రమణ కొంటికర్ల…………………………………………………….
ఆత్మలు ఆవహిస్తాయా…? దెయ్యం పడితే విడవదా…? భూత, ప్రేత, పిశాచాలు ప్రేలాపనలేం కాదా…? శాస్త్రీయంగా మానవుడెంత ఎదిగాడో.. ఇంకెంత అభ్యుదయవాదయ్యాడో.. అదే స్థాయిలో ఇంకా మనం.. కోలీవుడ్, టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఆత్మలావహించిన.. దెయ్యాలై భయపెట్టే సినిమాలనే ఎంజాయ్ చేస్తున్న రోజుల్లో… అదిగో ఆ కోవలోని మరో సినిమానే మళయాళంలోని.. “ది ప్రీస్ట్ “.
ఎన్నో దెయ్యాల సినిమాలు.. ఆత్మలావహించిన కథనాలు చూశాక.. ఇంకా కొత్తదనమేముందని మళయాళ ప్రీస్ట్ గురించింత చర్చ అంటారా..? హీరోల చుట్టూ కథలల్లే కల్చర్.. అందులోనూ మెగాస్టార్లో, పవర్ స్టార్లో, మెగా పవర్ స్టార్లో, సూపర్ స్టార్లో, రైజింగ్ స్టార్లో అయితే.. కథ సోసోగా ఉన్నా పర్లేదు..
విలన్ అనే దెయ్యాన్ని తన్ని తరిమేసే బలాఢ్యుడైన, అతీతశక్తైన దైవాంశసంభూతుడై.. మధ్యమధ్యలో ఓ ఇద్దరో, ముగ్గురో హీరోయిన్లతో.. ఆమధ్యలో వీలైతే ఓ వ్యాంపుతో స్టెప్పులేసి పాటలు పాడుకునే హీరోయిజాన్ని వీలైనంత దట్టించే విధంగా హీరో మాత్రమే ఫోకస్.. మిగిలినదంతా ఔట్ ఆఫ్ ఫోకస్ అన్నట్టుగా కథను చుట్టేయగల్గే సినిమాలను చూస్తున్న రోజుల్లో.. మరి అక్కడ.. సూపర్ స్టారైనా కథ డిమాండ్ మేరకు జీవించే సినిమా గురించి ఎందుకు చెప్పుకోకూడదు..?
మళయాళ సినిమా అంటే వాస్తవికత, సహజసిద్ధమైన శైలితో ప్రత్యేకతే కాదు.. సినిమాను క్యాన్వాస్ కు ఎక్కించే క్రమంలో ఆ కథను ప్రెజెంట్ చేసే విధానముంటుందే.. అదే అదుర్స్! అందుకే ది ప్రీస్ట్ కూడా ఆత్మ ఆవహించే కామన్ సబ్జెక్ట్ ఓరియెంటెడ్ సినిమానే అయినప్పటికీ మనం ముచ్చటించుకుంటున్నాం.
ప్రధానంగా మమ్ముట్టి వంటి ఓ స్టార్ హీరో చర్చ్ ఫాదర్ గా పోషించిన పాత్రకు.. మన టాలీవుడ్ హీరోలనెవ్వర్నడిగినా.. అబ్బే.. ఆ పాత్రా అనే వారు బహుశా?!! కానీ అదిగో అక్కడే మమ్ముట్టి ఆ పాత్రను చేయడానికి ఒప్పుకుని మొదటి విజయం సాధిస్తే.. కథ డిమాండ్ మేరకు.. పరిధి మేరకు తన పాత్ర నిడివిలో ఒదిగిపోయి.. మన టాలీవుడ్ హీరోల్లా సినిమా విజయమంటేనే తమ వల్ల అన్నట్టు కాకుండా..సినిమా విజయంలో తానూ ఓ పాత్రధారిని మాత్రమే అన్నట్లుగా నటించిన తీరే.. సామాన్యతలో అనన్య సామాన్యతని ఎందుకనిపించొద్దూ..?!!
అయితే ఓ అనాథ అమ్మాయిలో ఆత్మ ఆవహించి తన పగ తీర్చుకునే తీరు.. ఎక్కడో వరుస ఆత్మహత్యల దగ్గర మొదలై.. అవి హత్యలన్న అనుమానంతో ఇన్వెస్టిగేషన్.. కానీ సోదరిమీద పెంచుకున్న ప్రేమతో యాక్సిడెంట్ లో చనిపోయిన అక్క ఆత్మగా ఆవహించి.. తాను పగ పెంచుకున్నవారందరిపై ప్రతీకారం తీర్చుకోవడం కథలో ముఖ్య భాగం కాగా.. పిల్లల్ని ఇలాంటి సినిమాలకు ప్రోత్సహించడమా.. అప్పుడప్పుడే ఎదుగుతున్న యుక్త వయస్సు బాలికను సినిమా కోసం వాడి.. నేటి అభ్యుదయ యుగంలోనూ వారి దృష్టిని ఇటు మళ్లించడం సమంజసమా అనే కొన్ని ఆలోచనలు మాత్రం రేకెత్తుతాయి.
కానీ.. సినిమా అంటేనే ఎంటర్ టైన్ మెంట్.. మరీ అంత సీరియస్ గా యోచించే అంశమా అనీ కొట్టిపడేసేందుకూ అవకాశముంది! ఏదేమైతేనేం.. ఆత్మ ఆవహించిన అనాథ బాలిక పాత్రలో మోనిక నటన అదుర్స్!! మణిరత్నం అమృతలోని బాలనటిలా.. తనదైన శైలిని కనబర్చేందుకు మోనిక నూటికి నూరుపాళ్లూ యత్నించి సఫలీకృతమైంది.
ఇక మంజూవారియర్ ఈ సినిమాకు మరో ఎస్సెట్. కాగా.. మరో ప్రధాన పాత్రధారి నిఖిలా విమన్ కూడా తన పరిధిలో మెప్పించింది.మొత్తంగా జోఫిన్. టీ. చాకో అనే దర్శకుడు మన వర్మలాగా.. హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్సంటే.. అయితే అతి నిశ్శబ్దం..
అందులోంచి ఉన్నపళంగా పెళ్లుమనే శబ్దమనే మొనాటనీ సౌండ్ బేస్డ్ షోఆఫ్ కు భిన్నంగా.. ఓ సాధారణమైన కథనూ అద్భుతమైన స్క్రీన్ ప్లే, ఆసక్తికర కథనంతో రక్తి కట్టించిన తీరు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది.అందుకే భాష రాకున్నా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో.. అమెజాన్ ప్రైమ్ లో ఎంజాయ్ చేయగల్గే మ్యాజికల్ హార్రర్ మూవీ.. అలరించే ఆత్మ.. ” ది ప్రీస్ట్”.