ఏనుగు vs గాడిద …. ఎవరు గెలిచినా ఒకటే !

Sharing is Caring...

 

Goverdhan Gande

అమెరికా ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి .
ఈ ఎన్నికల్లో గాడిద గెలిచినా ? ఏనుగు గెలిచినా?మనకేమిటి?
అది అమెరికన్ల సొంత విషయం కదా.మనకేమిటి సంబందం?
ఓటర్లు అమెరికన్లు కదా. నిర్ణయించాల్సింది వారే కదా. అది అమెరికన్ల హక్కు కదా.అది వారి స్వేచ్ఛ.  
విచక్షణ లకు సంబంధించిన సంగతి కదా. మనకేమిటి ఆసక్తి? అమెరికా వెలుపలి ప్రపంచానికి ఎందుకంత కుతూహలం?

ఆత్రుత?భయం? ఈ ప్రశలన్నింటికీ జవాబు ఉన్నది.
ఆ జవాబు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు తెలుసు.
అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం.
బలమైన ఆర్థిక శక్తి , సాయుధ సంపత్తి గల దేశం.  
శాస్త్ర,సాంకేతిక వనరులు,ప్రపంచం నలుమూలలా విస్తరించిన బలమైన నిఘా వ్యవస్థ ఉన్నపెద్దన్న.
ఏ దేశపు ఆంతరంగిక విషయాల్లో నైనా జోక్యం చేసుకోగల సామర్థ్యo ఉన్న బలమైన శక్తి.

జోక్యం చేసుకునే హక్కు,అధికారం తనకు ఉందని భావించే అహంభావం అమెరికా సొంతం.
అందుకే మొత్తం ప్రపంచానికి అంత ఆసక్తి. ఎవడు గెలిస్తే మనకేమి నష్టం అని ఊరుకోరు .
ఏమి నష్టం కలిగిస్తాడోననే ఆందోళన పడుతుంటారు.
ఆ ఆందోళనే  ఈ ఎన్నికల గురించి ప్రపంచం మొత్తం ఆలోచించేలా చేస్తున్నది.
నిజానికి గాడిద గెలిచినా  ఏనుగు గెలిచినా అమెరికా విదేశీ నీతి, రీతి లో పెద్దగా వ్యత్యాసం ఉండదు.
కానీ ఒక ఆశ,ఆసక్తి . తక్కువ నష్టం కలిగించే వాడు గెలవాలని కోరుకోవడం ఈ ప్రశ్నల వెనక లక్ష్యం.

గత నాలుగేళ్లలో  ట్రంప్ దొరవారి శైలి నిర్వాకాలను ప్రపంచమంతా చూసింది కదాయుద్ధోన్మాదపు సరళి ఆయన సొంతం మరి.
యుద్ధం ఎవడు కోరుకుంటాడు? విస్తరణ, ఆక్రమణ, ఆధిపత్యపు కోరికలున్నవాడే కదా.
అలాంటి రీతి ట్రంప్ దొర వారి దగ్గర చూసాం కదా. మనుషుల మధ్య గీతలు గీసి,గోడలు కట్టే దొరవారు నైజం అర్థమైంది కదా.
ఓ నల్ల జాతీయుడిని నడి రోడ్డు పై చంపేసిన తెల్ల జాతి అహంకారాన్ని ప్రపంచమంతా గుడ్లప్పగించి చూసింది కదా.
ఆ దుర్మార్గాన్ని సమర్థించిన దొరవారి తీరును గమనించిన తరువాత కూడా మళ్లీ అలాంటి వాడు గెలవొద్దని కోరుకోవడం సహజం కదా.

అందుకే ఈ ఉపోద్ఘాతం/సోది అంతే. అందుకే అమెరికన్ ఓటరు విచక్షణ తో నిర్ణయం తీసుకోవాలని కోరుకుందాం.
అంతకు మించి మనం చేయగలిగింది ఏమీ లేదు.  మొత్తం ప్రపంచం ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాం.  
అదలావుంటే …..  ఈ సారి అమెరికా లో ఎన్నికల ప్రచార ఖర్చు ఏకంగా 1400 కోట్ల డాలర్లుకు పైగానే ఉండొచ్చని అంచనా.
గత ఎన్నికలతో పోలిస్తే ఇది రెట్టింపుకన్నా ఎక్కువ అని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే అత్యంత ఖరీదైన ఎన్నికలన్నమాట.
ఇప్పటివరకు డెమొక్రాట్లు 690 కోట్ల డాలర్లు ఖర్చు పెట్టారట. ఇక రిపబ్లికన్లు 380 కోట్ల డాలర్లు ఖర్చు పెట్టారని అంటున్నారు.
డెమొక్రాట్ అభ్యర్థి బైడెన్ 100 కోట్ల డాలర్లు విరాళాలు సమీకరించారట. ట్రంప్ కూడా దాదాపుగా అదే స్థాయిలో విరాళాలు సేకరించారు.

note ….  గాడిద (డెమొక్రాట్ -బైడెన్  ఎన్నికల గుర్తు ) ఏనుగు (రిపబ్లికన్-ట్రంప్ ఎన్నికల గుర్తు )

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!