్రణాళిక లీకుల వ్యవహారాన్ని దర్యాప్తు చేసేందుకు  కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌కు పుతిన్‌ అప్పగించారు. 

యుద్ధానికి ముందు ఉక్రెయిన్‌లోని వాస్తవిక పరిస్థితిని చెప్పకుండా.. క్రెమ్లిన్‌కు తప్పుడు సమాచారం అందించినందుకు ఈ చర్యలు తీసుకొన్నట్లు ఓ ఆంగ్ల పత్రిక పరిశోధనాత్మక కథనంలో రాసింది.  రష్యన్లను ఉక్రెయిన్‌ వాసులు విమోచకులుగా భావించి స్వాగతం పలుకుతారు అని వారు తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి.

దీంతో తప్పుడు అంచనాలతో యుద్ధం మొదలుపెట్టిన పుతిన్ ముక్కు మొహం పగిలాయి. ఉక్రెయిన్ ఆయుధ సంపత్తి గురించి కూడా తప్పుడు సమాచారమే ఇచ్చారట. ఫిబ్రవరి 24 న మరికొన్ని గంటల్లో రష్యా ట్యాంకులు దాడి ప్రారంభిస్తాయనగా  పుతిన్‌ యుద్ధ ప్రణాళికలను మ్యాప్‌లతో సహా బ్రిటన్‌ రక్షణ మంత్రిత్వశాఖ ట్విటర్లో ఉంచింది.

వీటిల్లో రష్యా సాయుధ వాహనాలు వచ్చే మార్గాలను కూడా వివరించింది. . నాటి నుంచి రష్యా ఏం చర్యలు తీసుకోబోతోందో  అమెరికా, యూకే ఇంటెలిజెన్స్‌ వర్గాలు  బహిర్గతం చేస్తూ వచ్చాయి. అంతేకాదు.. రష్యా జనరల్స్‌ మరణాలను కూడా చాలా ఖచ్చితంగా చెప్పగలిగాయి.దీంతో రష్యా సైన్యాలు ఘోరంగా ఎదురుదెబ్బలు తినాల్సిన పరిస్థితి నెలకొంది. 

అలాగే అమెరికా గూఢచారులు ఈ విషయంలో చాలా చురుగ్గా పనిచేశారని అంటున్నారు. ఎప్పటి కప్పుడు సమాచారాన్ని జోబిడెన్ కి అందించేవారట.  వీటిని బట్టి చూస్తే రష్యా కంటే ఇతర దేశాల గూఢచారులు ఎంత బాగా పనిచేస్తున్నారో ఇట్టే అర్థమౌతోంది. ఈ కారణంగా.. పుతిన్‌ రంగంలోకి దిగి బాధ్యులుగా భావిస్తున్నవారిపై కఠిన చర్యలు చేపట్టారు. అంతేకాదు.. కనీసం డాన్‌బాస్‌ ప్రాంతంలో విజయం సాధించి అయినా పరువు కాపాడుకోవాలని రష్యా భావిస్తోంది. అందుకే ఈ ప్రాంతంపై రష్యా గురిపెట్టింది.కసాయి సైనిక కమాండర్లను రంగంలోకి దించింది.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!