Didi could be an alternative leader ?……………………..ప్రధాని నరేంద్ర మోడీని ఢీ కొనేందుకు విపక్షాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఎన్నికలకు మరో మూడేళ్ళ సమయం ఉండగానే మోడీ కి ప్రత్యామ్నాయ నేత ను ఎంచుకుని ముందుకు వెళ్లే యోచనలో ఉన్నాయి. తెర వెనుక ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. కరోనా నియంత్రణలో వైఫల్యం ఉన్నప్పటికీ, మోడీ ఇప్పటికీ తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు. ఆయనను ఎదుర్కొనే నేతగా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఒక్కరే ఇపుడు అందరికి కనిపిస్తున్నారు.దీదీ కూడా జాతీయ రాజకీయాలపట్ల ఆసక్తి చూపుతున్నారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెను ఓడించడానికి మోడీ యే స్వయంగా రంగంలోకి దిగినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఎన్నివ్యూహాలు అమలు చేసినప్పటికీ మోడీ చరిష్మా అక్కడ పని చేయలేదు.దీనికి తోడు దేశంలో నిరవధికంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యునిలో వ్యతిరేకతను పెంచుతున్నాయి. అలాగే కరోనా నియంత్రణ… వ్యాక్సినేషన్ విషయం లో ఒక ప్రణాళిక .. పద్ధతి లేకపోవడం .. భయం రేకెత్తించే విధంగా కేసుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు అగ్రనేతలను,సంఘ్ పరివార్ నేతలను కలవరపెట్టాయి. ఈ క్రమంలోనే మోడీ నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టారు.
కాగా మోడీకి ధీటుగా అదే స్థాయి బలమైన నేతను సార్వత్రిక ఎన్నికల్లో ప్రాజెక్ట్ చేయలేకపోతే బీజేపీని ఓడించడం కష్టమనే విషయాన్నీ విపక్షాలు గ్రహించాయి. విపక్ష నేతల్లో మోడీ ని ఎదుర్కొనే స్థాయి ఉన్ననేత ప్రస్తుతానికి మమతా ఒక్కరే. అయితే ఏక పక్షంగా దీదీ నాయకత్వాన్ని విపక్షాలు అంగీకరిస్తాయా అనేది కూడా ఇప్పటికి సందేహమే. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ని కాకుండా వేరే నేత ను ఆ పార్టీ అధినాయకత్వం అంగీకరించదు. సంస్థాగత వైఫల్యాలతో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతోంది. ఈ పరిస్థితుల్లో రాహుల్ నాయకత్వంలో విపక్షాలు నడవడం అనేది జరగని పని. శరద్ పవర్ కూడా కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి శివసేనతో కలసి వచ్చే ఎన్నికల్లోపనిచేయాలనుకుంటున్నట్టు వార్తలు ప్రచారం లో ఉన్నాయి.ప్రస్తుతం మహావికాస్ ఆగడీ పేరుతో శివసేన కాంగ్రెస్ ,ఎన్సీపీ కలసి మహారాష్ట్రలో సంకీర్ణ సర్కార్ ను నడిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలనాటికి కాంగ్రెస్ ను వదిలేసే మూడ్ లో ఎన్సీపీ ఉన్నట్టు సామ్నా పత్రికలో రాశారు. కాంగ్రెస్ కి ఇది షాక్ లాంటిదే.శివసేన, ఎన్సీపీ దీదీ కి అనుకూలంగా ఉన్నట్టు చెబుతున్నారు.
అలాగే మమతకు బెంగాల్లో అనూహ్యంగా వామపక్షాలు మద్దతు పలికాయి. గవర్నర్ ను వ్యతిరేకించే విషయంలో మమత కు అనుకూలంగా మాట్లాడుతున్నాయి. ఏమో ముందు ముందు మిగతా విషయాల్లో కూడా రాజీ పడి తృణమూల్ తో కలసి పనిచేయవచ్చు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు.ఈ క్రమంలోనే బీజేపీ యేతర కాంగ్రెసేతర పార్టీలు ఒక కూటమిగా మారి దీదీ ని ప్రత్యామ్నాయ నేతగా ప్రొజెక్ట్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెర వెనుక ఇదే పని లో ఉన్నారు. వివిధ రాష్ట్రాల నేతలతో ఆయన ప్రాధమిక చర్చలు జరుపుతున్నారు. త్వరలో దీదీ స్వయంగా శరద్ పవర్, ఉద్ధవ్, మాయావతి, నవీన్ పట్నాయక్, కేసీఆర్ , జగన్, స్టాలిన్ వంటి ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బెంగాల్లో ఘర్ వాపసీ కార్యక్రమం నడుస్తోంది. తన మేనల్లుడి కి రాష్ట్ర బాధ్యతలు అప్పగించి జాతీయ రాజకీయాలపై మమతా బెనర్జీ దృష్టి సారిస్తారని అంటున్నారు.
ఇక మోడీ తో పోలిస్తే దీదీ కూడా తక్కువేమి కాదు 1984 నుంచి ఆమె రాజకీయాల్లో ఉన్నారు. కేంద్రమంత్రి గా బీజేపీ,కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఎన్నో పదవులు నిర్వహించారు.మూడోసారి సీఎం గా చేస్తున్నారు. స్పష్టమైన పొలిటికల్ విజన్ తో పాటు పాలనా సామర్థ్యం ఉంది.
చూద్దాం …ఎన్నికలకు ఇంకా బోలెడు సమయం ఉంది. ఎందరు దీదీ కి మద్దతుగా ముందుకొస్తారో ? ఇంకెవరైనా నేతలు కొత్తగా తెరపైకి వస్తారేమో ?
—————-KNM