త్వరలో ఎన్నికలు జరగబోతున్న పంజాబ్‌లో ప్రస్తుతం అందరి కళ్లూ మాల్వాపైనే ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా మాల్వా పైనే దృష్టి పెట్టాయి. పంజాబ్ లో మాల్వా, మాఝా, దొవాబా అనే మూడు ప్రాంతాలున్నాయి. వీటిలో మాల్వా అతి పెద్ద ప్రాంతం. ఈ మాల్వాలో ఉన్న జిల్లాల్లో 69 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ఈ ప్రాంతంలో పాటియాలా, బటిండా, మోగా, సంగ్రూర్, లెహ్రా, ఫతేఘర్ సాహిబ్, రూపనగర్, ఎస్ ఏ ఎస్ నగర్, మలేర్‌కోట్ల, మాన్సా, బర్నాలా వంటి ముఖ్యమైన అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.ఈ ప్రాంతంలో అత్యధిక సీట్లు దక్కించుకున్న పార్టీయే పంజాబ్ లో అధికార పీఠం కైవశం చేసుకోవడం ఒక ఆనవాయితీగా ఉంది.
మధ్యలో ఈ ఆనవాయితీ తప్పిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతం పై పట్టు బిగించేందుకు ప్రధాన పార్టీలూ వ్యూహ రచన చేస్తున్నాయి.ఇటీవల ఈ ప్రాంతంలో జీ న్యూస్ చేసిన సర్వే లో ఇక్కడి 69 అసెంబ్లీ సీట్లకు గాను ఆప్ 28-30 సీట్లు, కాంగ్రెస్ 19-21 సీట్లు, శిరోమణి అకాలీదళ్ 13-14 సీట్లు, బీజేపీ 2-3 సీట్లు, ఇతరులు 2-4 అసెంబ్లీ సీట్లు గెలుచు కోవచ్చని తేలింది.
2012 అసెంబ్లీ ఎన్నికల్లో మాల్వాలో 34 సీట్లు దక్కించుకున్న శిరోమణి అకాలీదళ్ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్ 31 స్థానాలకు పరిమితమైంది. 2017 ఎన్నికల్లో ఇక్కడ అకాలీదళ్ బాగా వెనుకబడింది. కేవలం 8 సీట్లకే పరిమితమైంది. ఆప్ 18 సీట్లతో సత్తా చాటుకుంది. 40 అసెంబ్లీ సీట్లలో విజయంసాధించిన కాంగ్రెస్.. రాష్ట్రంలో అధికార పీఠాన్నిదక్కించుకుంది.
ఇందిరా గాంధీ దారుణ హత్య తర్వాత 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మాల్వా లో 50 సీట్ల వరకు శిరోమణి అకాలీదళ్ గెలుచుకుంది. మిగిలిన రెండు చోట్లా 23 సీట్లు వచ్చాయి. ఆ పార్టీ యే అధికార పగ్గాలు చేపట్టింది. 1992లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 117 స్థానాలకు గానూ 62 స్థానాలను గెలుచుకుంది. మాల్వా ప్రాంతంలో 50 శాతం సీట్లను కూడా దక్కించు కోలేకపోయింది.
2007లో శిరోమణి అకాలీ దళ్ , బీజేపీ కూటమి మాల్వాలో కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టాయి. అప్పుడున్న 65 సీట్లకు గాను కాంగ్రెస్ 37, అకాలీ దళ్ 19 సీట్లు, మిగిలినవి ఇతరులు గెలుచుకున్నారు.ఈ సారి మాల్వాలో ఏ పార్టీ పైచేయి సాధిస్తుందో చూడాలి. పంజాబ్ సీఎంలలో చాలామంది మాల్వా ప్రాంతం వారే. అయినా ఆ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదనే విమర్శలు న్నాయి.
ఇక్కడ రైతు సంఘాలు చురుగ్గా పనిచేస్తాయి. సాగుచట్టాలపై పోరులో పాల్గొన్న రైతన్నలు ఎటు మొగ్గు చూపుతారో ..ఆ పార్టీకే అధికారం దక్కవచ్చు. పంజాబ్‌లో ప్రాంతాలవారీగా అసెంబ్లీ నియోజకవర్గాలు… మాల్వా 69… మాఝా 25… దొవాబా 23 సీట్లు ఉన్నాయి. ఇక మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు కాగా అధికారం చేపట్టడానికి అవసరమైన కనీస సీట్లు 59 మాత్రమే. ఫిబ్రవరి 20న (ఒకే విడతలో) ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు మార్చి 10న వెలువడతాయి.