ఫ్రెండ్స్ కోసం చిరు సినిమా.. అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ !!

Sharing is Caring...

Successive hit movies during that time………………….

చెన్నై ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో  తనతో పాటు శిక్షణ పొందిన సహనటులు ..  తన స్నేహితులు సుధాకర్‌, హరిప్రసాద్‌ ల కోసం చిరంజీవి యముడికి మొగుడు సినిమా చేసి పెట్టారు. మిత్రులు అడగగానే కాల్ షీట్స్ ఇచ్చి స్నేహం గొప్పతనాన్ని చాటారు. తనతో 1984 లో  ‘దేవాంతకుడు’ చిత్రాన్ని నిర్మించిన నటుడు నారాయణరావు ను కూడా ఈ చిత్రనిర్మాణంలో భాగస్వామిని చేశారు.

అప్పట్లో ఈ సినిమా ఆశించిన దానికంటే అద్భుతమైన విజయాన్ని సాధించింది. రూ.87 లక్షలతో ఈ చిత్రాన్ని నిర్మించగా  రూ.5 కోట్లకు పైగా వసూలు చేసింది.1987లో ‘పసివాడి ప్రాణం’ చిత్రంతో హిట్ కొట్టిన  చిరంజీవి.. వెంటనే 1988 లో ‘యముడికి మొగుడు’ చిత్రంతో మరో బిగ్ హిట్ కొట్టారు. ఈ రెండు సినిమాల్లో విజయశాంతి హీరోయిన్ గా నటించారు.

1978లో విడుదలైన హాలీవుడ్ మూవీ  ‘హెవెన్ కెన్ వెయిట్’ ఆధారం గా ఈ సినిమా కథను రూపొందించారు. రచయిత మధు తో కలసి రచయిత సత్యానంద్ ‘యముడికి మొగుడు’ కథను తయారుచేశారు. తెలుగు నేటివిటీ కి దగ్గరగా మార్పులు చేర్పులు చేశారు. నాటి ప్రముఖ రచయిత యమగోల సినిమాకు మాటలు రాసిన  డీవీ నరసరాజు  సలహాలు తీసుకున్నారు. సబ్జెక్ట్ బాగుందని నరసరాజు చెప్పడంతో స్క్రిప్ట్ రూపొందించారు.

ఈ సోషియో ఫాంటసీ సినిమా తర్వాత కాలంలో మరిన్ని సినిమాలకు  స్ఫూర్తిగా నిలిచింది. చిరంజీవి నటన, డాన్స్, ఫైట్స్, కామెడీ ప్రేక్షకులను అలరించాయి. చిరంజీవి ద్విపాత్రాభినయంతో రూపొందిన  ‘యముడికి మొగుడు’ చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. రవిరాజా తనదైన శైలిలో జనాలను ఆకట్టుకునే విధంగా కథను తెర కెక్కించారు. చిరు రవిరాజా కాంబినేషన్ లో యముడికి మొగుడు మూడో సినిమా. రవి రాజా కు కూడా ఈ సినిమా పెద్ద హిట్ అనే చెప్పుకోవాలి. 

ఈ సినిమాకు రాజ్-కోటి  ద్వయం సంగీతం అందించారు. వారి బాణీలకు వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యం సమకూర్చారు.  బహుశా నిన్ను బందరులో చూసివుంటా; అందం హిందోళం… అధరం తాంబూలం;ఎక్కు బండెక్కు వానజల్లు గిల్లుతుంటే…  కన్నెపిల్లతోటి వచ్చెనమ్మా …   నాట్యమిదా అంటూ సాగే పాటలు ప్రేక్షకులను అలరించాయి.

ఇందులో యముడిగా సత్యనారాయణ మరోసారి తన సత్తా చాటుకున్నారు. విజయశాంతి, రాధ కథానాయికలుగా నటించారు. ఇక అల్లు రామలింగయ్య, సుత్తివేలు, రావు గోపాలరావు, గొల్లపూడి మారుతీరావు, కోట శ్రీనివాసరావు, సుధాకర్, ప్రసాద్ బాబు, సూర్యకాంతం, అన్నపూర్ణ, వై.విజయ, మమత, నిర్మల, ప్రియాంక, హరిప్రసాద్, శివప్రసాద్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

చిత్రగుప్తుడిగా అల్లు .. విచిత్ర గుప్తుడిగా వేలు సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమానే తర్వాత కాలంలో తమిళం లో రజనీ కాంత్ తో తీశారు అక్కడ కూడా హిట్ అయింది. 36 ఆరేళ్ళ క్రితం నాటి సినిమా అయినా ఇప్పటికి కొత్త సినిమా లాగానే ఉంటుంది. సినిమా చూడని వారు యూట్యూబ్ లో ఉంది చూడవచ్చు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!