పక్షులకు అన్ని తెలివి తేటలా?

Sharing is Caring...

Pudota Showreelu……………..

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10,000 పక్షి జాతులు ఉన్నాయనీ ఒక అంచనా.పక్షులకు సంబంధిన విజ్ఞాన శాస్త్రాన్ని ఆర్నిధాలజి అంటారు. మన దేశంలో డాక్టర్ సలీం అలీ పక్షుల పై అనేక పరిశోధనలు చేసి,ఎన్నో విలువైన పుస్తకాలు రాశారు.  పద్మభూషణ్,పద్మ విభూషణ్ పురస్కారాలు పొందిన అయిన ఆయన్ని bird man of india అని పిలుస్తారు.

పక్షులలో అన్నిటి కన్నా పెద్దది నిప్పు కోడి అయితే అన్నిటి కన్నా చిన్నది హమ్మింగ్ బర్డ్.ఇది ముందుకి, వెనక్కీ గూడా ఎగరగలదు.ఇక 51 నిమిషాల ఈ డాక్యుమెంటరీ విషయానికొస్తే, హ్యు కార్డే దీనికి దర్శకత్వం వహించగా,స్టీఫెన్ ఫ్రై వ్యాఖ్యాత. దీనికి నేపథ్య సంగీతం అందించింది డేవిడ్ మిచం.. netflix లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో 2019 అక్టో బర్ లో విడుదలైనది.

మనుషులు నటిస్తూ వుండగా సినిమా తీయటం సులభం. అసలు పక్షుల ఫోటోలు తియటమే కష్టం అనుకుంటే ఇక వాటి జీవితాన్ని,డాన్స్ ని చిత్రీకరించటం,ఎంత కష్టమో కదా. మాటున వుండి,చాటుగా చిత్రీకరించటానికి వీళ్ళు ఎన్ని తిప్పలు పడ్డారో కదా. 

ఈ డాక్యుమెంటరీ లో తొమ్మిది రకాల మగ పక్షులు,ఆడ పక్షులను ఆకర్షించటానికి ఏవిధంగా డాన్స్ చేస్తాయో,గూడు కట్టడంలో తమ నిర్మాణ కౌశలాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తాయో, ఏ విధంగా రాగయుక్తంగా కూతలు కూస్తాయి, ఏ రకంగా వాటి రెక్కల అందాన్ని చూపిస్తాయి అనేదాన్ని చూపించారు.

ఈ అంశాల మీదనే ఆడపక్షి జత కట్టే విషయం ఆధార పడివుంది.. నిర్ణయాధికారం ఆడపక్షిదే మరి.ఈ డాక్యుమెంటరీ “ఎమ్మీ అవార్డ్(Emmy Award) సొంతం చేసుకుంది.ఈ డాక్యుమెంటరీ పక్షుల పారడైజ్ అనబడే న్యూ గినియా లోను,ఇంకా కొస్తారికా,బ్రెజిల్,అర్జెంటైన,అమెరికా,వెనిజులా అడవుల్లో చిత్రీకరించబడింది.అక్కడి అందమైన పక్షులనే గాక,అందమైన అడవిని,ప్రకృతిని గూడా ఈ డాక్యుమెంటరీ లో మనం చూడొచ్చు..

ఇక పక్షుల నృత్య వివరాలు చూద్దాం..
1. బ్లాక్ సికిల్బిల్ — ఈ పక్షి కొమ్మలు లేని ఎండి పోయిన మూడు,నాలుగు మీటర్ల ఎత్తున్న చెట్టు కాండంపై నిలబడి,పైకి, కిందకూ తలకిందులుగా దిగుతూ,ఎక్కుతూ సర్కస్ ఫీట్లు లాంటి డాన్స్ చేస్తుంది.నలుపు తెలుపు,బునుగు రంగు ఈకలు కలిగి అందంగా వుంటుంది. తన నల్లని ఈకలను తల పై భాగం మీదికి తెచ్చి,అచ్చం పాము పడగ లా విప్పి, నాగిన్ డాన్స్ లాంటి నృత్యం చేస్తుంది.మనకు శ్రీదేవి డాన్స్ గుర్తు వచ్చినా రావొచ్చు. ఈ డాన్స్ కు మైమరచిపోయి ఆడపక్షి దాని చెంతకు చేరుతుంది.

2. జ్వాల బోవర్ బర్డ్ — ఇది చాలా అందమైన నారింజ,పసుపు రంగు ఈకలు కల్గి,నల్లని తోకతో,పసుపు రంగు కనుగుడ్డు మధ్య నల్లని కనుపాప తో చూడ ముచ్చటగా ఉంటుంది. ఈ పక్షి.పేరుకి తగ్గట్టే గూడు ( bower) కట్టటం లో నైపుణ్యం ప్రదర్శించి,ఆడపక్షిని ఆకర్షిస్తుంది.యు ఆకారంలో (U) గూడు కడుతుంది.రెండు గోడలకు,కింద రంగురంగల పుల్లలు తెచ్చి అందంగా పేర్చుతుంది.కింద మెత్తగా వుండటం కోసం రంగురంగుల ఆకులు,పూలు,పండ్లు తెచ్చి పేరుస్తుంది.

అంతే కాదు మన నృత్య కళాకారులు నోటితో, చేతిలో దీపాలు పట్టుకుని డాన్స్ చేసినట్లే,ఇది గూడా నోటితో రకరకాల పండ్లు,పూలు పట్టుకుని,ఆడపక్షికి చూపిస్తూ,వివిధ నృత్య రీతులు ప్రదర్శిస్తూ,రమ్మని ఆహ్వానిస్తుంది. అచ్చం అబ్బాయి,అమ్మాయికి గులాబీ పువ్వు ఇస్తూ,రకరకాల పాట్లు పడినట్లే. దాని గూటి నిర్మాణ నైపుణ్యం,అది అమర్చిన పండ్లు,పూలు,దాని డాన్స్ చూసిన ఆడ పక్షి నెమ్మదిగా వచ్చి పక్కన చేరుతుంది.

3.పన్నెండు వైర్డుల పక్షి — దీన్ని పోల్ డాన్సర్ అనొచ్చు.ఇది నలుపు,పసుపు,వెల్వెట్ రంగుల ఈకలతో చూడ ముచ్చటగా ఉంటుంది. దీనికి తోక భాగంలో 12 సన్నటి,పొడవైన వైర్ల వంటి ఈకలు వుంటాయి.ఇది కొమ్మలు లేని పొడవైన చెట్ల కాండాలను చూసుకుని,తన అందమైన రెక్కలతో,చెట్టు పైకి, కిందకూ దిగుతూ పోల్ డాన్స్ చేస్తుంది.ముచ్చట పడ్డ ఆడపక్షి జత కడుతుంది..

4. మాన్ గ్రెగర్ బొవర్ బర్డ్ —- ఇది గూడా పేరుకి తగ్గట్టే అందమైన గూడు(bower) కట్టటం ద్వారా ఆడ పక్షిని ఆకర్షిస్తుంది..అడవిలో నేల మీద నుండి ఒక మీటరు ఎత్తులో పొడవైన టవర్ లాంటి గూడు కడుతుంది.అడవంతా తిరిగి తిరిగి,రంగురంగుల పుల్లలు ఏరు కొచ్చి,ఆ పుల్లలు సమానంగా వుండేటట్లు,ముక్కుతో విరిచి,గూటిని  పేరుస్తుంది..ఇంకా ఈ పుల్లల అంచులకు వేలాడే విధంగా అడవిలో ఎండిన రంగురంగుల ఆకులు, పువ్వులు,పండ్లు,బూజు,పీచు,నాచు లాంటివి తెచ్చి ఆ పుల్లలకు వేలాడ దీ స్తుంది.ఆ విధంగా గూటిని తీర్చి దిద్దుతుంది. 

అది చూడటానికి అచ్చం అలంకరించిన క్రిస్మస్ ట్రీ లాగా ఉంటుంది.ఇంత కష్టపడి కట్టిన గూటిని కొన్నిసార్లు అడవిపందులు ముట్టెతో తవ్వి నేల పాలు చేస్తాయి. అప్పుడీ పక్షి,చెట్టుకొమ్మ పై కూర్చుని అచ్చం కుక్క లాగా అరిచి,పందిని భయపెట్టి పార దోలుతుంది.ఇంకా ఇది అచ్చం మనుషులు మాట్లాడు కుంటున్నట్లు,చిన్నపిల్ల ఏడుస్తున్నట్టు,నీళ్ళు గలగలా పారుతున్నట్లు రకరకాల ధ్వన్యనుకరణ చేస్తుంది.

అందుకే ఈ పక్షిని”మిమిక్రీ బర్డ్”అనీ”Song of the Forest” అని పిలుస్తారు. ఇంత అందమైన గూటిని చూడటానికి వచ్చిన ఆడపక్షితో కాసేపు గూటి చుట్టూ తిప్పుతూ దాగుడుమూతల ఆట ఆడుతుంది.అంటే నన్ను చూడు,నా గూటిని చూడు,దాని అలంకరణ నీ చూడు అన్నట్లుగా చుట్టూ తిప్పుతుంది. దాని కష్టం వృధా పోలేదు. ఆడపక్షి మెచ్చి,కౌగిలి చేరింది.

5. సాక్సనీ బర్డ్ — దీన్ని మన పరిభాషలో రెండు జళ్ల సీత అనొచ్చునేమో..తలకి రెండు వైపులా చాలా పొడవైన అందమైన ఈకలు వుంటాయి.వాటితోనే చెట్టు కొమ్మపై కూర్చుని వూగుతూ, రకరకాల విన్యాసాలు చేస్తూ,ఆడపక్షిని పిలుస్తుంది.ఏదో ఒక రాగం(కూత) తీస్తూ,కొమ్మలపై వూగుతూ వుంటుంది.అందుకే దీన్ని *కింగ్ ఆఫ్ ది స్వింగ్స్*అంటారు. ఇలా ఆడ పక్షి ని అక్కున చేర్చు కుంటుంది.

6.కరోలా ఆఫ్ పరోటియా -దీని ఈకలు చాలా అందంగా వుంటాయి.రాగి రంగు,తెలుపు,నలుపు,ఆలివ్ గ్రీన్,బంగారు రంగు కలిగిన ఈకలతో చెట్ల కొమ్మలపై కూర్చుని, కూత కూస్తూ,డాన్స్ చేస్తూ,ఆడ పక్షిని పిలుస్తుంది.

7. గ్రేటర్ లోఫోరినా — పక్షులలో ఇంత తెలివైన పక్షి లేదేమో.? ఓహోహో దీని చేష్టలు,ఆడ దాని కోసం ఇది పడే తిప్పలు హా హాహః హ్హ ..అనిపిస్తాయి. 

పక్షుల బ్రహ్మ దీన్ని సృష్టించేటపుడు కాస్త తెలివి ఎక్కువ పాళ్ళ లో కలిపాడేమో. అచ్చం మన డాన్సర్స్ స్టేజి మీదకు వెళ్ళ బోయేముందు తమ అలంకరణను,రంగ స్థలాన్ని ఒకసారి చూసుకున్నట్లే ఇది గూడా.. ఆ దట్టమైన అడవుల్లో ఒక చెట్టు కింద సమతలమైన ప్రదేశాన్ని ఎన్నుకుంటుంది.ఆ ప్రదేశంలో ఉన్న ఆకులు,పుల్లలు ఏరి వేస్తుంది..చిన్నచిన్న గుంతలు వుంటే తన కాళ్ళతో కాస్త మట్టి నెట్టి పూడుస్తుంది .

ఇక డాన్స్ ఫ్లోర్ సిద్దం అయ్యాక,తన రెక్కల్ని ఒకసారి శుభ్రంగా విదిల్చి డాన్స్ చేయటం మొదలు బెడుతుంది..మొత్తం తొమ్మిది రకాల నృత్య రీతులు ప్రదర్శిస్తుంది.అవి మన దేశం పక్షులు కాకపోయినా,చూడటానికి అచ్చం భరత నాట్యం, కూచిపూడి,ఒడిస్సీ,కథక్,మనిపురి,డాన్స్ ల్లాగ అనిపిస్తుంది.చివరిలో వేసిన డాన్స్ అయితే అచ్చం మన కేరళ కథాకళి లాగే వుంది. ముందుకు,వెనక్కీ,గుండ్రంగా లయబద్దంగా ఇది చేసే డాన్స్ అద్భుతం..నీలం ఆకుపచ్చ,నలుపు,తలపై ఎర్రటి కిరీటం లాంటి ఈకలు కల్గి చాలా బాగుంటుంది.

ఇది దాని మానాన అది డాన్స్ చేస్తూ వుంటే,ఓర్వలేని అదే జాతి పక్షులు కొన్ని,ఆకులు తుంచి,రంగ స్థలం మీద వేసి,దాని డాన్స్ కి అంతరాయం కలిగిస్తాయి..అప్పుడది కోపంతో ఆ పక్షులను తరిమేసి,ఆకులు ఏరేసి,స్థలం శుభ్రం చేసుకుని డాన్స్ మొదలు పెడుతుంది..దానికి ముందు ఒక ఆకు తెచ్చి రంగ స్థలం హద్దు మీద వేసి,ఇది దాటి రండి చూసుకుందాం.అన్నట్లు సవాల్ విసురు తుంది. అచ్చం మనం బస్ లోనో,రైల్ లోనో తుండు గుడ్డ వేసి ఇది నాది అనిపించు కున్నట్లు.. దీని డాన్స్,రంగ స్థల నిర్మాణం చూసి,మెచ్చిన ఆడ పక్షి దీనికి సలాం అంటుంది..విచిత్రం కదా పక్షుల ప్రవర్తన.

8. గుయానన్ కాక్ ఆఫ్ ది రాక్ —- ప్రకాశ వంతమై న నారింజ రంగులో ఈకలు,తల మీద నారింజ రంగుకి నల్లటి అంచు వున్న కిరీటం లాగా ఉంటుంది.ఆ అందమైన నారింజ రంగులో నల్లటి కళ్ళు.. అహా. అహహ పక్షుల బ్రహ్మ పక్షి లోకంలోని అందమంతా దీనికే పెట్టాడేమో అనిపిస్తుంది.మరి అంత అద్భుతం వీటి అందం.ఇవి నాలుగైదు మగ పక్షులు కలిసి కుప్పి గంతులు వేసినట్లుగా గ్రూప్ డాన్స్ చేస్తాయి.వీటిలో నచ్చిన దాన్ని ఆడ పక్షి ఎన్నుకుంటుంది.

9. లాన్స్ టైల్డ్ మనకిన్ — ఆలివ్ గ్రీన్ కల్గి,తల మీద ఎర్రటి టోపీ లాంటి కిరీటం కల్గి ఉంటుంది.దీని డాన్స్ కో ప్రత్యేకత వుంది.రెండు మగ పక్షులు నిట్టనిలువుగా రెండు మీటర్ల ఎత్తులో ఎగురుతూ,రకరకాల భంగిమల్లో డాన్స్ చేస్తూ, కూతలు కూస్తు వుంటాయి. రెండింటి లో తనకు నచ్చినదాన్ని ఆడపక్షి ఎన్నుకుని జత కడుతుంది. ఈ పక్షులలో కొన్నిటికి రాజుల, రాణుల,ప్రముఖుల పేర్లు వున్నాయి సుమా.

అసలీ వ్యాసం రాయాలా.. వద్దా ..? అని అనుకున్నా..కానీ రాసే వరకూ నన్నొదల కుండా,నాకు వూపిరి ఆడ నివ్వకుం డా, ఈ పక్షులు నా చుట్టూ చేరి డాన్స్ చేయటం మొదలు పెట్టాయి. ఇక ఆ పక్షుల్ని అక్షరాల్లో దించాక అప్పుడు శాంతించాయి మరి. నేను పక్షి ప్రేమికురాలిని(bird lover) వీక్షకురాలిని(bird watcher) అందుకే నా కతల్లో కాకమ్మలు,పిచుకమ్మలు ప్రధాన పాత్ర పోషిస్తూ వుంటాయి.అదే ఈ డాక్యుమెంటరీ పరిచయానికి కారణం.   netflix లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ డాక్యుమెంటరీ ఫిలిం ఉంది చూడండి. 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!