‘ఆయుష్షు’ని యోగ ద్వారా పెంచుకోవచ్చా ?

Sharing is Caring...

“పూర్వకాలంలో ఆయు మార్పిడి అంటే ఒకరి ఆయువు(ష్షు) ను మరొకరికి ఇచ్చుకునే వారంట కదా.. అవి కేవలం కథలా? కల్పనా? అదేమైనా విద్యా? యోగసాధనలో సాధ్యమా?… మా సందేహం తీర్చ ప్రార్థన.” రాజేశ్వరి గారి ప్రశ్నకు  జవాబు ఇది .  ఆయుష్షును పెంచుకునే మార్గం మనది … ఇక, ఆయుష్షును ఇంకొకరికి ఇవ్వటం ఏమిటి … మార్గం చూపి ప్రయాణం చేయమనటమే . అయినా సంపాదనలో కొంత ఇవ్వటానికే అడుగులు తడబడుతుంటే ఇక ఆయుష్షు బదిలీ మాటకి అస్తిత్వమే లేదు.ఇక, పరకాయ ప్రవేశం … మన కాయంలోకే ప్రవేశించలేని మనుగడలో పరకాయ ప్రవేశం చేయగలిగే తలకాయ మనకు ఉండాలి కదా! అయినా యోగమార్గంలో ట్రాన్స్ స్టేట్ ఉంది కదా … పరకాయానికే కాదు పరంలోకీ ప్రయాణించగలం – ఇహం నుండి, మన తలకాయ నుండి తొలగ గలిగితే !?
***
ఈ సృష్టిలో ట్రూత్, ట్రిక్ అంటూ రెండు స్థితులు ఉన్నాయి. ట్రూత్ కాలాతీతం, శాశ్వతం. ట్రిక్ కాలానికి పరిమితం, అశాశ్వతం. మన ఆత్మ ఏ భౌతికానికీ లోబడనటువంటిది. కాని మనిషి ఆయుష్షు మాత్రం కాలానికి, భౌతికానికి పరిమితం. కాబట్టి ఆయుర్దాయం ట్రిక్ లెవెల్ కే పరిమితం.ఆయుష్షును ఒక జీవి నుండి మరో జీవికి బదిలీ చేయటం సాధ్యపడదు … సృష్టి ధర్మానికి విరుద్ధం కూడా. అయితే యౌగికంగా ఆయుర్దాయాన్ని పొడిగించటం సాధ్యం. ఇలా మన ఆయుర్దాయాన్నీ పెంచుకోవచ్చు, ఇతరుల ఆయుష్షునూ పెంచగలం. అయితే ట్రూత్ లెవల్ కి చేరుకుంటే తప్ప ఆయుర్దాయం పెరగదు … అంటే, ట్రూత్ కి ప్రతినిధి కావాలి … ట్రూతే ‘నేను’ కావాలి.
మహాత్ములు, మహర్షులు, మాస్టర్లు యోగమగ్నమైంది ఇలా ఆయుర్దాయాన్ని పెంచటానికి, సాధించటానికి.
మృత్యువుతో పోరాడటం ప్రతి యోగీ చేస్తున్నదే … ఒకటి రెండు శతాబ్దాల క్రితం ఒక రమణ మహర్షి, ఒక అరవిందుడు, ఒక మాస్టర్ సి.వి.వి. వంటివారు చేసిన యోగా ప్రయోగాలు ఈ దిశగానే సాగాయి. వారు మృత్యువును భౌతికం నుండి పూర్తిగా తొలగించలేకపోయినా ఆయుర్దాయాన్ని పెంచగలిగారు.
***
రమణ మహర్షి చిన్ననాటనే మృత్యువాతపడి, మృత్యువుతో తలపడి, మృత్యువు తన దరిదాపులకు రాకుండా చేసుకోగలిగాడు తన దయిన ధ్యాన మార్గంలో … ఎప్పటికయినా మృత్యు స్థితిని అందుకోవలసిందే అన్న నిర్ణయానికి వచ్చారు.
1886 జూలై నెలలో ఒకరోజు పదహారేళ్ళ రమణ మహర్షి, అప్పటికి ఇంకా వెంకటరామనే, ఆరోజు తాను మరణించబోతున్నట్టు బాగా ఫీల్ అయి, కొంత మరణభీతికి గురి అయ్యాడు. ఆ భయం నుండి మృత్యువును తప్పించుకోవటం ఎలా అని ఆలోచిస్తూ, తనకు తానుగా మృత్యు రహిత స్థితికి మార్గం కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ అన్వేషణలో ‘నేను’ అంటే ఆత్మ అని, ఆత్మ ఆవిష్కరణే ఈ మానవ దేహం అని, దేహం నశించినా ఆత్మ శాశ్వతంగా ఉంటుందన్న నిర్ణయానికి వచ్చాడు. మృత్యు స్థితి దేహానికి కాని ఆత్మకు మృత్యువు లేదని బలంగా విశ్వసించాడు. అంటే నేనుకు మృత్యువు లేదన్నమాట … మృత్యు స్థితికి అతీతమైంది ‘నేను’. దేహం నశించటం అనే మృత్యు స్థితిని మనసు నుండి తొలగించి, దేహాతీతంగా మానసాతీతంగా ఆత్మను శాశ్వత అంశగా నిర్ధారించాడు. ఇలా రమణ మహర్షి తన ఆయుర్దాయాన్ని పెంచుకుని, మన ఆయుర్దాయం పెంచుకోవటానికి మార్గం సుగమం చేసాడు.
***
‘మృత్యువు శాశ్వతత్వానికి సరళ మార్గం’ అని అంటారు అరవింద మహర్షి తమ ‘సావిత్రి’ మార్మిక ప్రబంధంలో. ‘అతని మహా జీవితానికి మృత్యువు తొలి ఆలంబన … ఆత్మకు మృత్యువే అవకాశం’ అని అంటాడు సత్యవంతుని మరణాన్ని గురించి. మొత్తానికి అరవిందుల యోగం సాగింది ‘మృత్యు రహిత స్థితి’ గురించే.
అరవింద మహర్షి సాగించిన యోగ ప్రయాణమంతా మృత్యువుతో సాగించిన ప్రయాణమే! మృత్యువును వీలయినంత వెనక్కు జరపటమే! అరవింద విరచిత ‘సావిత్రి’ మార్మికంగా, సంకేతంగా ప్రస్ఫుటం చేస్తున్నది ఇదే!
సావిత్రి సత్యవంతుడిని జీవిత భాగస్వామిని చేసుకుందే కాని తన ఆయుర్దాయంలో భాగస్వామిని చేయలేదు. సత్యవంతుడు మృత్యు ఒడిలోకి చేరినప్పుడు సావిత్రి యమధర్మరాజుల మధ్య జరిగిన వాగ్వివాదమంతా అరవిందుడు మెట్టిన యోగ భూమికల అనుభూతులే! దీన్నిబట్టి స్పష్టమయ్యేదేమంటే యోగమార్గం ద్వారా ఆయుర్దాయాన్ని పెంచుకోగలమని, పెంచగలమని.
***
ఇక, మాస్టర్ సి.వి.వి. ఫిజికల్ ఇమ్మోర్టాలిటీని మానవాళికి అందించేందుకే భృక్తరహిత తారకరాజయోగాన్ని ఆవిష్కరించారు. దేహంపైన, మనసుపైన ‘మాస్టరీ’నీ ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అని అందరికి తెలిసిందే! అయితే గ్రహాల ప్రభావం వల్ల మానవ ఆయుర్దాయం సన్నగిల్లుతోందని, గ్రహాల లోటుపాట్లను సక్రమపరిస్తే తప్ప మానవ ఆయుర్దాయం పెరగదని, ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ సాధ్యంకాదని నిర్ధారణకు వచ్చి ఆ దిశగా యోగ ప్రయోగాలు సాగించారు. ఒక్క కుజ గ్రహం తప్ప తక్కిన గ్రహాలపై వారు ఆధిపత్యం సాధించగలిగారు. ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ పరంగా భూగోళం పైని మట్టి, గాలి, నీరు, నిప్పులపైన కూడా మనిషి తన యోగసాధనతో ఆధిపత్యం సాధించాలని గ్రహించారు. అలాగే ప్రస్తుత మనిషి శరీర నిర్మితిలోను అనేక మార్పులు జరగాలని, నేటి మనిషి ‘నవ మానవుడు’ కావాలని గుర్తించి వారు తమ యోగ మార్గంలో అనేక ప్రయోగాలు చేసి అనేక అనుకూల ఫలితాలను సాధించారు.
తమ తనయుడు చందు బాల్యంలోనే మరణించినప్పుడు తన జీవిత భాగస్వామి వెంకమ్మగారి ద్వారా ప్లెంటి ఆఫ్ ప్రాణా లెవల్స్ నుండి ప్రాణాన్ని తెప్పించి చందును కొంతసమయం బ్రతికించటం జరిగింది. అంతటి యోగశక్తి ప్రపూర్ణులైన మాస్టర్ చందు ఆయుష్షును పెంచే ప్రయత్నం, ప్రయోగం చేశారే తప్ప తమ ఆయుర్దాయంలో కొంత కొడుకుకి బదిలీ చేయటం జరగలేదు.అంటే, ఆయుమార్పిడి అవసరం లేదు … పైగా అనవసర ప్రయత్నం.

————-  Vaasili Vasanta Kumar   సౌజన్యంతో  

ఇది కూడా చదవండి >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>ఇదే విష్ణు ప్రయాగ !

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!