దత్త పుత్రుడి పెళ్లా ? మజాకా ?

Sharing is Caring...

తమిళనాడు సీఎం గా చేసిన జయలలిత తన దత్త పుత్రుడు సుధాకరన్ వివాహ వేడుకలను అంగరంగ వైభవంగా చేసి రికార్డు సృష్టించారు. ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ మనవరాలిని సుధాకరన్ చేసుకున్నారు. అప్పట్లో ఇలాంటి పెళ్లి వేడుక మరెక్కడా జరుగలేదని దేశ, విదేశీ పత్రికలు రాశాయి. ప్రపంచంలోనే అతి పెద్ద వివాహ వేడుక అని జయను కీర్తిస్తూ ఫోటోలు వేసి ప్రత్యేక కథనాలు రాశాయి. ఈ వివాహ వేడుకకు సుమారు 150,000 మంది అతిథులు హాజరయ్యారు.

ఈ పెళ్లి వేడుక సందర్భంగా 1995 సెప్టెంబరు 7న రాష్ట్ర రాజధాని చెన్నైలోని బీచ్ వద్ద అతి పెద్ద విందు కూడా ఏర్పాటు చేశారు. ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ కూడా ఈ వివాహ వేడుక .. విందును అత్యంత పెద్దదిగా ధృవీకరించింది. టైమ్ మ్యాగజైన్ .. దేశంలోని ఇతర వార్తాపత్రికలు ఈ వేడుక గురించి గొప్పగా రాశాయి. కొన్ని పత్రికలు మాత్రం జయలలిత ఈ పెళ్లి వేడుక ద్వారా తన సంపద తాలుకూ హంగూ .. ఆర్భాటాన్ని ప్రదర్శించిందని విమర్శించాయి.

పెళ్ళికొడుకుని ఊరేగిస్తూ తీసుకొచ్చే మార్గంలో  2-కి.మీ పొడవున రంగు రంగుల దీపాలతో రోడ్లను అలంకరించారు.. బ్యాండ్ మేళాలు ..బాజా భజంత్రీలు సంగతి ఇక చెప్పనక్కర్లేదు ..70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పెద్ద హాల్స్…. మరొక పక్క విశాలమైన కల్యాణమండపం నిర్మించారు. ఆ పక్కనే విశాలమైన 10 డైనింగ్ హాళ్లు, ప్రతిదాంట్లో  25,000 మంది కూర్చొని భోజనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు .. విఐపిలకు ప్రత్యేక వసతులు కల్పించారు. 

వారం ముందు నుంచే  మద్రాస్ మునిసిపల్ కార్పొరేషన్ కి చెందిన వందలాది మంది సిబ్బంది ఈ స్థలాన్ని చదును చేశారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్లను విస్తరించారు. తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డ్ విద్యుత్ సరఫరా చేయడానికి ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్‌ లను ఏర్పాటు చేసింది. ఏడు లక్షల లీటర్ల నీటిని మెట్రోవాటర్ శాఖ  వాటర్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసింది. పెళ్లి కటౌట్లను రవాణా చేయడానికి ప్రభుత్వ వాహనాలను ఏర్పాటుచేశారు.వాటిని అమర్చడానికి ప్రత్యేక సిబ్బందిని పెట్టారు.

లక్షకు పైగా రిటర్న్ గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అందుకోసం అప్పట్లో రూ. 16 లక్షలు ఖర్చు పెట్టారట. అంతకుముందు VIP లకు ఆహ్వానాలతోపాటు వెండి ప్లేట్, పట్టు చీర, పట్టు ధోతీలు పంచారు. ఒక్కొక్క ప్యాక్ ఖరీదు  2౦ వేలు కాగా 1,000 మంది వీఐపీలను ఆహ్వానించారు.

ఇక చవులూరించే వంటకాలు.. స్వీట్లు,హాట్లు,కూల్ డ్రింక్స్ సంగతి చెప్పనక్కర్లేదు.VIP భోజనం కోసం వందరూపాయలు వెచ్చించగా … 1,10.000 మంది పార్టీ సభ్యులకు భోజనం కోసం ఒక్కొక్కరికి రూ. 40.ఖర్చుపెట్టారు. చెన్నైలోని  టాప్ హోటళ్లలో దాదాపు 1,000 గదులు VIPల కోసం రిజర్వ్ చేశారు.ఒక్కో గదికి సగటు అద్దె రూ. 3,౦౦౦ మాత్రమే. రోజుకు రూ.1100 చొప్పున అద్దెకు  దాదాపు 300 ఎయిర్ కండిషన్డ్ కార్లను అద్దెకు తీసుకున్నారు. 

తమిళనాడు లోని మారు మూల పల్లెల నుంచి కూడా ఈ పెళ్ళికి జయ అభిమానులు తరలి వచ్చారు. 7-8 గంటలు కూడా ప్రయాణించి జయ దత్తపుత్రుడి వివాహానికి జనం వచ్చ్చారని అప్పటి పత్రికలు రాశాయి. ఈ పెళ్లి తమ కుటుంబంలోనే జరుగుతున్నట్టు ప్రతి కార్యకర్త భావించాలని అప్పట్లో జయలలిత ప్రకటించారు. దీంతో జనాలు పెళ్లి చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. భద్రతా ఏర్పాట్లు చేయలేక పోలీసులు అల్లాడిపోయారు.

అప్పట్లో ఈ పెళ్లిపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు కురిపించాయి. కాంగ్రెస్ మినహా ఇతర పార్టీలు జయపై దుమ్మెత్తి పోశాయి. జయలలిత  సీఎం గా రూపాయి జీతం తీసుకుంటూ కోట్లు ఖర్చుపెట్టి దత్త పుత్రుడి వివాహం ఎలా జరిపించారని ప్రశ్నలు సంధించాయి. జయలలిత ఏ ఒక్క విమర్శకు జవాబు చెప్పలేదు. సైలెంట్ గా ఉన్నారు.

కొన్ని రోజుల పాటు చర్చ నడిచింది. దేశంలో జరిగిన అతి ఖరీదైన పెళ్లిళ్లలో ఈ పెళ్లి ఒకటి అని ఇప్పటికి చెప్పుకుంటారు. ఈ పెళ్లి సందర్భంగా జయలలిత ప్రభుత్వ శాఖల అధికారులను .. సిబ్బంది ని సొంత పనుల కోసం వాడుకున్నారని 48 మంది న్యాయవాదులు మద్రాసు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అపుడు ఈ విషయాలన్నీ బయట పడ్డాయి. 

———-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!