Specialties of Varahi Devi Temples…………………………..
వారాహి దేవీ ఆలయాల్లో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అవి ముందుగా తెలుసుకుని వెళ్ళాలి. వారాహీ దేవీ ఆలయాన్ని కాశీ వెళ్లిన వారు తప్పక దర్శించుకుని రావాలి.ఈ ఆలయానికి కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి .
ఉదయం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు రెండు గంటలు మాత్రమే గుడి తెరిచి ఉంటుంది. తర్వాత పూర్తిగా మూసి వేస్తారు. ఈ ఆలయం భూ గృహంలో ఉంటుంది. ఆ సమయం దాటి వెళ్ళినవారు అమ్మ వారిని నేరుగా చూడలేరు. అక్కడి తలుపులుకున్న రంద్రాల ద్వారా మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకత.
ఒక రంద్రం నుంచి చూస్తే అమ్మవారి ముఖం .. మరో రంధ్రం ద్వారా చూస్తే అమ్మ పాదాలు కనిపిస్తాయి. కేవలం రెండుగంటలు మాత్రమే అమ్మవారి దర్శనం ఎందుకు కల్పించారు అంటే వారాహీ మహోగ్ర స్వరూపిణి. చూస్తే భయపడే ప్రమాదం ఉంది. గతం లో కొందరు అలా ప్రయత్నించి ఆ దేవీ ఉగ్ర స్వరూపం చూడలేక పడిపోయారట.
అందుకని ఉదయం ఆ రెండుగంటలు తప్ప మిగిలిన సమయాల్లో భక్తులను అనుమతించరు. పూజారి తప్ప అన్యులు భూగృహంలో ప్రవేశించరాదనే నియమం ఉంది. పూజారి అమ్మావారికి చేసే నిత్యా పూజలు తప్ప వేరే ప్రత్యేక పూజలు ఉండవు.
వారాహి దేవి విష్ణుమూర్తి రూపంలోనే ఉంటుంది. విష్ణుమూర్తి శక్తి స్వరూపమే వారాహి దేవి. తాంత్రిక గ్రంధాలలో దేవీ తల వరాహ రూపంలో ఉంటుంది. అందుకే వారాహీ అనే పేరు వచ్చింది. వారాహీ దేవీ ఉగ్రాన్నితగ్గించడానికి ఆది శంకరాచార్యులు అమ్మవారి చెవులకు శ్రీ చక్రాలు చేయించి తగిలించారట.
అయినా మార్పు రాకపోయే సరికి ఆమె సన్నిధిలో ప్రసన్న గణపతిని ప్రతిష్టించారట. కుమారగణపతి పై ప్రేమతో అమ్మవారు శాంతించారని అంటారు. ఉదయం వేళలో ఆలయం తెరిచినపుడు దేవి శాంతి స్వరూపిణిగా దర్శనమిస్తుంది.
8 గంటలు దాటాక అమ్మవారు ఉగ్రస్వరూపిణిగా మారుతుందట. అందుకే అరగంట ముందే ఆలయం తలుపులు మూసేస్తారు. ఆలయం మూసిన సమయాల్లో లోపల నుంచి భయంకర శబ్దాలు వినిపిస్తాయని పూజారులు చెప్పినట్టు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
అమ్మ వారిని ఇక్కడ పాతాళ వారాహీ అని కూడా పిలుస్తారు. కాశీ నగర దేవతగా కూడా వారాహీ ప్రసిద్ధి చెందారు. కాగా దేశంలో వారాహీ ఆలయాలు కొన్ని ఉన్నప్పటికీ ఒడిస్సా లోని చౌరాసి , చెన్నై లోని మైలాపూర్ ,వారణాసి ఆలయాలు ప్రసిద్ధి గాంచినవి. కొన్ని చోట్ల రాత్రిళ్ళు మాత్రమే దర్శనం ఉంటుందట.