రెడ్డి గారిలో భిన్నకోణాలు !!

Sharing is Caring...

రాజకీయాలపై కొంచెం అవగాహన ఉన్నవారికి చల్లా రామ కృష్ణారెడ్డి గారి పేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలామందికి ఆయన రాజకీయ కోణమే తెలుసు.ఆయనలో ప్రజలకు తెలియని మరెన్నో కోణాలు ఉన్నాయి.  వాటి గురించే ఈ కథనం. కొద్దీ రోజుల క్రితమే ఆయన కరోనా తో కన్నుమూసారు ..  అపుడు ఈ ఆర్టికల్ చదివి ఫోన్ చేసి మాట్లాడారు .

——— 
ఒక  పత్రికలో రిపోర్టర్ గా చేస్తున్న(2003) రోజులవి. అపుడు వనస్థలిపురం లో ఉండేవాళ్ళం. ఒకరోజు ఇంటికి రాగానే మా ఆవిడ బాంబ్ పేల్చింది. ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి ఫోన్ చేశారు. ఇందులో ఉన్న  నంబర్కి కాల్ చేయమన్నారని స్లిప్ ఇచ్చింది.  చల్లా గారా ? ఆయన ఎందుకు  ఫోన్ చేసారో అర్ధంకాలేదు. అప్పటికే ఆయనపై ఉన్న పలు ప్రచారాల గురించి విన్నాను.

గుండెలో ఏదో మూల చిన్న వణుకు మొదలయింది.  ఆయన పై వార్తలు ఏమి రాయలేదే అనుకున్నా మనసులో. “రాగానే ఫోన్ చేయమన్నారు ” మళ్ళీ మా ఆవిడ చెప్పింది. “ఆయన పెద్ద ఫ్యాక్షనిస్ట్ అట కదా”. కాఫీ ఇస్తూ అడిగింది.  ఏ వార్తలు రాసి ఏ సమస్యలు కొంప మీదకు తెస్తానో  అని ఆవిడ భయం.

మా మావయ్య కూడా ఏదో పని మీద వచ్చిఆ రోజు అక్కడే ఉన్నారు. ఆయన కూడా అందుకున్నాడు. ” ఆయన గురించి నెగటివ్ వార్తలు  ఏమైనా రాశావా ?”  అంటూ.  ” ఏం రాయలేదులే.  మీరు కంగారు పడి, నన్ను కంగారు పెట్టకండి” అన్నాను.   నేను నిజం చెప్పినా వాళ్ళు అంత త్వరగా నమ్మరు.  నా తెంపరితనం గురించి ఇద్దరికీ బాగా తెలుసు. 

అపుడు సెల్ ఫోన్లు పూర్తి స్థాయిలో వాడకంలోకి రాలేదు. నాకు ల్యాండ్ లైన్ ఉండేది. వెంటనే చల్లా గారికి ఫోన్ చేసాను. ఆయనే ఫోన్ ఎత్తారు.  ఫలానా అని చెప్పాను. “మూర్తి …. ముందుగా నీకు అభినందనలు అబ్బా ” అన్నాడాయన. ఆశ్చర్యబోయాను. “దేనికి సార్ “అడిగేను.   “ఆంధ్రభూమిలో నువ్వు రాస్తున్న బిజినెస్ పేజీ ఆర్టికల్స్ , షేర్ రెకమండేషన్స్ అన్ని చూస్తున్నా.సూపర్ ”  అన్నారు.

ఆ మాట వినగానే టెన్షన్ కొంచెం తగ్గింది.  నేను 1997 నుంచి 2009 వరకు ఆంధ్రభూమిలో బిజినెస్ పేజీకి రెగ్యులర్ గా రాస్తుండేవాడిని. అప్పట్లో బిజినెస్ పేజీ మిత్రుడు వాసిరెడ్డి వేణుగోపాల్,మరొకతను చూస్తుండేవారు. “నీతో మాట్లాడాలి ..రేపు రాజభవన్ పక్కనున్న గెస్ట్ హౌస్ కొచ్చేయి .. వచ్చే ముందు ఫోన్ చేయి ” అన్నారు. 

జరిగిన సంభాషణ ఇంట్లో చెప్పిన తర్వాత మా వాళ్ళ కు టెన్షన్ తగ్గి  రిలాక్స్ అయ్యారు. నాకు టెన్షన్ తగ్గింది గాని ఆయన ఎందుకు రమ్మన్నాడు ?అనేది అర్ధంకాక రకరకాల ఆలోచనలతో బుర్ర ఖరాబుఅయ్యింది. సర్లే …  ఏమైనా తేడా వస్తే పెద్దాయన ( వైఎస్ ) దగ్గరకెళ్ళి చెబుదాంలే అనుకున్నా.

మర్నాడు ఫోన్ చేసి గెస్ట్ హౌస్ కెళ్ళా. బయట ఉన్న గన్ మెన్ కి చెప్పా. లోపలికెళ్ళేసరికి ఎదురుగా రెడ్డిగారు కుర్చీలో కూర్చుని ఉన్నారు. వైట్ ప్యాంట్ .. టీ షర్ట్ వేసుకున్నారు. కుశల ప్రశ్నలు, కాఫీ మర్యాదలు  అయ్యాక అసలు సంగతి మొదలెట్టారు. 

“నువ్వు రికమండ్ చేసిన చాలా షేర్లు లాభాలలో నడుస్తున్నాయి. నువ్వు ఏ ఆధారంగా సిఫారసు చేస్తున్నావో  చెప్పు” అన్నారు. నేను అంచనా వేసే విధానం గురించి చెప్పాను. “ఇంత సింపుల్ మెథడా ?”అన్నారు. “మెథడ్స్ ఇంకా చాలా ఉన్నాయి’ అన్నాను … “సరే లోపలికి వెళ్దాం రా” అంటూ వేరే గదిలోకి తీసుకువెళ్లారు.

అది ఆయన పర్సనల్ రూమ్. లోపల టేబుల్ పైన లాప్ టాప్ … పక్కనే షేర్ మార్కెట్ చార్ట్ లు , రకరకాల బిజినెస్ మ్యాగజైన్స్ కనిపించాయి.అపుడు అర్ధమైంది… ఈయన మార్కెట్ మధనంలో పడ్డారు అని. “నాకు ది బెస్ట్ షేర్ రికమెండేషన్స్ కావాలి …లాంగ్ టర్మ్ ను దృష్టిలో ఉంచుకుని నువ్వే చెప్పాలి” అన్నారు.

ఆ మాట వినగానే పక్కనే బాంబ్ పేలినట్టు అనిపించింది. రకరకాల కారణాల దృష్ట్యా ఒక్కోసారి రికమెండేషన్స్ ఫెయిల్ అవుతుంటాయి . పెరుగుతుందని అనుకున్న షేర్ ధర దారుణంగా పడిపోవచ్చు.మన రికమెండేషన్స్ తో  అలాంటి పరిస్థితి వస్తే ?  అసలే ఆయనను చూస్తే చండశాసనుడిలా కనిపిస్తారు. భయంతో హడలిపోయా.”ఏమిటి ఆలోచనలో పడ్డావ్” అన్నారు … మనసులో మెదిలిన సందేహాన్ని ఆయనకే వివరించాను. 

“షేర్ ధరల పెరుగుదల … తగ్గుదల తో నీకు సంబంధం లేదు .. జస్ట్ రికమెండ్ చేయి .. చాలు”  అన్నాడు. “మీరు ఆ భరోసా ఇస్తే అభ్యంతరం లేదు” అన్నాను.  అప్పటినుంచి కొన్ని వారాల పాటు ఆయనకు షేర్స్ రికమెండ్ చేసాను. ఆయన ఎన్నిషేర్లు  కొన్నారో ? ఏమేరకు లాభాలు ఆర్జించారో? నాకైతే తేలీదు.అయితే జనాలు చెప్పుకునే విధంగా ఆయన ప్రవర్తన లేదు.

చాలా  హుందాగానే వ్యవహరించేవారు. ఈ లోగా ఎన్నికలు రావడం ఆయన బిజీ కావడం … నేను నా రిపోర్టింగ్ పనుల్లో తలమునకలు కావడంతో మళ్ళీ రెడ్డిగారిని కలవలేదు. వైఎస్ అధికారంలోకొచ్చాక ఒకటి రెండు సార్లు కలిసాం. ఇక ఈ మధ్య కాలంలో కలవలేదు.రెడ్డిగారిలో చాలామందికి తెలియని కోణం ఇది. జనరల్ గా పొలిటికల్ లీడర్లలో మార్కెట్ ను  డీప్ స్టడీ చేసి షేర్లు కొనేవారు ఉండరు.కానీ ఆయన సీరియస్ గా స్టాక్ మార్కెట్ ను స్టడీ చేయడం గొప్ప విషయం.

ఇక చల్లా రామకృష్ణారెడ్డి గారు కవితా ప్రియుడు కూడా. వార్త ఆదివారం అనుబంధంలో కొన్ని వారాల పాటు కవితలు కూడా రాశారు.వాటికి ఇపుడు సాక్షిలో చేస్తున్న ఆర్టిస్ట్ శంకర్ అప్పట్లో బొమ్మలు కూడా గీశారు.

అన్నట్టు రెడ్డిగారిలో మంచి నటుడు కూడా ఉన్నారు. 1986 లో జంధ్యాల దర్శకత్వంలో తానే హీరోగా ” సత్యాగ్రహం ” అనే సినిమాకూడా తీశారు. అయితే  అది ఆశించినంతగా ఆడలేదు. మరో సినిమా తీసేందుకు ప్రయత్నించారు కానీ అది పూర్తి కాలేదు.

ఒక వైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే … షేర్ మార్కెట్ పట్ల ఆసక్తి … కవిత్వం పట్ల అనురక్తి ..సినిమాల పట్ల కుతూహలం.ఒక మనిషిలో ఇన్ని కోణాలా ? వారేవా . అది చల్లా రామకృష్ణా రెడ్డి గారికే  చెల్లింది. ప్రస్తుతం రెడ్డిగారు వైసీపీలో ఎమ్మెల్సీ గా ఉన్నారు.

ఆయన  1983లో పాణ్యం,1999, 2004 ఎన్నికల్లో కోవెలకుంట్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 లో బనగానపల్లె లో పీఆర్పీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా చేసారు. 2019లోవైసీపీ అభ్యర్థి విజయంకోసం కృషి చేశారు.అన్నట్టు చనిపోయే ముందు ‘సాక్షి’ లో గాంధీజీ మళ్ళీ పుట్టాడు అనే వ్యాసం కూడా రాశారు ..  అభిమానులు చూడవచ్చు. 

———— KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!