కరోనా నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను నిలిపి వేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ చేసే బెంచ్ మారింది. తొలుత జస్టిస్ లావు నాగేశ్వరరావు ఉన్న త్రిసభ్య ధర్మాసనానికి ఈ కేసును కేటాయించారు. అయితే తాజాగా పంచాయితీ కేసులను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలో జస్టిస్ హృశికేష్ రాయ్ సభ్యుడిగా ఉన్న ద్విసభ్య ధర్మాసనానికి మార్చారు. సుప్రీం కోర్టు రిజిస్ట్రీ ఈ మార్పు చేసింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆంధ్రాకి చెందిన వారు కావడం గమనార్హం. అదీ గాక ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ కు బంధువు అవుతారనే ప్రచారం కూడా జరిగింది. కొన్ని ఛానళ్లలో విశ్లేషకులు ఈ అంశం ప్రస్తావించారు. కొన్నేళ్ల క్రితం వెంకయ్య నాయుడుకి చెందిన స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యక్రమంలో నిమ్మగడ్డ .. లావు నాగేశ్వర రావు లు పాల్గొన్నారు. ఈ ఫోటోలు కూడా రిజిస్ట్రీ కి అందాయని సమాచారం. ఈ క్రమంలోనే ఈ కేసును వేరే బెంచ్ కి మార్చారని అంటున్నారు. అలాగే గతంలో లావునాగేశ్వరరావు వద్ద పనిచేసిన శ్రీధర్ రెడ్డి అనే న్యాయవాది ఉద్యోగుల తరపున పిటీషన్ దాఖలు చేయడం మరో కారణం అని తెలుస్తోంది. ఇక ఉద్యోగులు వేసిన పిటీషన్ కూడా ఈ బెంచ్ ముందే ఉన్నది.
సోమవారం ఉదయం 11 తర్వాత ఈ కేసు విచారణకు వచ్చే అవకాశాలున్నాయి.ఈ పంచాయితీ పిటీషన్ నెంబర్ 39 కాబట్టి ఉదయాన్నే దీనిపై విచారణ జరిగే అవకాశాలు తక్కువే . మధ్యాహ్నం విచారణ జరగవచ్చు అంటున్నారు.
ఇదిలా ఉంటే … ఇప్పటికే పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన క్రమంలో సుప్రీం ఇచ్చే ఆదేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలి దశ పంచాయితీ ఎన్నికలకు సంబంధించి జిల్లాల కలెక్టర్లు సోమవారం ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉండగా వారు ఏమి చేస్తారా అనే ఆసక్తి నెలకొన్నది. తీర్పు వచ్చే వరకు మౌనంగానే ఉండొచ్చు అంటున్నారు. కాగా సీఎం జగన్ న్యాయమూర్తులపై సుప్రీం కు లేఖ రాసిన సందర్భంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటీషన్లను సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలో బెంచీ యే కొట్టి పడేసింది. ఆ బెంచ్ ముందుకే ఈ పంచాయితీ కేసు విచారణకు రావడం విశేషం. సుప్రీం కోర్టు ఎన్నికలు జరపమని ఆదేశిస్తే జరిపేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
—————–KNM