సాగు పద్ధతులు మార్చారు ..సంపాదన పెరిగింది !!

Sharing is Caring...

కోవిడ్19… లాక్ డౌన్ కారణంగా పట్టణ వాసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉపాధి, ఉద్యోగాలు  కోల్పోయి రోడ్డున పడ్డారు. అదే రీతిలో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు కూడా మనుగడ సాగించడం కష్టమైపోయింది. వ్యవసాయ పనులు దెబ్బతిన్నాయి.నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. 

చిన్న,సన్నకారు రైతులు తమ కున్న కొద్దీ పాటి పొలాల్లో చేసే సాగు ద్వారా వచ్చే ఆదాయంతో బతికే వారు. అనూహ్యంగా వచ్చిన కరోనా వల్ల రైతులు పంటలను మార్కెట్‌కు తీసుకెళ్లలేక పోయారు. తీసుకెళ్లినా గిట్టుబాటు ధర దొరక్క కళ్ళ నీళ్ల పర్యంతమయ్యేవారు. ఆర్ధికంగా చితికి పోయారు.తీసుకెళ్లిన పంటను అక్కడే పారబోసి ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లిన రైతులు ఎందరో ఉన్నారు. కష్టపడి పండించిన ఆ పంట అమ్మితే వచ్చే సొమ్ము “పెట్టుబడి .. రవాణా చార్జీల ఖర్చును ” కూడా మించని సందర్భాలు ఉన్నాయి.

లాక్‌డౌన్ సమయంలో నిర్వహించిన ఒక సర్వేలో భారతదేశంలో 60% మంది రైతులు తమ పంటల దిగుబడిని కోల్పోయారని వెల్లడైంది.ఇది మెజారిటీ రైతుల కథ. అయితే ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్‌ లోని లఖింపూర్ ఖేరీలో మహిళా రైతులు విజయ గాధ మరోలా ఉంది.

లఖింపూర్ ఖేరీ జిల్లాలో కొన్ని గ్రామాల సన్న కారు మహిళా రైతులు కష్టాలను తట్టుకోవడమే కాకుండా తమ వ్యవసాయ పద్ధతులను మార్చుకుని .. పరస్పరం సహాయ సహకారాలు అందించుకుని వారి ఆదాయాన్ని పెంచుకున్నారు.

సమర్సేపూర్ గ్రామానికి చెందిన మహిళా రైతు రాజ్ రాణి కి కొద్దీ పాటి భూమి ఉంది.అందులోనే ఆమె పంటలు ..కూరగాయలు పండిస్తోంది. ఏడుగురు సభ్యులతో కూడిన ఆమె కుటుంబం వ్యవసాయ ఉత్పత్తులపై వచ్చే ఆదాయం పైనే ఆధారపడి జీవిస్తోంది.గ్రామంలోని చాలామంది లాగే, రాణి కూడా సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు, విత్తనాలను ఉపయోగించేది.ఇది ఎల్లప్పుడూ ఖర్చుతో కూడుకున్నది కాదు.

అయితే 2018లో ఆమె క్లైమేట్ రెసిలెంట్ అగ్రికల్చర్ (CRA) పద్ధతులను ..  సాగులో శాస్త్రీయ పద్ధతులకు మారింది.(క్లైమేట్ రెసిలెంట్ అగ్రికల్చర్ (CRA) అంటే  వాతావరణాన్ని తట్టుకోగల వ్యవసాయం.దీర్ఘకాలం అధిక ఉత్పాదకత నిచ్చే పంటలు వేయడం. తద్వారా వాతావరణ వైవిధ్యాల కింద వ్యవసాయ ఆదాయాలను పెంచు కోవచ్చు.) శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ రసాయనిక పురుగు మందులకు బదులు సేంద్రియ ఎరువుతో పాటు నాణ్యమైన విత్తనాలు ఉపయోగించింది.

ఈ పద్దతుల వలన ఖర్చులు తగ్గాయి. అదే సమయంలో దిగుబడి పెరిగింది. ఆమె కుటుంబం సాధారణంగా ఒక సంవత్సరంలో సంపాదించే దానికంటే ఎక్కువ సంపాదించింది. ఈ సంవత్సరం ఆమె పొలంలో గోధుమలు, టమోటాలు, వంకాయలను సాగు చేస్తున్నది . గత ఏడాది కంటే అధిక ఆదాయాన్ని అంచనా వేస్తున్నది. 

అలాగే గత ఏడాది మొక్కలకు మంచి నీరు పెట్టేందుకు నీటి ట్యాంక్ .. ఇతర నీటిపారుదల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసుకుంది. నిపుణుల సలహాతో సేంద్రియ ఎరువును ఉపయోగించడం మొదలెట్టింది. దానివలన ఎరువుల ఖర్చుకూడా తగ్గింది.

రాంపూర్వా గ్రామానికి చెందిన సరోజినీ దేవిది కూడా కొంచెం అటు ఇటుగా అదే కథ. ఆరుగురితో కూడిన కుటుంబం ఆమెది. భర్త మున్నా లాల్ వలస కూలీ.. తమకున్న కొద్దీ భూమిలో సాగు చేసేవారు. చాలీ చాలని ఆదాయంతో అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడేవారు. దీనికి తోడు కొంత భూమిని కౌలు కు తీసుకుని వ్యవసాయం చేసేది. పెద్దగా ఆర్థిక పరిస్థితులు మారలేదు. ఈ క్రమంలో సరోజిని కూడా CRA విధానంలోకి మారింది. మహిళా రైతు సమూహంలో భాగమైంది. 

అప్పటి నుంచి తాను మెరుగైన వ్యవసాయ పద్ధతిని అలవర్చుకోగలిగానని, సమిష్టి సహకారంతో తన భూమికి సాగునీరు అందించగలిగానని సరోజినీ అంటోంది. అలా వ్యవసాయ విధానం మార్చుకుని.. ఆదాయం పెంచుకున్న 3,000 మంది రైతులలో ఇలాంటి మహిళలు కూడా ఉన్నారు, గత కొన్ని సంవత్సరాలుగా వారి ఆదాయాలు పెరిగాయి. వర్చువల్ ట్రైల్‌ వాకర్ ఛాలెంజ్ వంటి ఈవెంట్‌ల ద్వారా సేకరించిన నిధుల సహాయంతో AIM ట్రస్ట్ , ఆక్స్‌ఫామ్ ఇండియా సంస్థలు ఆ రైతులకు శిక్షణ ఇచ్చి.. అండగా నిలిచాయి.

2016లో ఉత్తరాఖండ్‌లో ప్రారంభించిన ఈ కార్యక్రమాలు యూపీ లోని లఖింపూర్ ఖేరీకి విస్తరించాయి.  CRA ద్వారా చిన్న రైతులకు, ముఖ్యంగా మహిళలకు ఆదాయం పెంచేలా చేస్తూ .. వారు ఆర్థిక సాధికారత సాధించడమే ఈ సంస్థల లక్ష్యం. లఖింపూర్ ఖేరీకి కరువులు, పంటల వైఫల్యాల చరిత్ర ఉంది  దీనికి పరిష్కారం  CRA విధానాలను అనుసరించడమే.  

మహిళా రైతులకు శిక్షణ ఇచ్చి ట్యాంకులు, పైపులు వంటి నీటిపారుదల సౌకర్యాల ఏర్పాటులో సహాయం అందించామని ఆక్స్‌ఫామ్ ఇండియా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బినోద్ కుమార్ సిన్హా వివరించారు. స్థానికంగా లభించే వస్తువులు,కంపోస్ట్‌తో కూడిన శాస్త్రీయ వ్యవసాయం, సేంద్రియ ఎరువులను ఉపయోగించి మహిళలు తమ ఆదాయాన్ని 30 శాతం వరకు పెంచుకోగలిగారని సిన్హా అంటున్నారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!