సుమారుగా 50 ఏళ్ళ క్రితం నిర్మించిన ‘పాపం పసివాడు’ అప్పట్లో సూపర్‌హిట్ సినిమా. ఎడారిలో చిక్కుకుపోయిన ఒక బాలుడి చుట్టూ అల్లిన కథ ఇది. రాజస్థాన్ థార్ ఎడారుల్లో అధిక భాగం షూటింగ్ చేశారు. హీరో కృష్ణ నిర్మించిన మోసగాళ్లకు మోసగాడు తర్వాత రాజస్థాన్ ఎడారుల్లో తీసిన సినిమా ఇదే.
“లాస్ట్ ఇన్ ది డెసర్ట్” దక్షిణాఫ్రికా చిత్రం ‘పాపం పసివాడు’ సినిమాకు మాతృక. గొల్లపూడి మారుతీరావు మూల కథ కు కొన్నిమార్పులు చేర్పులు చేసి సెంటిమెంట్, విలనిజం, థ్రిల్లింగ్ సన్నివేశాలతో స్క్రిప్ట్ తయారు చేసారు. దర్శకుడు సూచనలతో 90 నిమిషాల ఆంగ్ల చిత్రం ..139 నిమిషాల నిడివి గల తెలుగు చిత్రంగా రూపొందింది.
దర్శకుడు రామచంద్రరావు ఈ కథను అద్భుతంగా తెరపైకెక్కించారు. గొల్లపూడి డైలాగ్స్ కూడా రాశారు.ఈ సినిమా అసలు హీరో సినిమాటోగ్రాఫర్ ఎం కన్నప్ప. ఈస్ట్‌మన్ కలర్‌లో ఎడారి సీన్స్ ను కన్నప్ప సూపర్ గా చిత్రీకరించారు. థార్ ఎడారిలో వరుసగా 27 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. 35 మంది యూనిట్ సభ్యులు.. నటుడు, మాస్టర్ రాము అతగాడి వెంట ఉండే కుక్క సామ్ తహశీల్ గ్రామం వెలుపల వేసిన టెంట్లలో బస చేసారు.
అక్కడికి సమీపంలోనే షూటింగ్ లొకేషన్ ఉండేది. లొకేషన్ కి యూనిట్ సభ్యులు ఒంటెల మీద వెళ్లే వారు. 53 డిగ్రీల సెల్సియస్ వద్ద మండే ఎండల్లో మార్చి నెలలో షూటింగ్ జరిగింది. రోజూ ఉదయం 8-11 నుంచి సాయంత్రం 4-7 గంటల మధ్య రెండు సెషన్ల లో చిత్రీకరణ చేసేవారు.తమిళనాడులోని ముదుమలైలో అటవీ సన్నివేశాలను చిత్రీకరించారు. ఎడారిలో మాస్టర్ రాముని .. కుక్కను వెంబడించే హైనా ను ఉదయపూర్‌లోని ఒక సర్కస్ కంపెనీ నుండి అద్దెకు తీసుకొచ్చారు.
సినిమా 1972 లో విడుదల అయింది. ఎస్వీఆర్, ప్రభాకర్ రెడ్డి, నగేష్, సత్యనారాయణ, దేవిక తదితరులు నటించారు. అమ్మా చూడాలి పాట ఎవర్ గ్రీన్ సాంగ్.సత్యం మ్యూజిక్ బాగుంటుంది.
మాస్టర్ రాము అనే చుక్కల వీర వెంకట రాంబాబు విజయవాడకు చెందిన బాలుడు. శివాజీ గణేశన్, జయలలిత నటించిన ఎంగ మామ (1970)తో బాలనటుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. తర్వాత నిండు హృదయాలులో నటించాడు. పాపం పసివాడు తో బాలనటుడిగా ఆదరణ పొందాడు. మరెన్నో సినిమాల్లో నటించాడు. అప్పట్లో ఈ సినిమా పాంప్లెట్స్ ను హెలికాప్టర్ ద్వారా పలు పట్టణాల్లో విసిరారు.
ఇక సినిమా నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు గురించి కూడా రెండు మాటలు చెప్పుకోవాలి. థియేటర్ ఆపరేటర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత ఫిల్మ్ రిప్రజెంటేటివ్‌గా, లైన్ ఇన్‌స్పెక్టర్‌గా, పబ్లిసిటీ ఇన్‌ఛార్జ్‌గా, ప్రొడక్షన్ మేనేజర్‌గా అట్లూరి పనిచేశారు. ఆ అనుభవంతో నిర్మాతగా మారి అగ్గి మీద గుగ్గిలం .. ఉక్కు పిడుగు సినిమాలు నవభారత్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు.
శ్రీ లక్ష్మీ ప్రొడక్షన్స్ ప్రారంభించి రౌడీ రాణి తీసి హిట్ కొట్టారు. ఆ తర్వాత పాపం పసివాడు తీశారు. బాల నటుడితో తీసిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది. తర్వాత కాలంలో అట్లూరి తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో మరెన్నో హిట్ సినిమాలు కూడా నిర్మించారు. 2017 లో ఆయన కన్నుమూశారు. యూట్యూబ్ లో ఈ సినిమా ఉంది .. చూడని వాళ్ళు చూడవచ్చు.
———KNM