అదృశ్యమవుతున్న హిమానీ నదాలు !

Sharing is Caring...

climate change …………………….

ప్రపంచంలో దాదాపు 198,000 నుండి 200,000 హిమానీనదాలు ఉన్నాయి.ఈ హిమానీ నదాలు 726,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి.ఈ హిమానీ నదాలన్నీ కరిగిపోతే సముద్ర మట్టాలు దాదాపు 1.6 అడుగుల మేర పెరుగుతాయని అంచనా . 

హిమానీ నదాలు అంటే ఘనీభవించిన నదులు.ఎక్కువగా శీతల ప్రాంతాలలో హిమానీ నదాలు ఏర్పడతాయి. ఎత్తుగా ఉన్న పర్వతాల దగ్గర వాతావరణ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. భారతదేశంలో 16,627 హిమానీనదాలు ఉన్నాయి. 

ఈ హిమానీ నదాలు శాస్త్రవేత్తలు అంచనా వేసిన దానికంటే వేగంగా తగ్గిపోతున్నాయి. కరిగి పోతున్నాయి… కనుమరుగవుతున్నాయి. భూమి పై ఉన్న సగం హిమానీనదాలు, ముఖ్యంగా చిన్నవి ఈ శతాబ్దం చివరి నాటికి కనుమరుగవుతాయి.

ప్రస్తుత వాతావరణ మార్పుల పోకడలను మార్చకుండా వదిలేస్తే ఆ సంఖ్య 80 శాతం  పైగా పెరుగుతుంది. ఒక కొత్త అధ్యయనం ప్రకారం భూగోళానికి పెను ముప్పు అనుకున్న దానికంటే ముందు గానే ముంచుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ శతాబ్దం అంతానికి  భూమిపై ఉన్న ప్రతి ఐదు హిమానీ నదాల్లో నాలుగు, అంటే ఏకంగా 80 శాతం నామరూపాల్లేకుండా పోతాయని ఆ అధ్యయనం చెబుతోంది.  గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో కొన్ని  ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ  2100 కల్లా కనీసం 25 నుంచి 41 శాతం  హిమానీ సంపద హరించుకుపోతుందని అంచనా వేసింది.

హిమానీ నదాల అదృశ్యం నీటి వనరులపై కూడా ప్రభావం చూపుతుంది ఎందుకంటే అవి దాదాపు రెండు బిలియన్ల ప్రజలకు మంచినీటిని అందిస్తాయి.’సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగే పక్షంలో మధ్య యూరప్, పశ్చిమ కెనడా, అమెరికాల్లోని చిన్నపాటి హిమానీ నదాలు తీవ్ర ప్రభావానికి లోనవుతాయి. 3 డిగ్రీలు పెరిగితే మొత్తానికే మాయమవుతాయి’ అని అధ్యయనం అంటోంది.

ఈ స్టడీ కి అమెరికాలోని కార్నెగీ మెలన్ వర్సిటీ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డేవిడ్ డౌన్స్ సారధ్యం వహించారు.  ‘కర్బన ఉద్గారాలకు ఇప్పటికిప్పుడు పూర్తిగా అడ్డుకట్ట వేయగలిగినా పెద్దగా లాభముండదు.

ఇప్పటిదాకా వెలువడ్డ ఉద్గారాలు తదితరాలు హిమానీ నదాలపై చూపే దుష్ప్రభావాన్ని అడ్డుకోలేం. ఇది నిజంగా ఆందోళనకరమైన విషయం’ డేవిడ్ డౌన్స్ చెబుతున్నారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!