Ready for for election war.……………………
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ముద్దుల కుమార్తె ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రం పక్కా ప్రణాళిక ప్రకారం జరగబోతోంది. కొన్నాళ్ల క్రితమే ప్రియాంక రాజకీయాల్లోకి వచ్చినా ఎన్నికల్లో పోటీ చేయలేదు. మొదటి సారిగా ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభ ఎన్నికల బరిలోకి ఆమె దిగబోతున్నారు.
ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. భారీ కసరత్తు చేసి సర్వశక్తులు ఒడ్డేందుకు సమాయత్తమౌతోంది. ప్రియాంక ఎన్నికల ప్రచారం .. పోల్ మేనేజ్మెంట్ నిర్వహణ కోసం స్పెషల్ 24 పేరిట ఒక టీమ్ ను పార్టీ ఏర్పాటు చేసింది. వీరు కాక వ్యూహకర్తలు .. రాజకీయ ప్రముఖులు. స్థానిక నేతలతో మరి కొన్ని బృందాలు పనిచేస్తాయి. ఎలాగైనా రాయబరేలీ ని మళ్ళీ గెలుచుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది.
కొంత కాలంగా తల్లి తరఫున ప్రియాంక నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రియాంక గాంధీ ఇప్పటివరకు ఏ చట్టసభ సభ్యురాలు కాదు. ఆమె లోక్‌సభ ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. రాజ్యసభకు కూడా నామినేట్ కాలేదు. యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రియాంకను పోటీ చేయమని పార్టీ వర్గాలు కోరాయి. అప్పట్లో అందుకు ఆమె సుముఖత చూపలేదు.
రాయ్‌బరేలీ, అమేథీ కాంగ్రెస్ కు పట్టున్న స్థానాలు. అయితే 2019లో అమేథీలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్ గాంధీ అక్కడ ఓటమి పాలయ్యారు. 2019 లోకసభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ ప్రజలు సోనియా గాంధీ వైపే మొగ్గు చూపారు. సోనియా గాంధీ గత కొంతకాలంగా ఆరోగ్యం బాగోలేక పోవడంతో నియోజకవర్గానికి తరచుగా వెళ్లలేకపోతున్నారు.
రాయబరేలీ జనరల్ కేటగిరీ పార్లమెంట్ స్థానం.ఈ నియోజకవర్గంలో రాయబరేలీ జిల్లా మొత్తం ఉండడటం విశేషం. ఈ నియోజకవర్గ పరిధిలో బచ్రావాన్ (SC) హర్‌చంద్‌పూర్,సరేని,ఉంచహర్, రాయబరేలీ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి నాలుగు నియోజక వర్గాల్లో సమాజవాది పార్టీ అభ్యర్థులు గెలవగా , రాయబరేలీలో మాత్రం బీజేపీ గెలిచింది. కనీసం ఒక్క సీటుకూడా కాంగ్రెస్ గెలవలేదు.
గతంలో ప్రియాంక నాయనమ్మ ఇందిరా గాంధీ కూడా ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆమె భర్త ఫిరోజ్ గాంధీ కూడా ఇక్కడ నుంచే ఎంపీ అయ్యారు. సోనియా గాంధీ 2004 నుంచి వరుసగా పోటీ చేసి గెలిచారు. అంతకుముందు ఇందిరా గాంధీ బంధువులు కూడా ఇక్కడ నుంచి గెలిచారు. ఇటీవల కాలంలో ప్రియాంక నానమ్మ ఇందిరను గుర్తుకు తెచ్చేలా హెయిర్ స్టైల్ మార్చేయడం విశేషం. ఇందిరా గాంధీ పోలికలు ప్రియాంక లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అదలా ఉంటే రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయమని వరుణ్ గాంధీని బీజేపీ నేతలు అడిగినట్టు సమాచారం.అయితే అందుకు వరుణ్ అంగీకరించలేదట.
———-KNM