ముందెన్నడూ లేని విధంగా ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీ లో దూకుడుగా వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ వర్గాల్లో ఆనందం వ్యక్తమౌతోంది. ఆయన అభిమానులైతే సంబరపడుతున్నారు. చంద్రబాబు ఇదే శైలి లో వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ దే విజయమని చెప్పుకుంటున్నారు. నేతల తీరుని బట్టీ కార్యకర్తలు కూడా దూసుకుపోతుంటారు. ఏపార్టీలో అయినా ఇది సహజమే. ఈ సారి అసెంబ్లీ లో బాబు మహా దూకుడు గా ఉన్నారు. స్పీకర్ మైక్ ఇవ్వలేదని పోడియం వద్ద కెళ్లి భైఠాయించారు. గతంలో ఎప్పుడు చంద్రబాబు పోడియం వద్దకు వెళ్లిన దాఖలాలు లేవు. ఈ సారి చంద్రబాబు అధికారపక్షం పై అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడ్డారు. సభలో అవకాశం దొరక్కపోతే, బయట కొచ్చి మీడియా ముందు విమర్శలు గుప్పిస్తున్నారు.
‘ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలుగా వచ్చినవాళ్లు ఏదేదో చేస్తున్నారు..’ అంటూ సీఎం జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి ‘బీ కేర్ ఫుల్’ అని బాబు హెచ్చరికలు కూడా చేశారు. తాను 40 ఏళ్లు హుందాగా రాజకీయం చేశానని చెప్పుకొచ్చారు. సభలో బాబు పలు మార్లు ఆవేశంతో ఊగిపోతూ కనిపించారు.
విద్యుత్ సవరణ బిల్లు, అసైన్డ్ భూములు లీజు అంశాలపై చర్చించడానికి చంద్రబాబు కి అవకాశం ఇవ్వకపోవడంతో వ్యూహాత్మకంగా సభ నుంచి వాకౌట్ చేశారు. అదే సందర్భంగా బాబు మాట్లాడుతూ.. జగన్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.అసైన్డ్ భూముల చట్టానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని.. ఆ భూములు ఇచ్చిన రైతుల నుంచి మళ్లీ తీసుకోవడం చట్ట విరుద్దమన్నారు. ఎస్సీ రైతులను ఇబ్బంది పెడుతున్నారని.. ప్రభుత్వం పేదవారి పొట్ట కొడుతోందని బాబు ఆరోపించారు ముఖ్యమైన బిల్లుపై మాట్లాడతానంటే ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వక పోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని, బాధ్యత లేని విధంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని తమ్మినేనిపై ఆరోపణలు చేశారు. మొత్తానికి ఈ సారి అసెంబ్లీలో బాబు భిన్నంగా వ్యవహరించారు. ఈ తరహా దూకుడు కరెక్ట్ అని తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు అంటున్నారు.
ఇక ఇదే విషయమై వైసీపీ నేతలు మాట్లాడుతూ బాబు 40 ఏళ్ళ అనుభవం ఉన్న నేతలా వ్యవహరించలేదని విమర్శిస్తున్నారు. బాబు లో ఏదో ఫ్రస్టేషన్ కనిపిస్తోందని … సభలో మైనారిటీ సభ్యుడైన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను వేలు చూపిస్తూ బెదిరించి … ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రతిపక్ష నేతకు తగదని అంటున్నారు. ప్రతిపక్ష నేత తమ పార్టీ సభ్యుల చేత మాట్లాడిస్తూ .. అవసరమైన సందర్భాల్లో కలుగ జేసుకుంటారు. కానీ చంద్రబాబు ప్రతి అంశంలో కలుగ జేసుకుంటూ మైక్ ఇవ్వలేదని ఆరోపణలు చేయడం సరికాదని వైసీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు సభ గైడ్ లైన్స్ తెలిసి కూడా ప్రతి అంశానికి అడ్డం పడుతూ … సభ్యులచే నినాదాలు చేయించడం .. సభను ఆపే యత్నాలు చేయడం శోచనీయమని వ్యాఖ్యానిస్తున్నారు. బాబు అసెంబ్లీకి ప్రజాసమస్యలపై చర్చించడానికే వచ్చారా? ఆయన వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది .. బుర్ర ఉండి మాట్లాడుతున్నారా? కనీస ఇంగిత జ్ఞానం ఉందా?’ అని బాబు తీరును సీఎం జగన్ సభలోనే ఎండగట్టారు. మొత్తం మీద ఈ సారి సమావేశాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, వాగ్యుద్ధాలతో సభ విలువైన సమయం వృధా అయిందన్నమాట నూరు శాతం నిజం.
———– KNM