రమణ కొంటికర్ల ……………………………….
అది నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో రోడ్డు సదుపాయం కూడా సరిగ్గా లేని తంగిడి అనే మారుమూల గ్రామం. అక్కడో రేషన్ షాప్ ఓనర్ కు ఇష్టమైనప్పుడే రేషనిచ్చేది. లేకుంటే బందువెట్టేది. ఎవరికన్నా ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తే… అసలు రేషనే ఇవ్వ… ఎవ్వరికి చెప్పుకుంటరో చెప్పుకోండని ఉల్టా బెదిరించే మోరుజోపు డీలర్ తాను. చిరిగిన ధోవతీ, పంచతో వచ్చిన ఓ సామాన్యవ్యక్తి ద్వారా ఈ వ్యథ ఓ అధికారి చెవినపడింది. ఏం భయపడకు నేను చూసుకుంటానని అభయమిచ్చి… ఆ సామాన్యుడు తనకు ఫిర్యాదు చేసేందుకెక్కడి నుంచైతే వచ్చాడో అక్కడికి రానూ, పోనూ ఖర్చులు కూడా చేతిలో పెట్టి పంపాడు ఆ అధికారి.
ఇంకేం…? కట్ చేస్తే… జనాన్నిపరేషాన్ చేస్తున్న రేషన్ షాప్ కాడ… ఆపరేషన్ షూరూ అయింది ఓరోజు. సదరు మనం చెప్పుకుంటున్న పౌరసరఫరాలశాఖ ఎన్ ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహశీల్దార్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయనకు మాత్రమే తెలుసు తానో అధికారినని. ఎందుకంటే ఆయన ఓ సామాన్యుడిలానే అక్కడికెంట్రీ ఇచ్చాడు. సదరు రేషన్ షాప్ డీలర్సెలా వ్యవహరిస్తారో క్షేత్రస్థాయిలో గమనించాలన్నది ఆయన తపన. అంతకుమందు ఆయకందిన ఫిర్యాదులు.. బస్సుల్లో వెళ్తున్నప్పుడు సామాన్యులు మాట్లాడుకుంటుండే మాటలన్నీ ఆ రేషన్ షాప్ కాడ దృగ్విదితం కానే అయ్యాయి.
కానీ అంతలోనే రఘునందన్ ను ఎవరో గమనిస్తున్నారు. ఏదో తేడా కొడుతోంది. దాంతో సదరు డీలర్ దగ్గరికొచ్చి సైగ చేశారో, లేదో… ఉన్నపళంగా రేషన్ దుకాణాన్ని మూసేసేందుకు యత్నించబోయారు. అదే సమయంలో రఘునందన్ కంటికి కనిపించిన ఓ కన్నీటిగాధ తనను మరింత కదలించింది. ఓ ముసలవ్వ తీసుకోవాల్సిన రేషన్ బియ్యం ఇంకా కాంటామీద ఉండగానే… కనీసం ఆ పని కూడా పూర్తి చేయకుండానే జబర్దస్త్ గా ఆ డీలర్ దుకాణాన్ని మూసేస్తున్న తీరు రఘునందన్ లో ఒకింత అసంతృప్తికి కారణమైంది. దాంతో వినమ్రంగానే… ఓ సామాన్య పౌరుడిలా… రేషన్ షాపునప్పుడే ఎందుకు క్లోజ్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా అని అడిగారు. కానీ రేషన్ డీలర్ పట్టించుకోలేదు.
పైగా ఓవైపు ముసలవ్వ అయ్యా ఈ రేషన్ బియ్యం తీసుకుపోతేనే ఇంట్ల ఇంత అన్నం వండుకునేది.. లేకుంటే ఇంట్ల ఇన్ని గింజల్గూడా లేవంటూ ఆ పండుటాకు ప్రార్థిస్తోంది. అయినా వినకుండా అప్పటికి రావే ముసలిదానా అంటూ మరింత కాస్తా కటువుగా మాట్లాడ్డం రఘునందన్ లో కొంచెం ఆగ్రహానికి కూడా కారణమై… ఇది పద్ధతికాదంటూ మందలించాడు. ఇంకేముందీ… రేషన్ డీలర్ సర్రున సామాన్యులపైకెలాగైతే లేవడమలవాటో… అగో అదే పద్ధతిలో రఘునందనెవ్వరో తెల్వక ఎవ్వర్రా నువ్వు అప్పట్నుంచి చూస్తన్న ఈడేంజేస్తున్నావు… బంద్ చేస్తా నీకేందిరా అంటూ రారాపోరా కొడుతూ తన ప్రతాపాన్ని చూపాడు.
కట్ చేస్తే… అప్పటికే సమాచారమందిన పోలీస్ కానిస్టేబుల్ చేరుకున్నాడు. సారు కొత్తగా వచ్చిన ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ అని దూరం నుంచే కేక వేశాడు.. ఇంకేముందీ… నమస్కారం సార్ మీరు వస్తున్నప్పుడు చూసిన సారు.. గిటు ఎందుకు పోతున్నారని డౌట్ వచ్చింది.. అందుకే వచ్చిన సారంటూ ఏదేదో నసుగుతూనే సెల్యూట్ చేశాడు రేషన్ షాప్ డీలర్. ముచ్చెమటలు పట్టిన ముఖాన్ని తుడుచుకుంటూనే.. తప్పైంది సారంటూ ఆ దుకాణం డీలరు ప్రాధేయపడటం ఆరంభమైంది.
అవ్వా.. ఏం చెయ్యమంటావు ఈ పెద్ద మనిషిని అనడిగాడు రఘునందన్. అయ్యా..ఇంకోపారి మళ్ళగిట్లనే చేస్తే నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి ఇయ్యాల దినం ఒక్కపారి ఊకో.. అంటూ తన పెద్దమనసు చాటుకుంది అంతవరకూ ఆ రేషన్ డీలర్ తో తిట్లు తిన్న ముసలవ్వ. కండ్లల్ల నీళ్ళు తుడ్సుకుంట.. ఆమె వెంట తెచ్చిన వలచిన వేరు శనక్కాయలు ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ రఘునందన్ చేతిలో పెట్టింది. అందుకు కృతజ్ఞతగా… ఆమె ప్రేమకు పరవశించి.. సత్తువలేని చేతుల్లో ఉన్న ఆమె బియ్యం మూటను భుజానికెత్తి ఇంటికి పంపాడు రఘునందన్.
నిత్యం రేషన్ బియ్యం పట్టివేత, అక్రమ రేషన్ బియ్యం రవాణా వంటి వార్తలు సాధారణమైన తరుణంలో రఘునందన్ లాంటి అధికారుల అవసరం ఎంతైనా ఉందనిపించడంలేదూ..? రేషన్ దుకాణాలను ఎవ్వరు నడిపితే ఏంటీ… ఎవ్వరు పట్టించుకుంటారు.. మారుమూల ఊళ్లల్లోకి ఎవరు వస్తారన్న అనుమానాలను ఈ అధికారి పటాపంచలు చేస్తున్నారు. పేదల ఆకలి తీర్చే ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రహసనం కావడం ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తున్నాడు రఘునందన్. అందుకే ఈయన ఇప్పుడు నారాయణపేట జిల్లాలో ఓ సూపర్ ఆఫీసర్. వృత్తి పట్ల ఉండాల్సిన బాధ్యతకు… మానవత్వ కోణం కూడా జతకలిస్తే… అదిప్పుడు రఘునందన్ మాచన.
అయితే ఇలాంటి ఎన్నో ఘటనలు మాచన వృత్తి జీవితంలో తారసపడుతుండగా… మరోవైపు పోగాకు బాగా సేవించి మృత్యువాత పడ్డ తన స్నేహితుడి మరణం కూడా ఈయన్ను కదలించింది. పొగాకు వాడకం క్యాన్సర్ కారకమంటూ తన వృత్తితో పాటే… ఆ ప్రచారాన్నీ ప్రవృత్తిగా మార్చుకునేలా చేసి… ఇప్పుడు వృత్తిపరంగా, తన ప్రవృత్తిపరంగా, అన్నింటికిమించి వ్యక్తిగతంగా రఘునందన్ కు జనం నుంచి జేజేలు దక్కేలా చేస్తోంది.