క్రికెటర్లపై సినిమాలు కోట్లు కురిపిస్తాయా ?

Sharing is Caring...

ప్రముఖ క్రికెటర్ల జీవితాలపై సినిమాలు వరుసగా రూపొందుతున్నాయి. బాలీవుడ్ నిర్మాతలు ఈ సినిమాలపై భారీగా ఖర్చు పెడుతున్నారు.తాజాగా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ జీవితం ఆధారంగా బయోపిక్ రాబోతున్నది. ఈ సినిమాను 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. ఇందులో గంగూలీ పాత్రను బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ పోషించవచ్చు అంటున్నారు. బయోపిక్ నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు గంగూలీ ప్రకటించారు. కానీ డైరెక్టర్ ఎవరు ? ఇతర వివరాలు గంగూలీ మరికొద్ది రోజుల్లో తెలియజేస్తానని అంటున్నారు. హిందీ భాషలో రూపొందే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

ఇప్పటివరకు మాజీ కెప్టెన్లు మహేంద్రసింగ్ ధోనీ, మహమ్మద్ అజహరుద్దీన్ పై బయోపిక్ లు వచ్చాయి. అజార్ బయోపిక్ 2016 లో విడుదలైంది. టోనీ డి సౌజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శోభా కపూర్, ఏక్తాకపూర్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇమ్రాన్ హష్మీ అజార్ పాత్ర పోషించారు. ఈ సినిమా బయోపిక్ తరహాలో లేదని .. కల్పిత ఘటనలు చొప్పించారనే విమర్శలు కూడా వచ్చాయి.  ఈ సినిమా బడ్జెట్ వ్యయం 38 కోట్లు కాగా నికర వసూళ్లు 33. 16 కోట్లు మాత్రమే. నిర్మాతలు ఆశించిన స్థాయిలో వసూళ్లు లేవు.

కాగా సచిన్ కేరీర్ ఆధారం గా “ఏ బిలియన్ డ్రీమ్స్” పేరిట డాక్యుమెంటరీ ఫిలిం వచ్చింది. ఇందులో సచిన్ నటించారు.ఇక ధోనీ పై తీసిన “ది అన్ టోల్డ్ స్టోరీ” సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో ధోనీ గా ఆమధ్య ఆత్మహత్యకు పాల్పడిన నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ నటించాడు. ఈ సినిమా నిర్మాణానికి 104 కోట్లు ఖర్చు కాగా వరల్డ్ వైడ్ గా 215 కోట్ల మేరకు వసూలు చేసింది. 61 దేశాలలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. నీరజ్ పాండే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2016 లో ఈ చిత్రం రిలీజ్ అయింది.

1983 ప్రపంచ కప్ విజయం ఆధారంగా నిర్మించిన కపిల్ దేవ్ లైఫ్ స్టోరీ  “83” సినిమా విడుదల కావాల్సి ఉన్నది. ఇందులో కపిల్ దేవ్ పాత్రను రణబీర్ సింగ్ పోషించారు. కపిల్ భార్య రోమి భాటియాగా  ప్రముఖ నటి దీపికా పదుకొనే నటించారు. పాన్ ఇండియా మూవీ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళ హక్కులను హీరో కమల్ హాసన్ .. తెలుగు హక్కులను హీరో నాగార్జున తీసుకున్నారు. కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను కూడా 100 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించారు. ఏ మేరకు నిర్మాతలకు లాభాలు అందిస్తుందో చూడాలి.

కాగా మహిళా క్రికెట్ స్టార్లు అయిన మిథాలీ,జులన్ బయోపిక్ లు కూడా రాబోతున్నాయి. మిథాలీ పాత్రను  ప్రముఖ నటి తాప్సి పోషిస్తున్నది. “శభాష్ మిథు” పేరిట ఈ సినిమా తీస్తున్నారు. మొన్నటి ఏప్రిల్లో కరోనా సెకండ్ వేవ్ ముందే ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. కరోనా కారణం గా మధ్యలో షూటింగ్ నిలిచి పోయింది. రాహుల్ దోలాకియా ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగారు.ఆయన స్థానంలో వచ్చిన  శ్రీజిత్ ముఖర్జీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

టీమ్ ఇండియా మహిళా జట్టు పేసర్ ఝులన్ గోస్వామి పై కూడా ఒక బయోపిక్ తీయబోతున్నారు. ఝులన్ పాత్రలో ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య ,నటి అనుష్క శర్మ నటించబోతున్నది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

————-KNM 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!