అప్పుల్లొకి  అదానీ  గ్రూప్ !

Sharing is Caring...
 Debt burden..................................

ప్రముఖ వ్యాపారవేత్త  గౌతమ్ అదానీ కి చెందిన అదానీ గ్రూప్ క్రమంగా అప్పుల్లో కూరుకుపోతోందని కొద్ది రోజుల క్రితమే ఫిచ్ గ్రూప్ సంస్థ క్రెడిట్ సైట్స్ హెచ్చరించింది. ప్రస్తుత వ్యాపారాల విస్తరణతోపాటు కొత్త రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ పెద్ద ఎత్తున అప్పులు చేస్తోందని  ఆ సంస్థ స్పష్టం చేసింది.

వ్యాపార సామ్రాజ్యాన్ని శరవేగంగా విస్తరించాలన్న ఆకాంక్షతో అదానీ పరపతికి మించి రుణాలు సేకరిస్తున్నారు.కాలం కలిసి రాకపోతే  ఈ గ్రూప్ ముందు ముందు రుణాల ఊబిలో  కూరుకుపోయే ప్రమాదం ఉందని క్రెడిట్ సైట్స్ చెబుతోంది. ఈ నేపథ్యంలో  గ్రూప్ లోని ఒకటి లేదా అధిక కంపెనీలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం లేదా దివాలా తీసే అవకాశాలు లేకపోలేదని క్రెడిట్ సైట్స్ అంటోంది.

గత ఆర్థిక సంవత్సరం  మార్చి 31  నాటికి అదానీ గ్రూప్ లోని 6 లిస్టెడ్ కంపెనీల స్థూల రుణ భారం రూ.2,30,900 కోట్లకు చేరుకుంది. ఇది క్రమంగా పెరుగుతోంది. కంపెనీల  నగదు నిల్వలను మినహాయిస్తే, నికర రుణ భారం రూ.1,72,900 కోట్లుగా నమోదైంది.

గ్రూప్ లోని కొన్ని కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బాండ్ల జారీ ద్వారా కూడా రుణాలు సేకరించాయి. గత ఐదేళ్లలో జారీ చేసిన  ఆ బాండ్ల విలువ 9 బిలియన్ డాలర్లు.  అదానీ గ్రూప్ తన  వ్యాపారాలను రుణ నిధులతోనే విస్తరించింది.

గడిచిన కొన్నేళ్లలో విస్తరణ ప్రణాళికలను వేగం గా అమలు చేయడంతో గ్రూప్ అప్పులభారం ఊహించని విధం గా పెరిగింది. ఫలితంగా నగదు ప్రవాహంపై ఒత్తిడి ఎక్కువైంది. ఇక అదానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరిగా ఎదగడం తెల్సిందే. ఫోర్బ్స్ డేటా ప్రకారం, కేవలం రెండేళ్లలో (2020 -2022 ) అదానీ వ్యక్తిగత సంపద సుమారు 9 బిలియన్ల డాలర్ల నుండి 90 బిలియన్ల డాలర్లకు పెరిగింది.

ఇటీవల కాలంలో అదానీ గ్రూప్  కొత్త  వెంచర్స్  లోకి ..  అనుభవం లేని కీలక వ్యాపారాల్లోకి ప్రవేశించింది. వీటిలో  కొన్ని వ్యాపారాలకు భారీగా మూలధన నిధులు అవసరం ఉంటుంది. ఆయా సంస్థల కార్యకలాపాల విస్తరణపై అనుభవజ్ఞుల  పర్యవేక్షణ ఉండకపోవచ్చని  క్రెడిట్స్ సైట్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల ధరలు  ఒత్తిళ్లకు గురి కావచ్చు. 

ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్  ను వెనక్కి నెట్టి అదానీ గ్రూప్ దేశంలో రెండో అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా  నిలిచింది. పదిరోజుల  క్రితం నాటికి అదానీ గ్రూప్ లోని 7 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.19,29, 163 కోట్లు. 

కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ. 17,91,078 కోట్లకు పరిమితమైంది. దేశంలో అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.21 లక్షల కోట్ల పై మాటే. ఈ ఏడాదిలో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ. 10 లక్షల కోట్ల వరకు పెరగగా… రిలయన్స్ మార్కెట్ క్యాప్ మాత్రం రూ.1.61 లక్షల కోట్లు మాత్రమే పెరిగింది. రుణ భారాన్ని అదానీ ఎలా తగ్గించుకుంటారో వేచి చూడాల్సిందే.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!