Popular music director ……………..
ప్రఖ్యాత సంగీత దర్శకుడు బప్పిలహరి అసలు పేరు అలోకేష్. 2014లో బప్పీలహరి రాజకీయాల పట్ల మక్కువతో బీజేపీలో చేరాడు. కొన్నాళ్ళు రాజకీయ నాయకుడిగా చలామణీ అయ్యారు.
అదే సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో శ్రీరాంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పార్టీ లో చేరిన సమయంలో బప్పీలహరి పార్టీ కోసం కొన్నిగీతాలకు స్వర రచన చేశారు. అప్పట్లో పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ చేపట్టిన ర్యాలీలో కూడా బప్పీలహరి పాల్గొన్నారు.
ఇక ఎన్నికల విషయానికొస్తే శ్రీరాంపూర్ తృణమూల్ కాంగ్రెస్ కి బలమున్న నియోజకవర్గం. నాటి ఎన్నికల్లో బప్పీలహరి గట్టిగానే ప్రచారం చేశారు.అయితే ఓటర్ల అభిమానం చూరగొన లేకపోయారు.
తృణమూల్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.బప్పీలహరికి నాటి ఎన్నికల్లో 287712 ఓట్లు వచ్చాయి. తృతీయ స్థానంలో నిలిచారు. ద్వితీయ స్థానంలో నిలిచిన సీపీఐ పార్టీ అభ్యర్ధి తీర్థంకర్ రాయ్ కి 362407ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ నాలుగో స్థానంలోకి వెళ్ళింది.
తృణమూల్ అభ్యర్థి కళ్యాణ్ బెనర్జీ 514933 ఓట్లు వచ్చాయి. 152526 ఓట్ల మెజారిటీ తో కళ్యాణ్ గెలిచారు. రాజకీయాలలో కూడా తన ముద్ర వేయాలని భావించిన బప్పీలహరి నిరాశ పడ్డారు. క్రమంగా రాజకీయాలకు దూరమైనారు. తర్వాత కొన్ని సినిమాలకు కూడా పనిచేశారు.
బప్పీలహరి తండ్రి ‘అపరేష్ లహరి’ ప్రసిద్ధ బెంగాలీ గాయకుడు .. అతని తల్లి ‘బన్సారీ లహరి’ సంగీత విద్వాంసురాలు. తల్లిదండ్రులు బప్పీలహరికి సంగీతం లోని ప్రతి అంశంలో శిక్షణ ఇచ్చారు.ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ బప్పీ లహరి కి మేనమామ అవుతారు.
సూపర్‌స్టార్ కృష్ణ తీసిన ‘సింహాసనం’తో బప్పిలహిరి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ సినిమా పాటలు సూపర్ హిట్ కావడంతో ఆయనకు తెలుగులోనూ వరుసగా ఆఫర్లు వచ్చాయి.
‘త్రిమూర్తులు’, ‘సామ్రాట్’, ‘స్టేట్ రౌడీ, ‘గ్యాంగ్ లీడర్’, ‘రౌడీ అల్లుడు’, ‘నిప్పు రవ్వ’, ‘బిగ్‌బాస్’ సినిమాలకు సంగీత దర్శకుడిగా, గాయకుడిగా సత్తా చాటుకున్నారు.