ఇక ఆన్ లైన్ మీడియాకు కష్ట కాలమే!

Sharing is Caring...

యూ ట్యూబ్ చానెళ్లు, వెబ్సైట్ల కు కష్ట కాలం మొదలు అయినట్టే. ఇక స్వేచ్ఛగా ప్రభుత్వవ్యతిరేక కథనాలను ప్రచురించడం అంత సులభం కాదు. అలా చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది.  ప్రధానంగా వెబ్సైట్లు , యూట్యూబ్ ఛానళ్ల ను  నియంత్రించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నది. ఇకపై ఇష్టానుసారం రాయడం .. వీడియోలు అప్ లోడ్ చేయడం కష్టమే. ఇందుకు సంబంధించి నూతన మార్గదర్శక సూత్రాలను కేంద్రం తయారు చేస్తోంది. రెండురోజుల క్రితం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం పై చర్చ జరిగింది. డిజిటల్ న్యూసు, ఆన్లైన్ కంటెంట్ పై నిఘా పెడుతున్నారు. ఈ నిఘా ఇప్పటికే మొదలయింది.

అయితే నియంత్రణ ఎలా ఉంటుంది ? ఏమైనా మార్గదర్శక సూత్రాలు ఉంటాయా ? ఏదైనా ప్రత్యేక సంస్థను దీని కోసం ఏర్పాటు చేస్తారా ? అన్న వివరాలు ఇంకా బయటికి రాలేదు. కొన్ని ఛానళ్ల లో , పోర్టల్స్ లో విశృంఖల వార్తాకథనాలు వస్తున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకునే ఈ రకమైన నిఘా పెడుతున్నారు. ప్రభుత్వ తాజానిర్ణయం మూలంగా  కంటెంట్ రచయితలు , వెబ్సైట్ల జర్నలిస్టులు ఇబ్బందుల్లో  పడతారు.  ప్రభుత్వ నిర్ణయాలను ధైర్యంగా విమర్శించలేరు. రచయిత, జర్నలిస్టుల స్వేచ్ఛ పరిమితమౌతుంది.

రాజ్యాంగం హామీ నిచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛ కు లోబడే నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.కానీ ప్రభుత్వ తీరుతెన్నులను పరిశీలించే వారికి మాత్రం కొన్ని అనుమానాలు పీడిస్తున్నాయి. పత్రికల నియంత్రణకు స్వతంత్ర ప్రెస్ కౌన్సిల్ పనిచేస్తున్నది. ఎలెక్ట్రానిక్ మీడియా కు కూడా ఓ సంస్థ పనిచేస్తున్నది. మెజారిటీ పత్రికలు,టీవీ లు ఎలా పనిచేస్తున్నాయో ప్రజలకు ఇప్పటికే బాగా అర్ధమైపోయింది.విశ్వనీయత కోల్పోయిన ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి పాఠకులు,వీక్షకులు డిజిటల్ మీడియా కు బాగా ఆకర్షితులైపోయారు.

ఆన్ లైన్ మీడియాలో కొన్ని సంస్థలు మాత్రమే నిఖార్సైన కథనాలను ఇస్తున్నాయి. ఇక మిగతా మీడియా వాస్తవికమైన సమాచారం తో పాటు అబద్ధాలు,అభూత కల్పనలు,యువతను తప్పుదోవ పట్టించగల బూతు సాహిత్యాన్ని కూడా ప్రచారం,ప్రసారం చేస్తున్నాయి.అయితే వీటిని కట్టడి చేయడానికి ప్రభుత్వ నియంత్రణ కాకుండా స్వతంత్ర/స్వీయ నియంత్రణా వ్యవస్థ నెలకొల్పడం భావ ప్రకటనా స్వేచ్ఛ పరిధిలో ఉంటుంది.అలాకాకుండా నియంత్రణ పేరిట ఆంక్షలు విధించే అవకాశమే ఎక్కువ గా కనిపిస్తున్నది.అదే నిజరూపు దాల్చితే ప్రజల సమాచార స్వేచ్ఛకు అడ్డుగోడ కట్టినట్లే ,ఆ సమాచారాన్ని ఈ వేదికల ద్వారా తెలిపే గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లే నని భావించాలి.ఈ తరహా నియంత్రణ  వల్ల చెత్త అంతా వదులుతుంది. అయితే సహేతుకంగా రాసే వారిపై కూడా నియంత్రణ విధిస్తే అది మీడియా గొంతు నొక్కినట్టే అవుతుంది. ఏమి జరుగుతుందో వేచి చూస్తే కానీ తెలియదు.

——- Goverdhan Gande

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!