Mohammed Rafee ……………
చట్టాల విషయంలో అప్పుడప్పుడు వింటూనే ఉంటాం… బ్రిటిష్ కాలం నాటి బూజు పట్టిన చట్టాలను నేటి కాలానికి అనుగుణంగా మార్చండ్రా బాబూ అనీ! కానీ, ఈ ఒక్క చట్టం మార్చాల్సిన అవసరం లేదు! అదే సెన్సార్ బోర్డు చట్టం! సినిమాలను నియత్రించే చట్టం! అయినా 1983లో కొన్ని నిబంధనలను చేర్చారు. నియమ నిబంధనలు బావున్నాయి!
2004 నుంచి మరింత కఠినతరంగా మార్చారు! కానీ, ఆ చట్టం కాదు కానీ, ఆ బోర్డు చుట్టూ రాజకీయాలే ఆశ్చర్యం కలిగిస్తుంటాయి! నియామకాలైతే పెద్ద జోక్ అనే చెప్పుకోవాలి. నియమాలను నిబంధనలను తుంగలో తొక్కేస్తుంటారు! ప్రధాన కారణం సెన్సార్ బోర్డు సభ్యులే! గత పదిహేనేళ్లుగా సెన్సార్ బోర్డు సభ్యుల నియామకం ఎలా మారిందంటే రాజకీయ పునరావాస కేంద్రం అయిపోయింది!
“పాపం ఇతను మన పార్టీయేనండి. ఎన్నో ఏళ్లుగా కార్యకర్తగా మిగిలిపోయాడు. సెన్సార్ బోర్డు మెంబర్ గా వేసేయండి” అనగానే ఆ అధికార పార్టీ ఎంపి సంతకం చేసేస్తారు! కేంద్ర సమాచార శాఖకు సిఫారసు చేస్తూ ఉత్తరం పంపిస్తే, కేంద్ర సెన్సార్ బోర్డు పది రోజుల్లో అతనికి నియామక పత్రం పంపిస్తుంది! అంతే అతనికి లేదా ఆమెకు సినిమా సెన్సార్ చేసేందుకు ప్రత్యేక అర్హత అంటూ ఏమీ అక్కరలేదు!
అసలు సినిమా పట్ల సమాజం పట్ల ఏదైనా అవగాహన ఉందా లేదా అనవసరం! అదొక హోదా కావాలి అంతే! కేంద్ర రాజసింహాల ఎంబ్లమ్ తో దర్జాగా విజిటింగ్ కార్డు వేసుకోవచ్చు! తాటికాయంత అక్షరాలతో సెన్సార్ బోర్డు మెంబర్ అని కారుకు విఐపి బోర్డు తగిలించుకోవచ్చు! ఇక సినిమా సెన్సార్ బోర్డు లో ప్రాంతీయ, కేంద్ర విభాగాలు ఉంటాయి. ముంబైలో బాలీవుడ్ సినిమాలకు సెన్సార్ జరుగుతుంది.
హైదరాబాద్, చెన్నై, తిరువునంతపురం, బెంగళూరు, కోల్ కతా లలో ప్రాంతీయ సెన్సార్ బోర్డులు ఉంటాయి. సెన్సార్ బోర్డు సభ్యుల పదవీ కాలం రెండేళ్లు! నచ్చితే మన అనుకుంటే అదనంగా ఇంకో రెండేళ్లు పొడిగిస్తారు. ఎలాంటి జీతం ఉండదు. అదనపు హంగులు ఉండవు కానీ, సినిమా సెన్సార్ చేస్తే 1200 నుంచి 1500 ఇస్తున్నారు ప్రాంతాలను బట్టి! మూడు నెలకొకసారి సినిమా సెన్సార్ చేసే అవకాశం ఇస్తారు.
సంబంధిత అధికారులను కాస్త ప్రసన్నం చేసుకోగలిగినా లేదా పైనుంచి ఫోన్ చేయించుకోగలిగితే నెలకొకసారి గ్యారంటీగా అవకాశం ఇస్తారు! ఒకప్పుడు ఒక్కో ప్రాంతీయ సెన్సార్ బోర్డుకు 15 నుంచి 50 మంది వరకు సభ్యులు ఉండేవారు! ఇప్పుడు ఆ సంఖ్య మూడు వందల నుంచి 400 వరకు చేరింది!
గతంలో బాగా తెలిసిన వాళ్ళను అవగాహన వున్న వారిని, సినిమా పరిజ్ఞానం కలిగిన వారిని, సమాజం పట్ల బాధ్యత వున్న వారిని సభ్యులుగా నియమించేవారు! ఇప్పుడలా కాదు! భాష రాని వాళ్ళు కూడా సభ్యులే! తెలుగు తెలియని రాయలేని చదవలేని వాళ్ళు కూడా మన సెన్సార్ బోర్డు సభ్యులే! కనీసం సినిమా చూసి అందులో ఏది సమాజానికి హానికరం అని తెలుసుకునే అవగాహన కూడా ఉండదు చాలామందికి!
ఒక పాతిక మందిని స్క్రీనింగ్ కు పిలుస్తారు. అందులో ఇద్దరో ముగ్గురో కాస్త నోట్ చేసుకుని సబ్జెక్ట్ పై చర్చ చేసి అభ్యంతరం తెలిపే వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళు అంతా సినిమా చూసేసి సమోసాలు తినేసి, కూల్ డ్రింకులు, కాఫీలు తాగేసి, ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ చేసేసి, అధికారికంగా ఇచ్చే ఆ కొద్దిపాటి భత్యం తీసుకుని బయటపడే వాళ్లే అధికంగా ఉంటారు!
అలా తయారయ్యాయి సెన్సార్ బోర్డులు! అయినా వాళ్ళేం చేయగలరు! అవి కేంద్ర అధికార పార్టీ రాజకీయ పదవుల పందేరాల అడ్డాగా మారిపోతే అధికారులు ఏం చేయగలరు? అందుకే ఇటీవల కాలంలో వరసగా అడ్డమైన సినిమాలు ఆంబోతుల్లా సమాజంపైకి వచ్చేస్తున్నాయి! సెన్సార్ సర్టిఫికేట్ కు అర్ధమే మారిపోయింది.
ఏది అడల్ట్, ఏది పిల్లలతో కలసి తలిదండ్రులు చూడాలి? యూత్ చూడాల్సిన సినిమాలు ఏమిటి? కళాత్మక చిత్రం ఏది? ఆయా సర్టిఫికెట్ లను చూసి ఆయా థియేటర్ల లోకి అడుగు పెట్టలేం! ఇక బాలీవుడ్ లో అయితే దేశభక్తి సినిమాలు వరస పెట్టాయి! అవార్డు అందుకోవాలంటే దేశభక్తి అన్నా ఉండాలి లేదంటే మతాల మధ్య చిచ్చు పెట్టే సినిమా అయి ఉండాలి!
హీరో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఏదొక దళానికి అధిపతి అయి ఉండాలి! చివర్లో జాతీయ జెండా ఎగురవేసి ఒక పాట పెట్టి సెల్యూట్ కొడితే చాలు! ఆ సినిమాకు జాతీయ పురస్కారం వచ్చేసినట్లే! లేదా పాకిస్థాన్ దేశాన్ని చిత్తు చిత్తుగా ఖీమా చేసేసి యుద్ధం సన్నివేశాలు మిక్స్ చేసేసి భారత్ మాతా కీ జై అని శుభం కార్డు వేస్తే చాలు! ఎన్ని జాతీయ పురస్కారాలు అయినా వచ్చేస్తాయి!
ఇంకా కాదంటే చారిత్రక సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఏదొక ఆనాటి నాయకుడిని తీసుకుని నాలుగు కల్పిత సంఘటనలు చుట్టేసి తీసి వదిలితే చాలు! చరిత్రను వక్రీకరించినా పరవాలేదు కానీ, “కొన్ని కల్పితాలు” అని డిస్ క్లెయిమర్ వేస్తే చాలు! అవార్డు అయితే గ్యారంటీ! హాల్లో పూనకాలు గ్యారంటీ!
అసలు ఈమధ్య కాలంలో దేశభక్తి, యుద్ధాలు, మత చిచ్చులు, గ్యాంగ్ స్టార్స్ సినిమాలు కాకుండా ఒక్కటైనా “అబ్బ, అద్భుతం” అనే సినిమా చూడగలిగామా! సినిమాలు గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం! మళ్ళీ సెన్సార్ బోర్డులోకి వద్దాం! సెన్సార్ చట్టాన్ని కాదు! బోర్డునే ప్రక్షాళన చేయాలి! సెన్సార్ నిబంధనలను తప్పనిసరిగా పాటించే అవసరమైతే ఎదిరించే సమాజ బాధ్యత కలిగిన వారినే సెన్సార్ బోర్డు సభ్యులుగా నియమించాలి.
ఆరోగ్యకరమైన ప్రజా వినోదం కలిగిన సినిమాలను మాత్రమే ప్రోత్సహించాలి. అప్పుడే కోర్టుల దాకా వెళ్లాల్సిన అవసరం ఉండదు. సినిమా వినోదం ప్రధానం అనే విషయాన్ని ఎప్పుడో మరచిపోయేలా చేసిన మహానుభావులు అందరికి నమస్కారం. కేరళ స్టోరీ 2 సినిమా విషయంలో అసలు సెన్సార్ బోర్డు బుర్ర పెట్టి సినిమా చూసి సెన్సార్ ఇచ్చారా అని హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది! అసలు బుర్రే లేదనే విషయం ఆ న్యాయమూర్తికి ఎవరైనా చెప్పండి పాపం!

