రామప్పశిఖరం పై వాడిన ఇటుకలు ఎంత తేలికో తెలుసా ?

Sharing is Caring...

Aravind Arya Pakide ……………………………………………. 

రామప్ప ఆలయం మొత్తం రాతితో నిర్మాణం చేయడం వలన ఆలయ బరువు ఎక్కువగా ఉంటుందని భావించిన కాకతీయులు.. ఆనాడే ఈ బరువును తగ్గించాలని, లేకపోతే గుడికి కూలిపోతుందని గ్రహించారు. అలా పుట్టిందే ఈ తేలికపాటి ఇటుక ఆలోచన.. రామప్ప దేవాలయ విమాన శిఖరం పైన వాడిన ఇటుకలు ఎంత తేలిక అంటే ఆ ఇటుకను నీటిలో వేస్తే తేలేంతగా. 

మన చుట్టూ ఎన్నో ఇటుకలున్నాయి. కానీ వాటిలో వేటికి లేని గుణం రామప్ప గోపురాల్లో ఉండే ఇటుకలకు ఎలా వచ్చాయనేది ఆశ్చర్యం. దగ్గర్లో ఉన్న చెరువు లోని ప్రత్యేక రకమైన మట్టి , ఏనుగు పేడ, అడవి మొక్కల జిగురు,దాంతో పాటు పొట్టు, జనపనార ఊకపొట్టు, మరికొన్ని పదార్ధాలు కలిపి ఇటుకల్ని తయారు చేశారు కాకతీయులు.దాంతో గట్టితనం తగ్గకుండానే తేలికగా వుండే లక్షణాన్ని కలిగి ఉంటాయి.

సాధారణ ఇటుక సుమారు కిలో బరువు ఉంటుంది. కానీ కాకతీయులు ఆ కాలంలో తయారుచేసిన ఇటుక కేవలం 300 గ్రాములుంటుంది. ఈ ఇటుకలో సాంద్రత 0.9 ఉండటం, బరువు తేలికగా ఉండటంతో తేలిగ్గా నీటిలో తేలియాడే గుణం వచ్చింది. శాస్త్రీయంగా చెప్పాలంటే నీటి సాంద్రత 1gm/cc అయితే ఈ ఇటుకల సాంద్రత కేవలం 0.9gms/cc మాత్రమే అదే మనం సాధారణంగా ఇప్పుడు వాడే ఇటుకలు 2.2 గ్రామ్స్ /cc వుంటాయి.అంతే కాకుండా ఈ ఇటుకలకు స్పాంజిలో వున్నట్లు లోపలంతా బోలుతనం ఉంటుంది.ఈ పోరస్ నెస్ వలన కరిగించిన సున్నం బెల్లపు పాకం లాంటి వాటిని పీల్చుకుని దృఢంగా వాటిలోపల భద్రపరచుకోగలుగుతుంది.

అదలా ఉంటే కాకతీయుల కాలం నాటికి ముందే నీటిలో తేలే ఇటుకలు ఉన్నట్లు ఇటీవలి కాలంలో జరుపుతున్న పరిశోధనల్లో తెలుస్తోందని హరగోపాల్ సిరామోజు చెబుతున్నారు. శాతవాహనుల పాలనలో కొన్నాళ్ళు రాజధానిగా వున్న పైఠాన్ (ప్రతిష్టానం), జున్నార్, తుల్జాపూర్, గోలెగాంవ్, సావర్గాం లలో తేలే ఇటుకలు దొరికాయని పూనా దక్కన్ కాలేజి పరిశోధక విద్యార్థులు (2005 నుండి పురాతత్వపరిశోధనలు చేస్తున్నారు) తమ పరిశోధనా ఫలితాలతో నిరూపిస్తున్నారు. గోలెగాంవ్ లో వాననీటికి తేలి కొట్టుకుపోతున్న ఇటుకముక్కల్ని చూసి పరిశోధన ప్రారంభించారు. ఇటుకల వయస్సు కూడా శాతవాహనుల కాలమే( క్రీ.పూ. మూడో శతాబ్దం) నాటిదే . 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!