నాటి ఎన్నికల్లో ఓటమి పాలైన వారసులు !

Sharing is Caring...

లోకసభకు రెండేళ్ల క్రితం అంటే 2019 లో జరిగిన ఎన్నికల్లో రాజకీయ వారసుల్లో చాలామంది ఓటమి పాలయ్యారు. వారంతా వారసత్వ అంశం పనిచేయక ఓడిపోయారా ? లేక నియోజక వర్గ ప్రజలను ఆకట్టుకోలేక ఓటమి పాలయ్యారా అనేది ఖచ్చితంగా తేల్చి చెప్పలేం. వారి ఓటమికి పలుకారణాలున్నాయి.

ఆ వివరాల్లోకెళితే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తనయుడు రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అమేధీలో తన ప్రత్యర్థి .. బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరాని చేతిలో 55 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ కు కంచుకోట లాంటి ఆ నియోజకవర్గంలో రాహుల్ ఓడిపోయారంటే ఆయన పనితీరు పై అక్కడి ఓటర్లు అసంతృప్తి గా ఉన్నారని భావించవచ్చు.

అంతకు ముందు అమేధీ నుంచి సంజయ్ గాంధీ,రాజీవ్ గాంధీ , సోనియా గాంధీ కూడా ఎన్నికయ్యారు. అయితే రాహుల్ కి డౌట్ వచ్చి కేరళ లోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేశారు. అక్కడ 4.31 లక్షల ఓట్ల మెజారిటీ తో గెలిచారు.

అలాగే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ కుమారుడు వైభవ్ ఘోరంగా ఓడిపోయారు. జోధ్పూర్లో బీజేపీ అభ్యర్థి గజేంద్ర సింగ్ షెకావత్ చేతిలో వైభవ్ 2. 7లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతకుముందు 80,84,91,96,98 ఎన్నికల్లో అక్కడ అశోక్ గెహ్లాట్ విజయం సాధించారు.

తర్వాత బీజెపీ పట్టు బిగించింది. మద్య ప్రదేశ్ కి చెందిన మాజీ కేంద్ర మంత్రి మాధవ రావు సింధియా  తనయుడు జ్యోతిరాదిత్య సొంత నియోజకవర్గమైన గుణలో  బీజేపీ అభ్యర్థి కృష్ణ పాల్ సింఘా యాదవ్ చేతిలో 1లక్ష 25 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతకుముందు జ్యోతిరాదిత్య వరుసగా నాలుగు సార్లు గెలిచారు.

అంతకంటే ముందు మాధవరావు సింధియా అక్కడే పలుమార్లు విజయం సాధించారు. రాజస్థాన్ బార్మర్ నియోజకవర్గంలో బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన జస్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కైలాష్ చౌదరి చేతిలో 3.25 లక్షల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. 2004 లో మానవేంద్ర సింగ్ ఇక్కడే బీజేపీ అభ్యర్థిగా గెలిచారు.

మహారాష్ట్ర లో అజిత్ పవార్ కుమారుడు పార్ధ పవార్  మావాల్ నియోజకవర్గంలో ఎస్ హెచ్ ఎస్ అభ్యర్థి శ్రీరంగ బర్నే చేతిలో 2.15 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. మురళీ డియారా కుమారుడు మిలింద్ డియారా దక్షిణ ముంబయిలో లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతకు ముందు ఆయనే అక్కడ రెండు సార్లు గెలిచారు.

అలాగే శంకరరావు చౌహన్ తనయుడు నాందేడ్ లో ఓటమి  పాలయ్యారు. కర్ణాటకలో జెడి (ఎస్ )అభ్యర్థిగా పోటీ చేసిన అప్పటి సీఎం కుమార స్వామి తనయుడు నిఖిల్ కుమార్ స్వామి  మాండ్యా లో సినీనటీ సుమలత చేతిలో 1లక్షా 25 వేల తేడాతో ఓడిపోయారు.

తెలంగాణ లో సీఎం కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అరవింద్ చేతిలో 70. 875 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014 లో కవిత ఇక్కడే 1లక్షా 67 వేల  మెజారిటీ తో గెలిచారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలె బారామతి నియోజకవర్గం నుంచి పోటీ చేసి, బిజెపి అభ్యర్థి కాంచన్ రాహుల్ కూల్‌ పై 1.5 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.

అంతకు ముందు సుప్రియా 2009,2014 ఎన్నికల్లో కూడా ఇక్కడే గెలిచారు. ఇక తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి తనయ  కనిమోళి 3.47 లక్షల ఓట్ల మెజారిటీతో తూతుక్కుడి నుంచి విజయం సాధించారు. 

————- K.N.MURTHY 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!