“డ్యాన్సింగ్ ఆన్ ది గ్రేవ్” …………… భార్యను సమాధి చేసి దానిపై డ్యాన్సులు వేసిన స్వామి శ్రద్దానంద కేసు ఆధారంగా ఈ సిరీస్ తీశారు . అమెజాన్ ప్రైమ్‌లో ఇది ప్రసారమవుతోంది. మైసూర్ దివాన్ మీర్జా ఇస్మాయిల్ మనవరాలు షాకీరే ఖలీలి అందాల రాశి. మొదట ఆమెకు భారతీయ దౌత్యవేత్త ఇరాన్ అక్బర్‌తో పెళ్లైంది. కానీ వృత్తిరీత్యా అతడు విదేశాల్లోనే ఉండాల్సి రావడంతో భార్యతో దూరం పెరిగింది.
వీరికి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. కొంతకాలానికి ఆమె అతడికి విడాకులిచ్చేసింది. ఆరు నెలలు తిరిగేలోపు 1986లో స్వామి శ్రద్దానంద(మురళీ మనోహర్ మిశ్రా )ను పెళ్లాడింది. ఈ పెళ్లితో షాకీరే తన కుటుంబానికి కూడా పూర్తిగా దూరమైంది. షాకీరే కున్న ఆస్తులపై శ్రద్ధానంద కన్నేశాడు. వారిద్దరి మధ్య కొన్ని విషయాలలో విభేదాలు కూడా ఏర్పడ్డాయి.
రెండో భర్తతో సంతోషంగా ఉంటుందనుకున్న షాకీరే 1991లో అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. షాకీరే కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది . మూడేళ్ల పోలీసుల విచారణ తర్వాత 1994లో ఈ కేసులో పురోగతి కనిపించింది. శ్రద్ధానంద పై పోలీసులకు అనుమానమొచ్చింది. షాకీరేను తన ఇంటి పెరట్లోనే పాతిపెట్టినట్లు శ్రద్దానంద అంగీకరించాడు.
దీంతో పోలీసులు ఆ ప్రదేశంలో తవ్వి చూడగా ఆమె అస్థిపంజరం లభ్యమైంది. ఆమెకు నిద్రమాత్రలు ఇచ్చి బతికుండగానే సమాధి చేశాడన్న బలమైన వాదన అప్పట్లో వినిపించింది. ఆమె చేతి గోళ్లలో చెక్క పొట్టు కనిపించింది. సమాధి చేసిన చెక్క పెట్టెలో నుంచి బయటకు రావడానికి ఆమె ఎంతగానో ప్రయత్నించిందని రిపోర్టుల్లో వెల్లడైంది. అప్పట్లో ఈ కేసు పెను సంచలనం సృష్టించింది.
2000లో బెంగళూరులోని సెషన్స్ కోర్టు శ్రద్ధానంద్‌ను దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. సెప్టెంబర్ 2005లో కర్ణాటక హైకోర్టు అతని మరణశిక్షను సమర్థించింది. 2008లో సుప్రీం కోర్టు ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. 2011 వరకు బెంగుళూరులోని పరప్పన అగ్రహారలోని సెంట్రల్ జైలులో ఉన్న శ్రద్ధానంద ఉన్నారు. తర్వాత ఆయన అభ్యర్ధన మేరకు భోపాల్ కేంద్ర కారాగారానికి తరలించారు.
ఇప్పటికీ అతడు మధ్యప్రదేశ్ సాగర్‌లోని సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. భార్య సమాధి అనంతరం శ్రద్దానంద దానిపై పార్టీలు చేసుకుని డ్యాన్సులు చేసేవాడంటూ కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయని చెప్పుకునే వారు. దీంతో ఈ సిరీస్‌కు ‘డ్యాన్సింగ్ ఆన్ ది గ్రేవ్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రతీక్ గ్రాహం దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో నాలుగు ఎపిసోడ్లు ఉన్నాయి. ఇండియా టుడే ఒరిజినల్స్ ప్రొడక్షన్ ఈ సిరీస్ ను నిర్మించింది.
శ్రద్దానంద ఈ వెబ్ సిరీస్‌పై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్ తెరకెక్కించిన ఇండియా టుడే, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు తన లాయర్ ద్వారా నోటీసులు పంపించాడు. తాను సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేశానని, ఈ సమయంలో తన గురించి వెబ్ సిరీస్ తీయడం న్యాయాన్ని అతిక్రమించడమే అవుతుందని నోటీసులో పేర్కొన్నాడు. తన హక్కులను కాలరాస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను తక్షణమే నిలిపివేయాలని లేదంటే కోర్టుకు వెళ్తామని తెలిపాడు.