రాజ్యాంగాన్ని మార్చాలా ? నేతల తీరు మారాలా ?

Sharing is Caring...

Govardhan Gande……………………………………….

రాజ్యాంగం అంటే..ఓ పుస్తకం మాత్రమేనా? కాదు. అది దేశానికి మార్గదర్శి. అది చూపిన మార్గాన్ని అనుసరించడమే పాలక వ్యవస్థ బాధ్యత. అంతే కదా.అది నిర్దేశించిన ప్రకారం పాలన సాగిస్తూ సామాజిక సమతను సాధించడం పాలక వ్యవస్థ కర్తవ్యం. కానీ వాస్తవ స్థితి అలాగే ఉన్నదా?అలా కనిపించడం లేదు.

రాజ్యాంగం అమలులోకి వచ్చి 72 సంవత్సరాలు గడిచిపోయాయి.కానీ పెద్దగా మార్పు రాలేదు.సామాజిక అంతరాలు తొలిగిపోలేదు.మరింతగా పెరిగిపోయాయి.1950 తో పోల్చితే దేశంలో సంపద భారీ స్థాయిలోనే వృద్ధి చెందింది. కానీ పేదల సంఖ్య కూడా భారీగానే పెరిగిపోయింది.పౌస్థికాహారం అనేది ఓ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.

కోట్లాది మందికి అసలు ఆహారమే లభించడం లేదు.ఫలితంగా ఆకలి చావులు పెరిగి పోయాయి.చదువు అందరికీ లభించడం లేదు.వైద్యం కొనుగోలు సరుకుగా మారిపోయింది.సరైన వైద్యం లభించక లక్షలాది అర్ధాంతర మరణాలు సంభవిస్తున్నాయి.ఈ సంగతులను ఐక్య రాజ్య సమితికి అనుబంధంగా ఉండే అనేక అనేక అంతర్జాతీయ సంస్థలు నిర్వహించిన అనేక సర్వేలు, నివేదికలు స్పష్టంగా చెబుతున్నాయి.

కారణం ఏమిటి?రాజ్యాంగ వైఫల్యం కాదు.దాన్ని అమలు చేయడంలో రాజకీయ నాయకత్వానికి నిజాయితీ, చిత్తశుద్ధి లోపించడం.తాము రాజ్యాంగం ద్వారానే అధికారం పొందుతున్నాం అని అది ప్రజలు వేసిన ఓట్ల భిక్ష అని రాజకీయ నాయకత్వం మరచిపోవడం కారణం అని చెప్పాలి.తాము ప్రజాసేవకులం కాదు అని రాజులం అనే అహంభావం ఇందుకు కారణం.అంటే విఫలమైనది రాజ్యాంగం కాదు అనే కదా అర్ధం.మొత్తంగా అమలు కాలేదని చెప్పడం లేదు.

రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత కొంత మార్పు వచ్చిన మాట నిజమే.అది చాలదు.రాజ్యాంగ నిర్మాతల లక్ష్యం అది కాదు కదా.సంపూర్ణ సమత రాసిన వారి దూరదృష్టి, లక్ష్యం. దాని కోసం చాలా కట్టుదిట్టమైన నిబంధనలు రూపొందించారు. వాటిని పాటించడంలో నిజాయితీతో కూడిన ప్రయత్నాలు ఏమీ చేయకుండా రాజ్యాంగాన్ని నిందించడం ఎలా సబబు?కొత్త రాజ్యాంగాన్ని రాయాలని తెలంగాణ ముఖ్యమంత్రి KCR చేసిన ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా రాజకీయ నాయకత్వంలో ఈ అంశం తీవ్ర దుమారాన్నే లేపింది.

ఇప్పటికే రాజ్యాంగానికి 105 సవరణలు జరిగిన విషయం తెలిసిందే. కాలానుగుణంగా మారిన సామాజిక స్థితిగతులకు వీలుగా సవరణలు జరిగాయి. ఇందులో అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదు.సమాజ హితం కోసమే రాజ్యాంగం నిర్మించుకున్నారు కాబట్టి ఆ సమాజం కోసం సవరణలు అనివార్యమే అయినపుడు మార్పు తప్పదు కదా.రాజ్యాంగం రాసిన నాటి స్థితిగతులు ఈ రోజు లేవు/ఉండవు కదా.అయితే ఇక్కడ కొత్త రాజ్యాంగం అన్న ప్రతిపాదనే దుమారానికి కారణం.

ఇప్పుడు దేశాన్ని ఏలుతున్న బీజేపీ కి ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉన్నది.అది వారు దాచుకున్న సంగతి ఏమీ కాదు.రాజ్యాంగ నిర్మాణ సమయం నుంచే దానిలోని ప్రతిపాదనలు పట్ల బీజేపీ మాతృ సంస్థ ఆరెస్సెస్ పలు అభ్యంతరాలను వ్యక్తం చేసిన సంగతి కూడా బహిరంగ రహస్యమే.వారికి దీనిపై విశ్వాసం లేదన్న సంగతి బహిరంగ రహస్యమే.ఇప్పటి బీజేపీ నాయకుల్లో కొందరు ఈ మాటను అపుడపుడూ బహిరంగంగానే చెప్పిన సంగతి కూడా అందరికీ తెలుసు.

అయితే వారి వైఖరికి భిన్నంగా కేసీఆర్ చేసిన ప్రతిపాదనపై యాగీ చేయడమే ఆశ్చర్యం కలిగిస్తున్నది. అయితే కేసీఆర్ ప్రతిపాదనపై దుమారం రేగడానికి కారణం టీఆరెస్ తో బీజేపీకి ఉన్న రాజకీయ వైరమే కారణం అని కూడా అందరికీ అర్ధమై ఉంటుంది.తెలంగాణలో ఎలాగైనా అధికారం పొందాలనే కసి కాంక్షలతో ఉన్న బీజేపీ కేసీఆర్ ప్రతిపాదనను వివాదంగా మార్చడంలో వింత కూడా ఏమీ లేదు.

దేశాన్ని సుమారు 50 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ కూడా కేసీఆర్ ప్రతిపాదనను తీవ్రంగానే చూస్తున్నది. మరో వైపు దేశంలో బీజీపీ వ్యతిరేక పక్షాల నుంచి కేసీఆర్ ప్రతిపాదనకు మద్దతు లభిస్తున్నది. ఇక ఇప్పటి రాజ్యాంగంపై కమ్యూనిస్టులకు కూడా పలు అభ్యంతరాలున్నాయి.అయితే విఫలమైంది రాజ్యాంగమా లేక దాన్ని రాజకీయ నాయకత్వం విఫలమయ్యేట్లు చేసిందా అనే అంశంపై దేశవ్యాప్త విస్తృత చర్చ అయితే అనివార్యం అని చెప్పాలి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!