పొంజీ స్కీం గురించి విన్నారా ?

Sharing is Caring...

Be ware of cheating schemes……………………………….

మార్కెట్ లో ఎపుడూ మోసం చేసే వ్యక్తులు ఉంటారు. సులభంగా ధనార్జనే వారి లక్ష్యం. అందుకోసం రకరకాల మార్గాలు ఎంచుకుంటుంటారు. పది రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఏడాదిలో ఇరవై ఇస్తామని చెబుతుంటారు. కొత్త స్కీం లతో ముందుకొచ్చి అదనపు బహుమతులు ఎర వేస్తుంటారు. స్వల్ప కాలంలో ఎక్కువ సొమ్ము ఆర్జించాలని ఆశ ఉన్నవాళ్లు అలాంటి వాళ్ళ ట్రాప్ లో పడిపోతుంటారు.

అలాంటి స్కీమే పోంజీ స్కీం. సులువుగా చెప్పాలంటే కొత్త పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి పాత పెట్టుబడిదారులకు అందించడమే ఈ పొంజీ స్కీం. మొదటి సారిగా చార్లెస్ పొంజీ అనే వ్యక్తి దాదాపు వందేళ్ల క్రితం అమెరికాలో ఈ తరహా స్కీం మొదలు పెట్టి చాలామందిని ముంచేశాడు. అందుకే దానికి ఆ పేరు స్థిరపడి పోయింది.

ఇలాంటి స్కీం లతో వచ్చే వాళ్ళు ముందుగా ఓ సంస్థను పెడతారు. అందులో పెట్టుబడి పెడితే నిర్ణీత గడువు తరువాత మార్కెట్ రేటు కంటే ఎక్కువ వడ్డీతో డబ్బు తిరిగిస్తామని నమ్మిస్తారు.లేదా బంగారం ఇస్తామని ఆశ పెడతారు. అదనంగా బహుమతులు కూడా ఇస్తుంటారు. బాగా పబ్లిసిటీ చేస్తుంటారు. చెప్పినట్లుగానే మొదట్లో కొంతమందికి  అలానే ఇస్తారు.

దాంతో ఇన్వెస్టర్లలో ఆశ పెరుగుతుంది. వారు మరికొంతమంది ని  చేర్పిస్తారు. వారిని చూసి ఇంకొందరు డబ్బు పెట్టడం మొదలు పెడతారు. అలా కొత్తగా పెట్టుబడి పెట్టినవారి నుంచి వచ్చిన సొమ్మును పాత వారికి ఇస్తారు. ఇన్వెస్టర్లు డబ్బును వెనక్కుతీసుకోకుండా ఉండేందుకు ఎక్కువ కాలం డిపాజిట్ చేస్తే, వడ్డీ మరింత ఎక్కువగా చెల్లిస్తామని మాయ మాటలు చెబుతారు.

ఈ తరహా ప్రచారం వల్ల పెట్టుబడులు మరింత పెరుగుతాయి. చెల్లించాల్సిన మొత్తం తగ్గుతుంది.ఏజెంట్లను పెట్టుకుంటారు.వారికి కమీషన్లు ఇస్తారు.గొలుసు కట్టు మాదిరి వ్యాపారాన్నివిస్తరించుకుంటూ వెళతారు.

కొత్త పెట్టుబడులు వస్తున్నంత కాలం అంతా సాఫీగా సాగుతుంది. కానీ కొత్త వాళ్లు ఎప్పుడైతే డబ్బులు పెట్టడం మానేస్తారో, అప్పుడే సమస్యలు మొదలవుతాయి. పాత వాళ్లకు చెల్లించడానికి సంస్థ దగ్గర డబ్బులుండవు. దాంతో దివాలా బోర్డు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా ఎన్నో సంస్థల విషయంలో జరిగింది.

ఇలాంటి స్కీముల కుంభకోణాలు బయటపడేంత వరకు అవి ఎంత ప్రమాదకరమో జనాలకు తెలియదు. అందుకే, ఎవరైనా పెట్టిన పెట్టుబడికి ఎక్కువ రాబడి ఇస్తామని చెప్పినా తొందరపడి ఇన్వెస్ట్ చేయకూడదు. అలాగే మార్కెట్ స్థితిగతులతో సంబంధం లేకుండా ఎక్కువ డబ్బు చెల్లిస్తామని చెప్పినా టెంప్ట్ కాకూడదు.

అసలు సంస్థకు  అధికారిక రిజిస్ట్రేషన్, లైసెన్సులు ఉన్నాయా ? లేవా అనే విషయాలు తెలుసుకోవాలి. అవి లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తుంటే .. అలాంటి సంస్థలకు దూరంగా ఉండాలి. ఒకసారి పెట్టుబడి పెడితే వెనక్కి తీసుకోవడం కూడా ఒక్కోసారి కుదరదు. ఏజెంట్లు మరింత ఎక్కువ మొత్తం చెల్లిస్తామని ఆశ చూపుతారు.

కొందరు ఇన్‌స్టాల్‌మెంట్ రూపంలో చిన్న మొత్తాల్లో కట్టండి.. బంగారాన్ని సొంతం చేసుకోండి.. అంటూ పేద, మధ్య తరగతి ప్రజలకు మాయ మాటలు చెప్పి ఆకర్షిస్తుంటారు. ఆ మధ్య ముంబైలో ఓ జ్యువెలరీ షాప్‌ డిపాజిట్ స్కీం పేరుతో ఏకంగా రూ.300 కోట్లకు టోకరా వేసింది.

జయేశ్ రసిక్‌లాల్ షా , నీలేశ్ రసిక్‌లాల్ షా బ్రదర్స్ కలిసి.. ఘట్కేపర్ ప్రాంతంలో రసిక్‌లాల్ సంకల్‌ చంద్ జ్యువెలరీ పేరిట షోరూం తెరిచారు.   కొంచెం .. కొంచెంగా డబ్బు డిపాజిట్ చేస్తే.. ఒకేసారి భారీ మొత్తంలో బంగారం ఇస్తామంటూ జనాలకు మాయ కబుర్లు చెప్పారు.  ఈ ప్రచారానికి కొన్ని వందల మంది బుట్టలో పడ్డారు. రూ.300 కోట్ల డిపాజిట్లు కలెక్ట్ చేశారు.

కొద్దీ రోజుల తర్వాత డిపాజిటర్లు బంగారం తీసుకుందామని షాప్ దగ్గరకు వస్తే అక్కడ షాప్ లేదు.దీంతో మోసపోయిన పెట్టుబడిదారులు లబోదిబో అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇది పొంజీ స్కీం మోసం కావడంతో ముంబై ఎకనమిక్ అఫెన్స్ వింగ్ పోలీసులు రంగంలోకి దిగి రసిక్‌లాల్ బ్రదర్స్‌ని అరెస్టు చేశారు. ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు కొంత తగ్గాయి. కానీ అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!