ఎవరి కెరుకర ఈశ్వరా?

Sharing is Caring...

పాట ఆహ్లాదం అందించాలి. పాట ఆలోచనని రేకెత్తించాలి. పాట మనుసులను తాకాలి. పాట మనుషులను తట్టి లేపాలి. పాట పనిలో నుండి పుట్టింది అని ఒక కవి అంటాడు. శవాన్ని మోసుకెళ్లే దాన్ని “పాడే” అని అనడం వెనుక కూడా పాట ఉండి ఉండవచ్చు అంటాడు ఆ కవి. అంటే మనిషి పుట్టుక నుండి చావు వరకు పాట ఉంటుంది అని కవి భావం. మనిషి జీవితంలో సుఖం,దుఃఖం ఉన్నట్టే వాటిని వ్యక్తికరించే విధానాలు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా శ్రమ జీవికి జీవితంలో పాట ఒక భాగం. శ్రమైక జీవన సౌందర్యానికి  సొబగులు అద్దేది పాట. శోభను తెచ్చేది పాట. అలాంటి పాటకు ఎంతో శక్తి ఉంది. ఎన్నో ఆశయాలు ఉన్నాయి. అలాంటి పాటల్లో ఈ మధ్యన యూట్యూబ్ లో రిలీజ్ అయిన. ఒక పాట గురించి తెలుసుకుందాం. “ఎవరికెరుకర ఈశ్వరా” ఈ పాటని వంశీ కృష్ణ  చాలా బాగా రాసారు.

ఈ పాట లో పల్లవి లోనే కవి భావన  ప్రేక్షకుడిని తాకుతుంది. మానవ సంబంధాలన్నీ చిన్నాభిన్నం అయిపోయి .. ఆర్థిక సంబంధాలు మాత్రమే మిగిలిన  ప్రస్తుత సమాజం లో క్షణాల్లో మనసులు మార్చుకునే మనుషుల్లో .. నమ్మకస్తులు ఎవరు, మోసగాళ్లు ఎవరు అని ప్రశ్న వేస్తాడు. తల్లి తండ్రులను వృద్ధాశ్రమాలకు పంపే బిడ్డలకి,కన్నవారి ప్రేమ అర్ధం అయ్యే అవకాశం ఎప్పటికి వస్తుందని ఈశ్వరుణ్ణి అడుగుతాడు.

కాయ కష్టంతో  బ్రతికే శ్రమ జీవి జీవితం ధర్మమా? వ్యాపారంతో,మోసంతో బ్రతికే వ్యక్తి జీవితం ధర్మమైనదా. అసలు ఈ ధర్మాధర్మాలను ఎవరు నిర్ణయించాలి అని ప్రశ్నిస్తాడు. అన్ని మతాల సారాంశం ఒక్కటే అయినప్పుడు.. ఆయా మతం పుట్టినప్పుడు మన ఉనికే లేనప్పుడు నాది ఈ మతమే అని, నా మతమే గొప్పదని ఎలా వాదిస్తారు .. అసలు యే మతం ఎవరిదో ఎవరు చెప్పారంట అని అడుగుతాడు.

మరొకచోట కనీసం కూడు, గూడు,గుడ్డకు కూడా నోచుకోని ఈ దుర్భర జీవితాన్ని గడపడానికి మాకెందుకు ఈ జన్మ ఇచ్చావు అని నిర్భాగ్యుల తరపున ఆ పరమేశ్వరుణ్ణి ప్రశ్నిస్తాడు. అలాగే యే క్షణాన యే విధంగా ముగిసిపోతుందో తెలియని జీవితం మీద ఇన్ని రకాలుగా ఆశలు పెంచుకుంటారే ..జనం ఎంత పిచ్చివాళ్ళు అని అంటాడు కవి. ఆ తర్వాత చరణాల్లో శోకమూ హర్షమూ గురించి.. చావు పుట్టుక లు గురించి… పాపం పుణ్యాలు గురించి తనదైన విశ్లేషణ చేసాడు.

“ఈశ్వరా” అని మకుటం తో సాగే ఈ పాట లో.. ప్రతి చరణంలో ఒక ప్రశ్న ఉంటుంది. ఇక సంగీతం విషయానికి వస్తే 1940 ఒక గ్రామం, సొంతఊరు లాంటి అవార్డు చిత్రాలకు సంగీతం అందించిన సంగీత దర్శకుడు “సాకేత్ సాయిరాం” చాలా చక్కని భాణీ ఇచ్చారు. అలాగే  శరత్  కూడా అద్భుతంగా పాడారు.

ఇక పాటలో  వివిధ పాత్రల్లో నటించిన నటి నటుల్లో ప్రతీ ఒక్కరు చాలా చక్కగా చేసారు. ఇక చిత్రీకరణ పరంగా కూడా అందమైన ప్రదేశాల్లో మంచి కెమెరా సాంకేతికతో పాట సాహితీ విలువలకు తగ్గ రూపకల్పనతో అందంగా చిత్రికరించారు.  ఈ విషయం లో దర్శకుడు సంతోష్ కుమార్ .. కెమెరా .. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించిన బాలెందర్ కృషి మెచ్చుకోదగినది. అలాగే కొండపాక గ్రామం వారు అందించిన ప్రోత్సాహం చాలా గొప్పది అని దర్శకుడు అంటున్నారు. 

యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన కొన్ని గంటలలోనే వేల మంది ప్రశంసలు పొందిన ఈ పాట చూసిన ప్రతీ ఒక్కరికి ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తూ మానవ జీవితం ఏమిటి అని చర్చిస్తుంది.  మీరు చూసి ఈ టీమ్ ను అభినందించండి. ఈ ఔత్సాహిక కళాకారుల ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయండి. 

pl. watch the vedeo ……………... ఎవరి కెరుకర ఈశ్వరా

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. RADHIKA September 23, 2021
error: Content is protected !!