ఎవరీ చింతామణి ? ఎందుకు నిషేధించారు?

Sharing is Caring...

Bhandaru Srinivas Rao ……………………………… 

ప్రముఖ రచయిత కాళ్ళకూరు నారాయణ రావు గారు రెండు నాటకాలు రాసారు వొకటి ‘చింతామణి’ రెండోది ‘వర విక్రయం’. ఇవి రాసి ఎనభయి ఏళ్ళు అయిందేమో. ఇంకా వందేళ్ళు పూర్తి కాలేదు. ఆ రోజుల్లో జటిలంగా వుండే రెండు సామాజిక సమస్యలను తీసుకుని ప్రజల్లో చైతన్యం రగిలించేందుకు వీటిని రాసారు. గురజాడ అప్పారావుగారి కాలంలో ‘కన్యాశుల్కం’ వుంటే కాళ్ళకూరి వారి సమయంలో వరకట్నం సమస్య బాగా ప్రబలివుంది.

‘వర విక్రయం’ ఎందుకో కాని, స్టేజి మీద పాపులర్ కాలేదు. బెజవాడ రేడియోలో నండూరి సుబ్బారావు, శ్రీరంగం గోపాలరత్నం, చిరంజీవిరావు వాళ్ళు వేసారు. చాలా సార్లు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు వర విక్రయం నాటకం ప్రసారం చేశారు. సింగరాజు లింగరాజు మరిచిపోలేని లోభి క్యారెక్టర్ వేసేవారు. రెండో నాటకం ‘చింతామణి’ బాగా పాపులర్ అయింది. ‘కురుక్షేత్రం’, ‘రామాంజనేయ యుద్ధం’ వంటి నాటకాలు పోయినా అడపా తడపా ఇంకా ఆడుతున్న నాటకం ‘చింతామణి’.

కథా వస్తువు చిన్నదే. చింతామణి ఓ సంస్కారమున్న వేశ్య. చదువు కొన్నది. విద్యా వంతులంటే వల్లమాలిన అభిమానం. ఆ ఊళ్లోనే భవానీ శంకరుడనే జల్సా రాయుడు వుంటాడు. అతను తనకున్నదంతా చింతామణికి సమర్పించుకొని జులాయిగా తిరుగుతూ ఉంటాడు. చింతామణి అమ్మ శ్రీహరి. వాళ్ళ ఇంటికి వచ్చే విటులందరికి శ్రీహరి అంటే భయం. ఏ రోజు ఎకౌంటు ఆ రోజే తేల్చి వేస్తుంది. మర్నాడు మళ్ళీ డబ్బు దశకం తెస్తేనే ఇంట్లోకి అడుగు పెట్టనిచ్చేది.

కొన్నాళ్ళకు భవాని శంకరుడి దగ్గర మొత్తం సొమ్ము అయిపోవడంతో వెళ్ళగొడుతుంది. ఇతనికో మిత్రుడు వున్నాడు బిల్వమంగళుడు. అందమైన వాడు. విద్యా వంతుడు. ఆస్తి పరుడు. అన్నిటికి మించి మంచి ప్రవర్తన వున్నవాడు. భవానీ శంకరుడు ఓ సారి చింతామణి దగ్గర బిల్వమంగళుడి ప్రసక్తి తీసుకు రావడం, అతన్ని ఎలాగయినా ఓ మాటు ఇంటికి తీసుకురమ్మని ఆమె కోరడం, చింతామణి ప్రాపకం కోసం భవానీ శంకరుడు ఒక రోజు బిల్వ మంగళుడిని చింతామణి ఇంటికి తీసుకురావడం, క్రమేపీ వారిద్దరి మధ్య అనుబంధం ఏర్పడడం, చివరికి చింతామణి పశ్చాత్తాప పడడం ఇలా నాటకం నడుస్తుంది.

పెద్ద పాత్రలు ఏమీ లేవు కూడా. చింతామణి, బిల్వమంగళుడు, భవానీ శంకరుడు, చింతామణి తల్లి శ్రీహరి, చెల్లెలు చిత్ర, బిల్వమంగళుడి భార్య రాధ, అతడి స్నేహితుడు దామోదరుడు. ఇంతవరకు బానే వుంది సుబ్బిశెట్టి అనే మరో పాత్ర ఈ నాటకానికి జీవం పోసింది. అదే ఇప్పుడు చింతామణి నాటకాన్ని వివాదాస్పదం చేస్తోంది. చింతామణి మీద మోజుతో వున్నదంతా పోగొట్టుకున్న సుబ్బిశెట్టి చివర్లో తిరగేసిన జల్లెడలో పెసర పునుకులు, మసాలా వడలు పెట్టుకుని బజార్లవెంట తిరుగుతూ అమ్ముకునే దుస్తితికి దిగజారిపోతాడు.

భవాని శంకరుడు బ్రాహ్మణుడు కాబట్టి నీళ్ళకావిళ్ళు మోస్తూ ‘తాతలనాటి క్షేత్రములు తెగనమ్మి దోసిళ్ళతో తెచ్చి ధారపోసినాను, అత్తవారిచ్చిన అంటు మామిడితోట నీవు కోరగనే రాసి ఇచ్చినాను’ అంటూ గతాన్ని తలచుకుంటూ పద్యాలు పాడుకుంటూ వుంటాడు. ఇంతవరకు బానే వుంది సుబ్బిశెట్టి అనే పాత్ర ఈ నాటకానికి జీవం పోసింది.

అదే ఇప్పుడు చింతామణి నాటకాన్ని వివాదాస్పదం చేస్తోంది. కాళ్ళకూరి వారు రాసిన ఉద్దేశ్యం మంచిదే అయివుండవచ్చు కానీ, కాలక్రమంలో జనాలను ఆకట్టుకోవడం కోసం సుబ్బిశెట్టి, చిత్ర, శ్రీహరి పాత్రల నడుమ మోటు సరసం, ముతక హాస్యం ప్రవేశపెడుతూ వచ్చారు.ఓ దశలో అది సభ్యత హద్దులు దాటిపోయి కుటుంబపరంగా చూడడం సాధ్యం కాకుండా పోయింది.

కాళిదాసు కోటేశ్వరరావు అనే ఆయన సుబ్బిశెట్టి వేషం వేసేవారు. సూరవరపు వెంకటేశ్వర్లు శ్రీహరి వేషం కట్టేవారు. నాటకాల తొలి రోజుల్లో ఆడ పాత్రలు నటీమణులు దొరక్క మొగవాళ్ళే ఆడవేషాలు వేయాల్సివచ్చేది. సూరవరపువారు ‘హరిశ్చంద్ర’ లో కాలకౌసికుడి భార్య కలహకంటిగా, ‘సక్కుబాయి’లో అత్తగా పెద్ద పేరు సంపాదించుకొన్నారు.

కాళిదాసు, సూరవరపు కాంబినేషన్ ఎప్పుడు హద్దులు దాటలేదు. శ్రీ రామనవమికి బెజవాడ బీసెంటు రోడ్డులో ఏటా ‘చింతామణి’ నాటకం వేసేవారు. ఆ రోడ్డులో నిజానికి ఎక్కువమంది వ్యాపారుల దుకాణాలు ఆర్య వైశ్యులవే. అరవపల్లి సుబ్బారావు అనే ఆయన సుబ్బిశెట్టి వేషం వేసేవారు. కాకపొతే, కారణాలు ఏమయినా ఈ నాటకంలో పోను పోను అశ్లీల సంభాషణలు, సినిమా డైలాగులు, పాటలు పెట్టి నాటకం స్తాయిని దిగజార్చారు.

ఇప్పుడు ఆర్య వైశ్య మహా సభ అభ్యంతరం చెప్పిందంటే నిజమే మరి. నాటకాన్ని నిషేధించాలా లేక ఇటువంటి ద్వందార్ధ సంభాషణలు లేకుండా చూస్తామని ఆపేస్తామని నాటక సమాజాలు, నటులు హామీ ఇస్తారా చూడాలి. అంత వరకు కాళ్ళకూరి వారికి క్షమాపణలు చెప్పి ‘చింతామణి’కి కొన్నాళ్ళు రెస్ట్ ఇవ్వడం మంచిదేమో. 

——– 

ఈ రచయిత ఎప్పుడో సూచించినట్టుగా ‘చింతామణి’ కి శాశ్వతంగా రెస్ట్ ఇచ్చారు. తాజాగా చింతామణి నాటకాన్ని ఏపీలో నిషేధించారు. ప్రభుత్వం ఈమేరకు జీవో జారీచేసింది.

post upadated on 18-1-2022

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!