పశ్చిమ బెంగాల్ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ .. తృణమూల్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు కేంద్ర బలగాలు నలుగుర్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేశాయి. ఆవేశ కావేష ప్రసంగాలు సాగుతున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరగగా బెంగాల్ లో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎనిమిది దశల్లో పోలింగ్ పెట్టారు. మార్చి 27,ఏప్రిల్ 1,6,10 తేదీల పోలింగ్ ముగిసింది. ఇంకా ఏప్రిల్ 17,22,26,29 తేదీలలో పోలింగ్ జరగాల్సి ఉన్నది. మొత్తం 294 స్థానాలకు గాను 8 దశల్లో ఎన్నికలు పెట్టడం ఏమిటో ఎవరికి అర్ధం కానీ విషయం. ఈసీ ఈ విషయంలో బీజేపీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నదని విమర్శలు కూడా లేకపోలేదు.
ముందెన్నడూ ఎరుగని సుదీర్ఘ ప్రక్రియ ఇది. ప్రక్రియ సంగతి ఆలా ఉంచితే నాలుగో దశలో జరిగిన హింస ఆందోళన కలిగించే అంశమే.ఇందుకు మీరే కారకులు అంటూ తృణమూల్ బీజేపీ పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. కూచ్ బిహార్ లో నలుగురు కాల్పుల్లో వ్యక్తులు మరణించారు. మరో అరడజను మంది గాయపడ్డారు. వెయ్యి కంపెనీల కేంద్ర బలగాలున్నప్పటికీ హింస నివారించలేక పోయారు. ప్రజలు దూసుకొచ్చి కేంద్ర బలగాల చేతిలో రైఫిళ్లను లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో కేంద్ర బలగాలు కాల్పులు జరపాల్సి వచ్చిందని అంటున్నారు. కేంద్ర బలగాలను అడ్డుకోవాలని మమతా పిలుపు నివ్వడం వల్లనే ఈ హింస జరిగిందని అమిత్ షా ఆరోపించారు. కేంద్ర బలగాలు బీజేపీకి సహకరిస్తూ తృణమూల్ కార్యకర్తలను అడ్డుకుంటున్నాయని… ఓటర్లను భయపెట్టే లక్ష్యంతోనే కాల్పులు జరిగాయని దీదీ అంటున్నారు.
ఇలా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కేంద్ర బలగాలు ఆత్మరక్షణార్థమే కాల్పులు జరిపాయని ఎన్నికల సంఘం నిర్దారించింది. మరిన్ని బలగాలను బెంగాల్ కి పంపింది. అదలా ఉంటే … కేంద్ర బలగాలు కొద్దీ మంది జనాలను ఇతర మార్గాల్లో ఎందుకు నిలువరించలేకపోయాయో అర్ధంకాని విషయం. దీదీ అంటున్నట్టు ఏ హెచ్చరికలూ లేకుండా కాల్పులు జరిపారా ? అనే సందేహాలు కలుగుతున్నాయి. మామూలుగా ఏ పోలీసులు అయినా లాఠీ ఛార్జ్ , భాష్పవాయుప్రయోగం , వాటర్ కెనాన్ ప్రయోగం చేసి అల్లరిమూక ను అరికట్ట లేనపుడు మాత్రమే కాల్పులకు దిగుతారు.కానీ ఆ తరహాలో కేంద్ర బలగాలు వ్యవహరించినట్టు లేదు.
మొత్తం మీద చూస్తుంటే దీదీ ని అడ్డుకోవాలని బీజేపీ … కమలానికి ఛాన్స్ లేకుండా చేయాలని తృణమూల్ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల పోరు పార్టీలకంటే వ్యక్తుల మధ్య జరుగుతున్నయుద్ధంగా మారింది. విమర్శలు కూడా ఆ తరహాలోనే ఉన్నాయి. ఎవరు తగ్గడం లేదు. తాజాగా ప్రజలను దీదీ రెచ్చగొట్టిన ఫలితంగానే కాల్పుల ఘటన జరిగిందని కేసు కూడా నమోదు అయింది. ఎన్నికల ప్రక్రియను సుదీర్ఘంగా సాగదీసి ఈసీ ఒక కొత్త ప్రయోగానికి నాంది పలికింది. ఫలితంగా హింస చెలరేగింది. అదే ఒకరోజు మొత్తం ఎన్నిక జరిగేలా ఏర్పాట్లు చేసి ఉంటే ఇంత ఉద్రిక్తత .. హింస జరిగేవి కావు. ఇక మిగిలిన దశల పోలింగ్ అయినా ప్రశాంతంగా సాగేలా ఈసీ చూడాలి.
—————-K.N.Murthy