షేర్లలో మదుపు చేసి.. సైలెంట్ గా కూర్చోకూడదు!

Sharing is Caring...

షేర్లలో మదుపు చేసి సైలెంట్ గా కూర్చోకూడదు.. అవును నిజమే. చాలామంది ఈ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. మదుపు చేసిన షేర్ల తాలూకూ కంపెనీ వివరాలు తెలుసు కోవడానికి ఆసక్తి చూపరు. షేర్ల ధరల పెరుగుదలలో కంపెనీ పనితీరు ప్రధానం. పని తీరు అంచనా వేయడానికి కంపెనీ లాభనష్టాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ లాభ నష్టాలను కంపెనీ ప్రకటించే ఆర్ధిక ఫలితాల ద్వారా తెలుసుకోవచ్చు. 

ఇది కంపెనీలు ఆర్ధిక ఫలితాలు ప్రకటించే సీజన్. స్టాక్ మార్కెట్ లో లిస్టు అయిన ప్రతి కంపెనీ  ప్రతి మూడు నెలల కొక మారు తప్పనిసరిగా ఆర్ధిక ఫలితాలను ప్రకటించాలి. ఈ ఫలితాల ను బట్టే ఆ కంపెనీ ఎలా పనిచేస్తుందో మనకు తెలుస్తుంది.కంపెనీ అమ్మకాలు, ఆదాయం అలాగే నికర లాభం , వడ్డీ ఇతర ఖర్చులు ఏ స్థాయిలో ఉన్నాయో  తెలుస్తాయి.

ఆర్ధిక ఫలితాలను మనం చూసేటపుడు కంపెనీ ఆదాయం అమ్మకాల పైనే వస్తోందా ? ఇతరత్రా ఆస్తులను అమ్మి ఆదాయం గా చూపుతున్నారా ? అనే అంశాన్ని పరిశీలించాలి.ఫలితాలను ప్రకటించేటపుడు కొన్ని కంపెనీలు జిమ్మిక్కులు చేస్తుంటాయి. ఈ అంశాలన్నీ ఒకేసారి అర్ధం కావు.అనుభవం తో తెలుస్తుంటాయి. 

ప్రస్తుతం క్యూ 3 ఫలితాలు మొదలయ్యే సీజన్. క్యూ 3 అంటే (క్వార్టర్ 3) 3 వ త్రైమాసికం. జూలై లో క్యూ 1 ఫలితాలు , అక్టోబర్ లో క్యూ 2 ఫలితాలు , జనవరిలో క్యూ 3 ఫలితాలు , ఏప్రిల్ లో మొత్తం సంవత్సర ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఫలితాలను బట్టి కంపెనీ పని తీరును అంచనా వేయవచ్చు.దాన్ని బట్టే షేర్లను కొనుగోలు చేయడమో .. అమ్మడమో చేయాలి. ఇతర ఫండమెంటల్స్ గురించి తెలుసు కోకపోయినా ఫర్లేదు. కనీసం లాభనష్టాలు తెలుసుకోవాలి. 

స్టాక్ మార్కెట్ లో లాభాలు అర్జించాలంటే  ఒక వ్యూహం ప్రకారం అమ్మకాలు, కొనుగోళ్ళు నిర్వహించాలి. అయితే కేవలం అమ్మకాలు , కొనుగోళ్ళు కాకుండా ఇతర విషయాలపైన అవగాహన పెంచుకోవాలి. ఆర్ధిక ఫలితాలు, బుక్ క్లోజర్, రికార్డ్ డేటు, స్టాక్ స్ప్లిట్  తదితర అంశాలు గురించి తెలుసుకుంటే మంచిది. 

షేర్ల కు సంబంధించిన అన్ని అంశాల పైన  అవగాహన పెంచుకుంటేనే మార్కెట్ లో లబ్ది పొందగలం. లేక పోతే చిక్కులు ఎదుర్కోవాల్సి వుంటుంది.  ముఖ్యం గా ఆర్ధిక ఫలితాల గురించి తప్పనిసరిగా ఇన్వెస్టర్లు తెల్సుకోవాలి.మనం కొనుగోలు చేసిన షేర్ల తాలుకు కంపెనీ ఎలా పని చేస్తుందో తెలిస్తేనే ఆ షేర్ ను ఉంచుకోవాలో అమ్ముకోవాలో మనం నిర్ణయించుకోవచ్చు.

షేర్లను కొనుగోలు చేసి వాటి తాలుకు కంపెనీల పనితీరును పట్టించుకోక పోతే మన కష్టార్జితమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది .ఆర్ధిక ఫలితాలు బాగుంటే కొన్ని షేర్ల ధరలు పెరుగుతుంటాయి. అలాంటి  సందర్భం లో కూడా షేర్లను విక్రయించి లాభాలు పొందవచ్చు.

ఆర్ధిక ఫలితాలు అన్నిదిన పత్రికల్లో ప్రచురిత మౌతాయి.అలాగే  BSE , NSE వెబ్ సైట్ల లోను వుంటాయి. వాటిని చూసి తెలుసుకోవచ్చు.అలాగే వార్షిక ఫలితాలు ప్రకటించే సమయం లో కంపెనీలు వాటాదారులకు డివిడెండ్ కూడా ప్రకటిస్తాయి. దీర్ఘకాలం షేర్లను ఉంచుకునే ఇన్వెస్టర్లు వీటిని పొందే అవకాశం వుంటుంది. కాబట్టి వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. 

ఒక వేళ మనం కొనుగోలు చేసిన షేర్ల తాలుకు కంపెనీ ఆర్ధిక ఫలితాలు ప్రకటించడం లేదంటే  ఆ కంపెనీ ఉందా?మూత పడిందా? అని సందేహ పడాలి. దాని గురించి  తెల్సుకునే ప్రయత్నం చేయాలి. స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్ సైట్ లో దాని సమాచారం ఉందా?లేదా ?చూడాలి . షేర్లు ట్రేడ్ అవుతున్నాయా ? లేదా గమనించాలి.కంపెనీ నష్టాల్లో ఉన్నప్పటికీ  షేర్లు ట్రేడ్ అవుతాయి. అసలు షేర్లు కూడా ట్రేడ్ కావడం లేదంటే  పూర్తిగా సందేహించాలి.ఒక్కోసారి కంపెనీలు పనిచేస్తున్నా షేర్లు ట్రేడ్ కావు.కాబట్టి వాస్తవాలు తెలుసుకొని .. నిపుణుల సలహా తీసుకోవాలి.

—————– KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!