An innovative invention………
ఒక మహిళా రైతు పూల రేకుల నుండి ఎనర్జీ డ్రింక్‌ని తయారు చేసి ప్రశంసలు పొందుతోంది. అంతే కాకుండా చిన్న పరిశ్రమ ఏర్పాటుచేసి పలువురు మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. మధ్యప్రదేశ్ కు చెందిన మధు థాకర్ అనే రైతు తన కుమార్తె అర్చన ను ఉన్నత చదువులు చదివించాడు. కామర్స్ లో గ్రాడ్యుయేషన్, పాలిటిక్స్ లో మాస్టర్స్ చేసిన అర్చన మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తుందని భావించాడు.
అయితే అర్చన మాత్రం తండ్రి బాటనే ఎంచుకుంది. వ్యవసాయంలోనే అద్భుతాలు చేయాలని సంకల్పించుకుంది. అయితే సాంప్రదాయ పద్ధతిలో కాకుండా ఆధునిక వ్యవసాయం చేపట్టింది. ఆమె తల్లి నిర్మలకు కూడా వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండటంతో కూతురికి సహాయ పడింది. ఆ ఇద్దరి కృషి ఫలితంగా బిటియా రోసెల్లె పువ్వుల నుంచి వచ్చే రసం ఎనర్జీ డ్రింక్ గా తయారైంది.
దేశంలో పూలను ఉపయోగించి తయారు అయ్యే తొలి ఎనర్జీ డ్రింక్ (Energy Drink from Flowers) గా గుర్తింపు పొందింది. అర్చన మొదలు పెట్టిన స్టార్టప్ ను మధ్య ప్రదేశ్ సర్కార్ కూడా గుర్తించింది.
వ్యవసాయంలో వినూత్న ఆవిష్కరణల అంశం పై జనవరి 8 నుంచి 12 వరకు ఇండోర్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ కి అర్చన కూడా ఎంపికయ్యారు.
కాగా ఐదేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన కంపెనీ ప్రతినిధులు హర్దాకి వచ్చారు. బిటియా రోసెల్లె పువ్వు గురించి వివరించి ఆ పువ్వులను పండించండి అని చెప్పి వాటి విత్తనాలను ఇచ్చి వెళ్లారు. అయితే ఆ విదేశీ పువ్వులు హర్దాలో పెరగలేదు. రెండేళ్లు నష్టాలు వచ్చాయి. అయినా అర్చన నిరాశ పడలేదు.
ఇంటర్నెట్ లో శోధించి వివిధ టెక్నిక్స్లో పొలాల్లో పనిచేయడం మొదలు పెట్టింది.
మూడో సంవత్సరంలో, పొలాలన్నీ ఎర్రటి పువ్వులతో నిండిపోయాయి. అంతలో కరోనా వచ్చి లాక్ డౌన్ మొదలైంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు పూలు పంపలేకపోయారు . ఆ పువ్వులతో ఇంకా ఏమి చేయవచ్చో పరిశోధించడంలోనే అర్చన ఎక్కువ సమయం గడిపింది. ఆ పూల రసం ఎనర్జీ డ్రింక్ లా కూడా పని చేస్తుందని తెలుసుకుంది.
దాంతో తల్లీ కూతుళ్లు ఆ పూల రసం తాగడం మొదలుపెట్టారు. పూల రసం తాగిన తర్వాత అర్చన తల్లికి షుగర్ నయమైంది. కరోనాలో ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఈ పువ్వు రసం ఉపయోగపడుతుందని వారికి అర్థమైంది. దాంతో పానీయం తయారు చేసి విక్రయించాలని నిర్ణయించుకున్నారు.
ఆ నిర్ణయం అర్చన జీవితాన్నికొత్త మలుపు తిప్పింది. స్టార్టప్ మొదలుపెట్టి గ్రామంలో మహిళలందరికీ కూడా ఉపాధి కల్పిస్తున్నారు. ఈ జ్యూస్ ని ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కూడా విక్రయిస్తున్నారు. సేజ్ జ్యూస్ (Sage Juice) ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంది. కేవలం ఆరు నెలల్లో రూ.7 లక్షలు సంపాదించానని అర్చన మీడియాకు వివరించారు.