ఆ సినిమాపై పార్లమెంట్ లో చర్చ!

Sharing is Caring...

Bharadwaja Rangavajhala……………………………….. 

దక్షిణాదిన నవ్య సినిమా ఉద్యమానికి శంఖం పూరించింది తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి అని చెప్పుకోవాలి. ఆయన కన్నడంలో తీసిన సంస్కార, చండమారుత లాంటి సినిమాలు ఆరోజుల్లో కొత్త ట్రెండ్ కి నాంది పలికాయి.  అసలు అతను సినీ యానం ప్రారంభించింది తెలుగులోనే.

దిగ్ధర్శకుడు కె.వి.రెడ్డి ప్రారంభించిన జయంతి పిక్చర్స్ లో పట్టాభిరామిరెడ్డి కూడా భాగస్వామి. వీళ్లిద్దరూ శ్రీనివాసన్ అనే మరో మిత్రుడితో కలసి పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీ కృష్ణార్జున యుద్దం. భాగ్యచక్రం చిత్రాలు తీశారు. ఆయన పేరు ఆ చిత్రాల టైటిల్స్ లో టి.పి. రామరెడ్డి అని పడుతుంది.

ఈ చిత్రాల నిర్మాణంలో డబ్బులు పెట్టడం వరకే తప్ప మిగిలిన విషయాలన్నీ కె.వి రెడ్డి ఇష్టప్రకారమే జరిగేవి.పట్టాభిరామిరెడ్డి పుట్టింది నెల్లూరులో. ఆ తర్వాత ఠాగూరు శాంతినికేతన్ లో చదువు. అక్కడ నుంచీ చైనా, జపాన్, అమెరికా లాంటి విదేశాల్లో కొంతకాలం గడిపారు.

ఫిడేలు రాగాల డజన్ తో తెలుగు కవిగా ఆయన జండా ఎగరేశారు. నవకవులు తప్పక చదవాల్సిన కవిత్వంగా అప్పట్లో ఆ పుస్తకానికి ఇంట్రో రాసిన శ్రీశ్రీ ప్రకటించారు. ఆ తర్వాత జ్యోతిలో పఠాభి పన్ చాంగము రాశారు. కయిత నాదయిత కూడా ఆయన రాసినదే. భావకవిత్వం మీద తిరుగుబాటుగానే పఠాభి కవిత్వం సాగిందనేది అభిప్రాయం.

కె.వితో స్నేహం కుదిరిన సమయంలో ఆయన మద్రాసులో ఉన్నారు. అక్కడే ఆయన నటి, నర్తకి స్నేహలతా పావెల్ ని వివాహం ఆడారు. స్నేహలత సోషలిస్టు. దీంతో ఆమెకు జార్జ్ ఫెర్నాండెజ్ తో స్నేహం ఉండేది. ఆ స్ఫూర్తితోనే పట్టాభితో కలసి యమర్జన్సీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనేది.1970లో పట్టాభి డైరక్షన్ లో వచ్చిన జాతీయ పురస్కార గ్రహీత సంస్కార చిత్రంలో స్నేహలత నటించారు. స్నేహలత మీద సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియా ప్రబావం ఉండేది.

లోహియా మ్యాన్ కైండ్ పత్రిక సంపాదక వర్గంలోనూ పనిచేసింది. పట్టాభితో కలసి పీపుల్స్ యూనియన్ ఫర్ సవిల్ లిబర్టీస్ వ్యవస్థాపక సభ్యురాలయ్యింది. వీటికి తోడు ఫెర్నాండెజ్ తో ఉన్న స్నేహం కారణంగా స్నేహలతను బరోడా డైనమేట్ కేసులో చివరి లిస్టు ముద్దాయిల్లో ఒకరుగా అరెస్ట్ చేశారు.

బెంగుళూరులో జైలు జీవితం గడిపారు. ఫెర్నాండెజ్ కు ఆమె ఆశ్రయం కల్పించారనేది ఎలిగేషను. జైలు పరిస్థితుల కారణంగా తీవ్రమైన ఆస్మాతో బాధపడుతున్న స్నేహలతను ప్రభుత్వం పెరోల్ మీద విడిచిపెట్టింది. పెరోల్ మీద విడుదలైన నాలుగైదు రోజుల్లోనే స్నేహలత చనిపోవడం జరిగింది. పఠాభి జీవితంలో ఇదో చేదు అనుభవం. 2006 మే 13 న పట్టాభి మన్ని వీడి వెళ్లారు. దక్షిణ భారతంలో సమాంతర చిత్ర నిర్మాణానికి ఆయనే ప్రారంభకుడు. సంస్కార చిత్రానికి మూలం యు.ఆర్. అనంతమూర్తి నవల సంస్కారయే.

నారాయణప్ప అనే బ్రాహ్మణుడు సకల వ్యసనాలకూ లోనై చనిపోతాడు. అతనికి అంత్యక్రియలు ఎలా చేయాలనేది సమస్య. ఈ విషయంలో ఒక నిర్ణయం ప్రకటించమని బ్రాహ్మలంతా కలసి పండితుడైన ప్రాణేశాచార్యను కోరుతారు. ఒక వ్యక్తి … వ్యక్తిత్వం మీద ఇంకో వ్యక్తికి ఎంత వరకూ హక్కు ఉన్నది? గ్రందాలూ పుస్తకాలూ తిరగేసినా అతనికేమీ పాలుపోదు.

ప్రాణేశాచార్య వైవాహిక జీవితం అంత సవ్యంగా సాగదు. అతని భార్య పెళ్లైన నాటి నుంచీ వ్యాధులతో బాధపడుతూంటుంది. దీంతో అతనికి సంసారసుఖం ఉండదు. నారాయణప్ప మృతదేహానికి ఎలా దహన సంస్కారాలు నిర్వహించాలనే మీమాంస అలా ఉండగానే అతను ఉంచుకున్న వెలయాలుతో ప్రాణేశాచార్య పడకసుఖం పొందుతాడు. ఈ సంఘటనతో అతను కదలిపోతాడు.

నారాయణప్ప బహిరంగంగానే అన్నీ చేసేవాడు. తాను మాత్రం దొంగచాటుగా అన్నీ చేస్తూ … పైకి మాత్రం ధర్మ రక్షకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ హిపోక్రసీ అతనిలో గందరగోళం రేపుతుంది. అలా ధర్మశాస్త్రాలు వల్లిస్తూ నీతులు చెప్పడం సంస్కారం కాదని తెలుసుకుంటాడు. నారాయణప్పకు అంత్యక్రియలు జరపాలని నిర్ణయించుకుంటాడు.ఈ కథ గురించి పట్టాభికి చెప్పింది లోహియానే.

ఒక సారి పట్టాభి స్నేహలతల ఆతిధ్యం స్వీకరించడానికి వచ్చిన లోహియా మాటల సందర్భంలో సంస్కార గురించీ రచయిత అనంతమూర్తి గురించీ ప్రస్తావించడం జరిగింది. అప్పటికే వాస్తవిక వాద చిత్ర నిర్మాణం గురించి ఆలోచనలు చేస్తున్న పట్టాభిని ఈ కథ ఆకర్షించింది. మెడ్రాస్ ప్లేయర్స్ అంటూ స్నేహలత ప్రారంబించిన సంస్ధలోని సభ్యులతోనే ఈ సినిమా చేయాలనుకున్నారు.

గిరీష్ కర్నాడ్ అక్కడ నుంచీ వచ్చినవాడే. అతన్నే హీరోగా తీసుకున్నారు. గిరీష్ ప్రాణేశాచార్య పాత్ర పోషించడమే కాదు … స్క్రీప్ ప్లే , డైలాగ్స్ కూడా రాశాడు.అప్పటికే నీతీ నిజాయితీ తీసి దర్శకుడైన కె.వి రెడ్డి అసిస్టెంటు సింగీతం శ్రీనివాసరావును పిల్చి సహకార దర్శకుడుగా ఉండమని కోరారు పట్టాభి.

వీరిద్దరికీ జయంతీ బాగా పరిచయం. సంస్కార చిత్రానికి టామ్ కోవన్ అనే ఆస్ట్రేలియన్ కెమేరా బాధ్యతలు చూశారు.బ్రాహ్మణ కులానికి సంబంధించిన కథతో తీసిన సినిమా అంటూ దీన్ని నిషేదించడం జరిగింది. సుమారు ఏడాది పాటు సినిమా విడుదల కోసం అనేక పద్దతుల్లో ప్రయత్నం చేశారు పట్టాభి.

ఈ ప్రయత్నంలో అప్పట్లో పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న సినీ నటుడు జగ్గయ్య ఆయనకి సహకారం అందించారు. పార్లమెంటులో ఈ సినిమా మీద జరిగిన చర్చలో జగ్గయ్య మాట్లాడారు.పార్లమెంటులో ఒకరోజు చర్చ జరిగిన తరువాత ఒక్క కట్ కూడా లేకుండా ప్రదర్శనకు అనుమతి లభించింది.మొత్తానికి జగ్గయ్య చొరవతో , అప్పటి సమాచార శాఖ మంత్రి గుజ్రాల్ సహకారంతో సినిమా విడుదలయ్యింది.

ఈ చిత్రంలో సెట్లు లేవు. ఏ నటునికి మేకప్ వేయలేదు. ఏ పాత్రకైనా గడ్డం పెరగవలసి వస్తే ఆ నటుడికి గడ్డం పెరిగే వరకూ నిరీక్షించారే కాని ఎవరికీ ఎక్కడా గడ్డం అతికించలేదు. అలాగే సినిమాలో పాటలు లేవు. కాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఉంది. ఈ సినిమాకు రాజీ తారానాథ్ సంగీతం చేకూర్చాడు.

కేవలం మూడు వాయిద్యాలను మాత్రమే నేపథ్య సంగీతంలో వాడారు. ఈ సినిమాకి ఆరోజుల్లో లక్ష 20 వేల రూపాయలు ఖర్చయ్యాయి.  విడుదల అనంతరం అవార్డులు .. రివార్డులు లభించాయి.  యూట్యూబ్ లో సినిమా ఉంది, చూడొచ్చు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!