వెండి తెరపై ప్రయోగాలు ఆయనకే సాధ్యం ! (part 2)

Sharing is Caring...

Bharadwaja Rangavajhala ……………………………………..

Ntr experiments on silver screen …………………………………ఏడాదికి ఒకటి రెండు సినిమాలు క్రమం తప్పకుండా రామకృష్ణ బ్యానర్ లో తీసేవారు రామారావు. హీరోగా బిజీగా ఉంటూనే సొంత చిత్రాల నిర్మాణం మీద దృష్టి పెట్టడం మామూలు విషయం కాదు. స్క్రిప్ట్ తో పాటు రామకృష్ణ బ్యానర్ మీద వచ్చే చిత్రాలకు తనే దర్శకత్వం వహించేవారు రామారావు.స్వీయ దర్శకత్వంలో సంపూర్ణ రామాయణం తీయాలనేది ఒకనాటి రామారావు కల.

అందుకోసం సముద్రాలతో స్క్రిప్ట్ పని కూడా చేయించారు. కారణాలేవైనా ఆ సినిమా కార్యరూపంలోకి రాలేదు. డెభై దశకంలో బాపు రమణలు సంపూర్ణ రామాయణం తీయానుకున్నప్పుడు ఎన్టీఆర్ ను కలిసి విషయం చెప్పారు.నాకెందుకు చెప్తున్నారని రామారావు అడగ్గానే మీరు సముద్రాలతో స్క్రిప్ట్ కూడా చేయించారు కదా…అన్నార్ట బాపు.

నో ప్రాబ్లమ్ మీరు కంటిన్యూ అవండని భుజం తట్టిన రామారావు … స‌ముద్రాల రాసిన స్క్రిప్టును ఇంప్ర‌వైజ్ చేస్తున్నాను అన్నార‌ట … ఆ తర్వాత చాలా కాలానికి ఆ ఇంప్ర‌వైజ్డ్ స్క్రిప్టుతో శ్రీ రామ పట్టాభిషేకం తీశారు.శ్రీ రామ పట్టాభిషేకంలో రాముడు, రావణుడు రెండూ తనే చేశారు ఎన్.టిఆర్. రావణ పాత్ర మీద తనకున్న ప్రత్యేక ఇంట్రస్ట్ ను మరోసారి చాటుకున్నారు.

రామ రావణ యుద్దానికి రాముడి విజయాన్ని ఆకాంక్షిస్తూ…రావణుడే ముహూర్తం పెట్టడం. లక్ష్మణుడికి రావణుడు రాజనీతి బోధించడం లాంటి సన్నివేశాలు ప్రజల్లో ప్రచారంలో ఉన్నా… స్క్రీన్ మీదకు తీసుకు వచ్చిన ధైర్య శాలి మాత్రం రామారావే.రావణుడు పెట్టిన ముహూర్తబలం వల్లే రాముడు యుద్దం గెల్చాడని ఆడియన్స్ కన్విన్స్ అయ్యే లా దృశ్యాలు నడిపుతాడు రామారావు.

రావణుడి గొప్పతనాన్ని సాక్షాత్తు రాముడితోనే చెప్పిస్తాడు.  రావణుడి గొప్పతనాన్ని కీర్తిస్తూ మండోదరితో ఓ పాట కూడా పాడించారు. ఇవ‌న్నీ ఒకెత్తైతే శూర్ప‌ణ‌ఖ ముక్కుచెవులు క‌త్తిరించిన సంఘ‌ట‌న‌కు స్పందిస్తూ రావ‌ణుడు చెప్పే డైలాగులు … కాస్త ఆశ్చ‌ర్యం క‌లిగిస్తాయి. ఆ ముని మ్రుచ్చుల ప్రేర‌ణ‌తో మా ద్ర‌విడ జాతిని నాశ‌నం చేయ‌డానికి ఆర్య జాతి చేస్తున్న ముష్క‌ర ప్ర‌య‌త్నంగా అభివ‌ర్ణిస్తాడు.

డెభై ఏడు తర్వాత హీరోగా ఎవరూ తేరి పార చూడలేని హైట్స్ కు చేరిపోయారు ఎన్.టి.ఆర్. అటువంటి సమయంలో కీచకుడి లాంటి పాత్ర చేయాలనుకోవడం ఇంకెవరూ చేయలేని కనీసం ఆలోచన కూడా చేయలేని అంశం. కానీ ఎన్.టి.ఆర్ కి తను కీచకుడిగా చేయాలనిపించింది. చేశారు.

బ‌హుశా ఆయ‌న‌లో ఎస్వీఆర్ చేసిన పాత్ర‌లు త‌నూ చేయాల‌నే ఆలోచ‌న ఉండ‌డం కార‌ణం కావ‌చ్చు… పృధ్వీరాజ్ క‌పూర్ చేసిన అక్బ‌ర్ వేషం త‌నూ చేయాల‌ని అనార్క‌లి తీసిపడేసినట్టు  ఉండేది ఆయ‌న ఆలోచ‌న‌. అలా వ‌చ్చిందే కీచ‌క వేష‌దార‌ణ‌. కేవలం కీచకుడి పాత్ర కోసమే….నర్తన శాలను శ్రీ మద్విరాటపర్వం సినిమాగా తీశారు.

కీచకుడు ఉన్న సన్నివేశాల్లో దాదాపుగా కథను ఆ కోణం నుంచే నడిపిస్తారు రామారావు. నర్తనశాల సంగీతం అందించిన సుసర్ల దక్షిణామూర్తితోనే సంగీతం చేయించారు. వేటూరి తో జీవితమే కృష్ణ సంగీతమే పాట రాయించారు ఎన్.టి.ఆర్. నర్తనశాలలో పాటలకు ఏ మాత్రం తీసిపోని విధంగా తయారయ్యాయి విరాటపర్వంలో పాటలు. పుల్లయ్య దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర మహత్మ్యం రెండు సార్లు చేశారు ఎన్.టి.ఆర్. రెండు సార్లూ సినిమా సూపర్ డూపర్ సక్సస్ అయింది.

అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం శ్రీ తిరుపతి వెంకటేశ్వర కల్యాణం. ఓ మోస్తరుగా ఆడిన ఈ చిత్రం దర్శకుడుగా ఎన్టిఆర్ కు మంచి పేరు తెచ్చింది. తిరుపతి వెంకటేశ్వర కల్యాణం తర్వాత ఎన్.టి.ఆర్ దర్శకత్వానికి దూరం జరిగారు.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, బాపయ్య దర్శకత్వంలో అగ్గిరవ్వ, తాతినేని రామారావు కాంబినేషన్ లో అనురాగదేవత చిత్రాలు తీశారు.

నిజానికి సీరియస్ సినిమాలకు కూడా ఆయన దూరమయ్యారు. కారణం తన భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునే పనిలో బిజీ అవడమేనేమో.  వెంకటేశ్వర కల్యాణం తర్వాత రామకృష్ణ స్డూడియోస్ లో బయట దర్శకులు ముగ్గురు సినిమాలు తీశారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్, బాలయ్య హీరోలుగా రౌడీ రాముడు కొంటె కృష్ణుడు సినిమా వచ్చింది.

వాకింగ్ టాల్ సినిమా ఆధారంగా సామాజిక అన్యాయాలపై నిరసనగా ఓ పక్కా మాస్ సినిమా ప్లాన్ చేశారు ఎన్టిఆర్. దర్శకుడు బాపయ్యకు బాధ్యతలు అప్పగించారు. అగ్గిర‌వ్వ‌గా విడుద‌లైన ఆ సినిమా మంచి వ‌సూళ్లే రాబ‌ట్టింది.రామారావుతో యమగోల లాంటి సక్సస్ ఫుల్ మూవీ చేసిన తాతినేని రామారావు దర్శకత్వంలో ఓ రీమేక్ సినిమా చేశారు. అనురాగదేవత పేరుతో రిలీజ్ అయిన ఈ మూవీ కమర్షియల్ గా పెద్ద విజయాన్నే సాధించింది.

బాలకృష్ణను హీరోగా నిలబెట్టేందుకు కొన్ని ప్రయత్నాలు చేశారు రామారావు. ఆ క్రమంలో వచ్చిందే సింహం నవ్వింది. ఎన్.ఎ.టి బ్యానర్ లో మెజార్టీ సినిమాలు డైరక్ట్ చేసిన సీనియర్ డైరక్టర్ యోగానంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. దాదాపు ఎన్.టి.ఆర్ రాజకీయప్రవేశం సమయంలో చాలా హడావిడిగా షూట్ చేసి విడుదల చేసిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా రామకృష్ణ స్టూడియోస్ పేరుమీద చిత్రాలు తీశారు ఎన్.టి.ఆర్. రాజకీయ ప్రవేశం ప్రకటించే సమయంలో ఆయన చండశాసనుడు చిత్ర షూటింగ్ లో నిమగ్నమై ఉన్నారు. నిజానికి అప్పటికే పూర్తై సెన్సార్ వివాదంలో మరో చిత్రం ఉంది. అదే శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి చరిత్ర.

ముఖ్యమంత్రి హోదాలో సినిమాల్లో నటించిన రికార్టు కూడా ఎన్.టి.ఆరే దక్కించుకున్నారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర కూడా రామకృష్ణా స్టూడియోస్ బ్యానర్ మీద రూపొందినదే. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా కూడా రామారావు తాత్విక నేపధ్యంలో రూపుదిద్దుకున్నదే. వీర బ్రహ్మేంద్ర స్వామి కూడా బ్రాహ్మణాధిపత్యం మీద కట్టుబాట్ల మీద తిరుగుబాటు ప్రకటించిన వాడే.

కాల‌జ్ఞానం రచయితగానే కాకుండా సామాజిక కోణం కూడా బ్రహ్మంగారిలో ఉందని కొండవీటి వెంకట కవి, నందమూరి తారక రామారావు నమ్మి తీసిన చిత్రం ఇది. వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాను సెన్సార్ ఇబ్బందుల వల్ల విడుదలలో విపరీతమైన జాప్యం జరిగింది. ఒక చారిత్రక పాత్రను ఆదారం చేసుకుని ప్రస్తుత సమాజంలోని కొన్ని అంశాలను వ్యంగ్యంగా చెప్పే ప్రయత్నం జరిగిందనేది సెన్సార్ అభిప్రాయం.

దీని మీద తీవ్ర పోరాటం చేసి ఏడాది తర్వాత సినిమా విడుదల చేసుకోగలిగారు రామారావు. వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర విడుదలయ్యే సమయానికి రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే దాని తర్వాత ప్రారంభించిన చండశాసనుడు రామారావు రాజకీయ ప్రవేశం సమయంలోనే విడుదలైంది.

చండశాసనుడు సినిమాలోనూ పొలిటికల్ డైలాగ్స్ …అన్యాపదేశంగా ఇందిరాగాంధీ మీద విసుర్లు ఉన్నాయనే అభిప్రాయాలు అప్పట్లో వినిపించాయి. ఎన్.టి.ఆర్ స్వీయ నిర్మాణంలో వచ్చిన చాలా చిత్రాల్లో కనిపించే ధోరణే అది. చండ‌శాస‌నుడు సినిమాకు రాఘ‌వేంద్ర‌రావును ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌మ‌ని కోరారు.

ఆయ‌న బిజీ కావ‌డంతో … త‌నే చేసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి సినిమాల్లో కీలక పాత్ర పోషించిన ముఖ్యమంత్రిగా కూడా చరిత్ర సృష్టించారు ఎన్.టి.ఆర్. తీవ్ర విమర్శల మధ్య ప్రారంభమైన బ్రహ్మర్షి విశ్వామిత్ర విడుదలకు ముందు చాలా సంచలనం సృష్టించిందిగానీ విడుదలయ్యాక భారీగా నిరాశ పరిచింది. ఈ సినిమా హిందీ వర్షన్ అసలు విడుదల కానేలేదు.

ప్రతిపక్ష నాయకుడుగా ఉంటూ మరోసారి చిత్ర నిర్మాణం వైపు దృష్టి పెట్టారు రామారావు. సామ్రాట్ అశోక తీయాలనే కోరికను తీర్చుకున్నారు. ఆ తర్వాత శ్రీమతి మూవీస్ బ్యానర్ మీద శ్రీనాథ  కవి సార్వభౌముడు సినిమా చేశారు. బాపు దర్శకత్వంలో తన బ్యానర్ లో ఒక చిత్రం చేయాలనుకుని తీసిన చిత్రం అది.ఎన్టిఆర్ చివరి చిత్రం కూడా శ్రీనాథ కవిసార్వభౌమ కావడం విశేషం.

ఎన్.టి.ఆర్ తర్వాత రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ మీద నందమూరి బాలకృష్ణ హీరోగా మూడు సినిమాలు వచ్చాయి. నందమూరి తారక రత్న హీరోగా మరో చిత్రం వచ్చాయి. బాలయ్య రాఘవేంద్రరావుల కాంబినేషన్ లో వచ్చిన పట్టాభిషేకం కూడా నిరాశపరిచింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తీసిన అనసూయమ్మగారి అల్లుడు విజయం సాధించింది.

ఇవీ రామకృష్ణ స్టూడియోస్ బానర్ లో వచ్చిన చిత్ర విశేషాలు. మెజార్టీ చిత్రాలు ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్నవే.అంతే కాదు … రామారావు ఆలోచనలకు అద్దం పట్టే చిత్రాలుగా తయారవడం విశేషం. ఎన్.టి.ఆర్ ఆలోచనా సరళి తెలుసుకోవాలంటే ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు చూస్తే సరిపోతుంద‌నేలా తీసిన సినిమాలు అవి… ఈ ప్ర‌య‌త్నం అంత సీరియ‌స్ గా చేసిన హీరో ఎవ‌రూ క‌నిపించ‌రు… దీనికి కాస్త అటూ ఇటూగా కృష్ణ ఒక్క‌రే … నిల‌బ‌డ‌తాడేమో .

pl. read it also…………………. వెండి తెరపై ప్రయోగాలు ఆయనకే సాధ్యం ! (part 1)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!