ఆమెలా మరొకరు నటించలేరా ?

Sharing is Caring...

Abdul Rajahussain……..

అసూయ,కుళ్ళుబోతు,చిటచిటలు.పుల్ల విరుపు మాటలు…నంగనాచి పాత్రలకు ప్రత్యామ్నాయమే లేని నటీమణి..ఛాయాదేవి. ఛాయదేవి స్వస్థలం గుంటూరు.1928 లోజన్మించారు. చిన్నతనంలోనే కొంతకాలం నాట్యంలో శిక్షణ పొందారు. సినీనటి కావాలన్న ఆలోచన ఆమెకు మద్రాసు చేరుకునే లా చేసింది. 1953ల విడుదలైన ‘పిచ్చిపుల్లయ్య’ చిత్రం లో ఆమె నటనకు ప్రశంసలు తో పాటు సినీ పరిశ్రమలో గుర్తింపు వచ్చాయి.

‘కన్యాశుల్కం’లో పూటకూళ్ళమ్మ పాత్ర.‌‌ ‘గుండమ్మకథ’లో సూర్యకాంతమ్మకు ధీటైన పాత్ర.అంతా మనమంచికే లో విదుషీమణి భానుమతి గారి పక్కన పోటాపోటీగా నటించిన తీరు మరిచిపోలేనిది..వివిధ పాత్రల్లో నటించే అవకాశాలు క్రమక్రమంగా లభించాయి.భర్తను వెర్రి వెంగళప్పలా భావించి తన చెప్పు చేతల్లో మాటకు ఎదురు చెప్పకుండా ఉండే లా వ్యవహరించే గయ్యాళి పాత్రల్లోఆమె రాణించారు.  

మారుటికూతురుని ఇక్కట్లు పాలు చేసే సవితి తల్లి పాత్రల్లో,కూతురిని ఏడు మల్లెల ఎత్తుగా భావించే తల్లి పాత్రల్లోనే కాకుండా కరుణారస ప్రధానమైన పాత్రల్లో, సాత్విక భూమికల్లో చక్కని అభినయం ప్రదర్శిస్తూ మురిపిం చేది. ఏ పాత్ర అయినా తనదైన శైలిలో ఒప్పించి మెప్పించిన నటీమణి ఛాయాదేవి . వారిది అమృత హస్తం..అద్భుతంగా వండి పెట్టేవారని అంటారు.

సహజ_పాత్రలకుచిరునామా_ఛాయాదేవి ఆడంబరాన్ని,అతిశయాన్ని,గయ్యాళిదనాన్ని,దురహంకారాన్ని, అతి ప్రేమని, గడుసుదనాన్ని తన కళ్లద్వారా,మాటల ద్వారా, చేతులు ఆడించడంలో, నడకలో అద్భుతంగా చూపుతూ, సహజ నటనతో ప్రేక్షకుల అభిమానం చూరగొన్న కేరక్టర్ నటి.పెద్ద పెద్ద కళ్లతో, గుండ్రటి ముఖంతో, బొద్దుగా వుండే పెర్సనాల్టీ కలిగి, పెదవుల కదలికతోనూ చక్కని అభినయంప్రదర్శించే వారు.

సూర్యకాంతం, ఛాయాదేవి కాంబినేషన్ చూడటానికి రెండు కళ్ళూ సరిపోయేది కావు.’మాయా బజార్’ చిత్రంలో రేవతీదేవిగా హుందా నటనతోఆకట్టుకుంది.’పిచ్చి పుల్లయ్య’ చిత్రంలో జమిందారిణిగా, వితంతువు పాత్రలో గుమ్మడి పెత్తనాన్ని కాదన లేక,అన్నిటినీ అంగీకరించ లేని మహిళగా నటించి మెప్పించింది.

‘శ్రీకృష్ణార్జునయుద్ధం’లో రేవతి దేవి పాత్రలో మరోసారి నటించింది. ఈ చిత్రంలో మిక్కిలినేని బలరాముడు గా నటించారు.’ప్రమీలార్జునీయం’లో సేనాని రణచండి లా, ‘మోహినీ భస్మాసుర’లో శచీదేవిగా,’కృష్ణావతారం’లో శిశుపాలుడుగా నటించిన రాజనాల తల్లిగా,’శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు’ కథలో నిరంభరాజుగా నటించిన ఎస్.వి.రంగారావు రాణిగా నటించింది.

‘ఇవి పిడకలు కొట్టిన చేతులే నాతో పెట్టుకోకు’ అని పెడసరంగా సావిత్రితో ‘గుండమ్మకథ’లో హెచ్చరించడం గుర్తుండి వుండే వుంటుంది. అలాగే ఆ చిత్రంలోనే సూర్యకాంతాన్ని చూస్తూ నువ్వు మాత్రం ఏంతక్కువ తిన్నావే మొగుడు చచ్చినా బర్మా ముడివేసుకుని మహిళా మండలిలో తైతక్కలాడుతున్నావే అనడం సూర్యకాంతంతో కలిసి ఫైట్ చేస్తూ అవకాశం దొరక గానే తన్నుతూ గదిలో పెట్టి గొళ్లెం పెట్టె సన్నివేశాలలో ఆమె నటన ఆకట్టుకుంటుంది.

ఆ తరువాత ఎన్.టి.రామారావు వచ్చి గుండక్క ఏదీ అని అడిగితే ‘దానికి తగిన శాస్తి జరిగింది. నా మీదకూడా ఎగరబోతే నాలుగు చితకబాది ఆ దొడ్లో పడేసా’ అంటుంది ..తన టెంపరితనం చూపడంలో హాస్యంతో బాటు చూసే వారికి ఆమె మీద కోపమూ వస్తుంది. అలా దుర్గమ్మగా వివిధ సందర్భాలలో రెచ్చిపోయిన సన్ని వేశాలు ఎప్పటికీ తాజాగానే వుంటాయి.’నవరాత్రి’ చిత్రంలో సూర్యకాంతంతో కలిసి రాక్‌ఎన్‌ రోల్ డ్యాన్స్ చేసిన తీరు గొప్పగా వుంటుంది.

‘నిండుదంపతులు’ చిత్రంలో ధనిక గృహిణి దుర్గమ్మ అయినా డబ్బు కక్కుర్తితో కౌలుదారు సత్యనారాయణతో కుమ్మక్కై మోసం చేయడం,అది గుర్తించిన బాలయ్య ముందు వరదల్ని వానల్ని మనమాపగలమా! బాబు అని సన్నాయి నొక్కులు నొక్కడంలో ఆమెకు ఆమే సాటి.!మీనా సినిమాలో ఛాయాదేవి డైలాగులు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. ‘మీ నాయన .. మా ఆయన కావాల్సిందే’ అంటూ ఏడ్చే సన్నివేశాలు అలరిస్తాయి.

చివరి రోజుల్లో సినిమాలు తగ్గడంతో ఆమె ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఆర్ధికంగా  ఇబ్బందులు పడ్డారు.. ఛాయాదేవి సుమారు 200 చిత్రాలలో నటించారు. 1983 సెప్టెంబర్ 4న లోకాన్ని.. వదిలి ఛాయాదేవి వెళ్ళిపోయారు.!!

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!