ఆరు ఆస్కార్ అవార్డులు సాధించిన డ్యూన్ !

Sharing is Caring...

ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది డ్యూన్ సినిమా. సుమారు 10 విభాగాల్లో నామినేట్ అయిన ఈ సినిమా ఆరు అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ చిత్రంగా ఈ ఏడాది ఆస్కార్ గెలుపొందిన ‘కొడా’ని పక్కకి నెట్టి.. ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్,ప్రొడక్షన్ డిజైన్ ఇలా ఆరు చోట్ల తన సత్తా చాటి అందరి ప్రశంసలు అందుకుంది.

ప్రముఖ ఆంగ్ల రచయిత ఫ్రాంక్ హెర్బర్ట్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. డ్యూన్’ నవల 1965లో ప్రచురితమైంది. ఈ నవల పాఠకులను  ఎంతగానో ఆకట్టుకుంది.  రెండు సంపుటాలుగా విడుదలైన ఈ నవల మొదటి భాగం ఆధారంగా  ప్రముఖ దర్శకుడు డెన్ని విల్లెవ్ అద్భుతంగా తెరకెక్కించారు. తిమోతీ చలమెట్, రెబెక్కా ఫెర్గూసన్, ఆస్కార్ ఐజాక్,జోష్ జోలిన్ వంటి హాలీవుడ్ తారలు ఈ చిత్రంలో నటించారు. 

విశ్వంలోని రెండు వేర్వేరు గ్రహాల మధ్య నడిచిన కథ ఇది.  పాల్ అట్రేడెస్ (తిమోతీ చలమెట్) అనే ఓ తెలివైన కుర్రాడు ఉంటాడు. అతను పుట్టుకతోనే అసాధారణమైన ప్రతిభా పాటవాలు కలిగిన వ్యక్తి. పాల్ తన కుటుంబంతో పాటు సమస్త మానవాళి మనుగడ కోసం విశ్వంలోని అత్యంత ప్రమాదకరమైన ఎడారి గ్రహానికి ప్రయాణించాల్సి వస్తుంది.

ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏమిటి ? ఆ గ్రహం లోని దుష్టశక్తులతో పాల్ ఎలా  పోరాటం చేశాడు? అన్న ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన  ఈ సినిమా గతేడాది అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘డ్యూన్’ కథకు న్యాయం చేసేలా తెరకెక్కించారని  అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. 16.5 కోట్ల యూఎస్ డాలర్ల వ్యయం తో రూపుదిద్దుకున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం 40.05 కోట్ల యూఎస్ డాలర్లు వసూలు చేసింది. 

దర్శకుడు డెన్ని విల్లెవ్  పేరుపొందిన మంచి నటీనటులతో పాటు సత్తాగల టెక్నికల్ టీమ్ ని ఎంచుకుని  ‘డ్యూన్’ని  దృశ్య కావ్యంగా మలిచారు. కళ్లు చెదిరే గ్రాఫిక్స్ హంగులు, చూపుతిప్పుకోనివ్వని పోరాట ఘట్టాలతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విశేషమైన ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం ఈ ఏడాది 10 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లో నిలబడింది.

 ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’ చిత్రానికి అన్ని విభాగాల్లో  గట్టి పోటీ ఇచ్చింది. ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఒరిజినల్ స్కోర్, ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్, ఉత్తమ సౌండ్ అవార్డులు అందుకుంది.

ఉత్తమ చిత్రం, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్, ఉత్తమ మేకప్, హెయిర్ స్టైలిష్.. ఈ విభాగాల్లో అవార్డులను  మిస్ అయింది.  అన్నట్టు  డ్యూన్ పార్ట్ 2 కూడా తయారు కాబోతుంది.  ‘డ్యూన్’ నవలలోని రెండో భాగాన్ని ఆధారంగా చేసుకుని ‘డ్యూన్-2’ రూపొందించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!